Telugu News
లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ సినీ మైలురాళ్లు

Publish Date - 9:54 am, Fri, 22 February 19

By

director kodi ramakrishna no more

సీనియర్‌ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పాలకొల్లులో నరసింహ మూర్తి, చిట్టెమ్మ దంపతులకి ఆయన జన్మించారు. 1982 లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా డైరెక్టర్‌‌గా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్‌లో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. ‘అమ్మోరు’, ‘అరుంధతి’ సినిమాలు ఆయనకు పేరు తెచ్చాయి. 
Read Also: కోడి రామకృష్ణ కన్నుమూత

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాల్ని తెరకెక్కించి పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. తెలుగులో 150కిపైగా చిత్రాలు తీసి గిన్నిస్‌ రికార్డుని సొంతం చేసుకొన్న దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు శిష్యుడే కోడి రామకృష్ణ. 100 చిత్రాల మైలురాయిని అందుకొని గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకొన్నారు. తెలుగులో 100కి పైగా చిత్రాలు తెరకెక్కించిన నలుగురు దర్శకులు దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు కావడం విశేషం. 

జీవిత విశేషాలు : 
పాలకొల్లులో నరసింహ మూర్తి, చిట్టెమ్మ దంపతులకి జన్మించిన ఆయన ప్రాథమిక విద్యని పాలకొల్లులోనే పూర్తి చేశారు. కళాశాలలో చదువుతున్న సమయంలో పెయింటింగ్‌ వృత్తిని ఎంచుకొన్నారు. పగలంతా చదువుకొంటూ, రాత్రిళ్లు అజంతా పెయింటింగ్స్‌ అనే కమర్షియల్‌ పెయింటింగ్‌ షాప్‌ని నిర్వహించేవారు. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తండ్రి ‘మన వంశంలో డిగ్రీ వరకు చదువుకొన్నవాళ్లు లేరు. నువ్వు డిగ్రీ పూర్తి చేయాల’ని చెప్పడంతో అప్పట్నుంచి చదువుపైనే దృష్టిపెట్టారు. చిన్నప్పట్నుంచీ కోడి రామకృష్ణకి నాటకాలపై మక్కువ. దాంతో చదువుకొనే రోజుల్లోనే నాటకాల్లో కీలక పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకొన్నారు.
Read Also: స్టయిలిష్ డైరెక్టర్ : హెడ్ బ్యాండ్, వీరతిలకం, చేతికి దారాలు..

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాత మనవడు’ చూశాక, దర్శకుడిగా పనిచేస్తే ఈయన దగ్గరే పని చేయాలని నిర్ణయించుకొన్నారట. ఆ సినిమా అర్ధ శతదినోత్సవం పాలకొల్లులో జరుగుతుండడంతో, అక్కడే దాసరి నారాయణరావుని కలవాలని నిర్ణయించుకొన్నారు. అయితే ఊహించని రీతిలో ఆ వేడుకలో గొడవలు చోటు చేసుకోవడం, ఆ గొడవల్లో కోడి రామకృష్ణ స్నేహితులూ ఉండటంతో.. కార్యక్రమం తర్వాత చిత్ర నిర్మాత కె.రాఘవకీ, దర్శకుడు దాసరి నారాయణరావుకీ అందరి తరఫునా క్షమాపణలు చెప్పారు కోడి రామకృష్ణ. అదే సందర్భంలోనే తాను మీ దగ్గర పనిచేయాలని ఉందనే కోరికని కూడా దాసరి ముందు బయటపెట్టారు. ‘డిగ్రీ పూర్తి చేసి రా, అప్పుడు చూద్దాం’ అని ఆయన చెప్పడంతో, ఆ మాట ప్రకారమే పట్టా అందుకొన్నాక ఒక ఉత్తరం రాశారు.
Read Also: సినీ పుత్రుడు : కోడి రామకృ‌ష్ణ నటుడిగా ప్రయత్నాలు

వెంటనే బయల్దేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్‌ అందడంతో కోడి రామకృష్ణ మద్రాసు రైలెక్కారు. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ అనే చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఇచ్చారు దాసరి. ఎలాగైనా తన గురువుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ చేతుల మీదుగానే, తానూ పరిచయం కావాలని నిర్ణయించుకొన్న కోడి రామకృష్ణ ‘తూర్పు పడమర’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తాను అనుకొన్నట్టుగానే కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు.

ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. ‘శత్రువు’, ‘లాఠీచార్జ్‌’, ‘రిక్షావోడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’ ‘మువ్వ గోపాలుడు’, ‘మావూరి మహారాజు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘భారత్‌ బంద్‌’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘పోలీస్‌ లాకప్‌’, ‘పుట్టింటికి రా చెల్లి’, ‘పెళ్ళికానుక’… ఇలా ఆయన్నుంచి మరపురాని చిత్రాలెన్నో వచ్చాయి. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవుళ్లు’, ‘దేవీపుత్రుడు’ చిత్రాలతో సాంకేతికకంగా కోడి రామకృష్ణ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పాయి. వాటిలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఆయన ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు.