ప్రధాని మోడీకి లేఖ రాసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్

  • Published By: vamsi ,Published On : October 21, 2019 / 06:06 AM IST
ప్రధాని మోడీకి లేఖ రాసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్

వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ బయపెడుతున్న అంశం.. మన దేశంలో కూడా ఇప్పుడు వాతావరంణంలో మార్పులు అనే విషయం భయం పుట్టిస్తుంది. ఈ క్రమంలో ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేటెస్ట్‌గా ఓ లేఖను రాశారు డేరింగ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నేపధ్యంలో పూరీ జగన్నాథ్ ప్రనధానికి లేఖ రాశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినంత మాత్రాన పర్యావరణం బాగుపడదని, అందుకోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానికి పూరీ సూచించారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు పూరీ జగన్నాథ్. 
 
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య వాతావరణ మార్పు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పునకు ప్లాస్టిక్ వాడకం కూడా ఒక కారణం. అయితే అదొక్కటే కారణం కాదని అన్నారు పూరి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. 1960వ దశకంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల కాగితపు సంచుల వాడకం తగ్గి.. చెట్లు, అడవులను కొట్టేయడం తగ్గింది. మళ్లీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధిస్తే కాగితపు బ్యాగ్‌లు వాడడం మొదలు పెడతారు.

అప్పుడు చెట్లను, అడవులను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే అవి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి. అందుకే ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించారు పూరీ జగన్నాథ్.

ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ యూనిట్‌లను నెలకొల్పాలని కోరారు పూరి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకొస్తే డబ్బులిస్తామని ప్రకటిస్తే ప్రజలే ఆ యూనిట్లకు వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తీసుకొస్తారని చెప్పారు. ఇలాంటి మరిన్ని చర్యలు చేపడితే ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని కొంతవరకు కాపాడుకోచ్చునని చెప్పారు పూరీ జగన్నాథ్.

తన లేఖలో ఇంకా వాతావరణం మార్పులకు సంబంధించిన కారణాలను, వాటికి పరిష్కారాలను పూరి రాసుకొచ్చారు.