‘జాంబీ రెడ్డి’.. ఏ కమ్యూనిటీని త‌ప్పుగా చూపించే సినిమా కాదు..

10TV Telugu News

‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. యానిమేషన్‌తో రూపొందించిన టైటిల్ లోగోను రిలీజ్ చేయగా ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం. అయితే ‘జాంబీ రెడ్డి’ టైటిల్‌ను ఒక క‌మ్యూనిటీకి ఆపాదించి, త‌ప్పుగా అర్థం చేసుకుంటున్న‌ట్టు ఇటీవల డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ దృష్టికి వ‌చ్చింది. దీంతో ఆయన వివ‌ర‌ణ ఇచ్చారు.

‘ఇటీవ‌ల ప్రకటించిన ‘జాంబీ రెడ్డి’ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజ్‌లు వ‌చ్చాయి. సినిమాకు అది సరిగ్గా సరిపోయే టైటిల్‌. యానిమేష‌న్ కోసం మూడు నెల‌ల‌కు పైగానే వ‌ర్క్ చేశాం. ప‌డిన క‌ష్టానికి మంచి ఫలితం వచ్చిందని మేమంతా హ్యాపీగా ఉన్నాం. అయితే కొంత‌మంది టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం లేదు. ప్ర‌త్యేకించి ఒక కులాన్ని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దు.

ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నేపథ్యంలో క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌ ఇది. ఇలాంటి మ‌హ‌మ్మారితో కర్నూలు ప్రజలు ఎలా ఫైట్ చేసి, ప్ర‌పంచాన్నంతా కాపాడ‌తార‌న్న‌ది ఈ సినిమాలోని ప్ర‌ధానాంశం. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దు. నా తొలి సినిమా ‘అ!’కు జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తే, ఈ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. సినిమా చూసి అంద‌రూ గ‌ర్వంగా ఫీల‌వుతార’ని ప్రశాంత్ వర్మ తెలిపారు.

10TV Telugu News