చిరంజీవికి కరోనా.. RRR, ఆచార్య, బిగ్‌బాస్‌‌లపై ప్రభావం

  • Published By: vamsi ,Published On : November 9, 2020 / 11:47 AM IST
చిరంజీవికి కరోనా.. RRR, ఆచార్య, బిగ్‌బాస్‌‌లపై ప్రభావం

ఆచార్య సినిమా షూటింగ్‌కు వెళ్లేందుకు కరోనా టెస్ట్‌లు చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్-19 టెస్ట్‌ల్లో రిజల్ట్ పాజిటివ్ అని రాగా, ఆయనకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెల్లడిస్తూ నాలుగైదు రోజులుగా తనను కలిసినవారిని టెస్ట్ చేయించుకోవాలని కోరారు.



ఈ క్రమంలో చిరంజీవికి కరోనా వచ్చిన ప్రభావం మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఆచార్య, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలపైనే కాకుండా బిగ్‌బాస్ షో మీద కూడా పడే అవకాశం ఉంది. కరోనావైరస్(Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు. అయితే అన్ లాకింగ్ ప్రక్రియలో భాగంగా ఇవాళ(09 నవంబర్ 2020) నుంచి ఆచార్య షూట్ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఇప్పుడు ఆ షూటింగ్‌కు బ్రేక్ పడింది.



ఆచార్య సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవికి కరోనా రాగా.. రామ్‌చరణ్ కూడా హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి, ఈ పరిస్థితిలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా షూటింగ్ వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఈ మూవీ తాజాగా కరోనా తర్వాత పట్టాలెక్కింది. కోకాపేటలోమ షూటింగ్ జరుగుతుంది. 2018 నవంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమాపై టైటిల్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ వరకు అన్నింటిలోనూ బెస్ట్‌గా ఉండేలా ప్లాన్ చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు.



ఇక ఇటీవలే నవంబర్ 7వ తేదీన అంటే రెండు రోజుల ముందే చిరంజీవి, నాగార్జునతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిశారు. దీంతో నాగార్జున కూడా క్వారంటైన్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే, బిగ్‌బాస్ షో హోస్ట్ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.