సుశాంత్ సింగ్ మృతిపై శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు… అదిరిపడిన బాలీవుడ్

  • Published By: bheemraj ,Published On : June 15, 2020 / 06:08 PM IST
సుశాంత్ సింగ్ మృతిపై శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు… అదిరిపడిన బాలీవుడ్

ప్రముఖ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతిపై బాలీవుడ్ దర్శక, నిర్మాత శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన వ్యక్తులు తనకు తెలుసని వ్యాఖ్యానించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్ననేపథ్యంలో శేఖర్ కపూర్ ఇలా స్పందించడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

”సుశాంత్ నువ్వు పడ్డ బాధ తెలుసు. నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల గురించి తెలుసు. వారి చర్యలను భరించలేక నువ్వు నా భుజాలపైపడి కన్నీరు పెట్టుకున్నావు. 6 నెలల నుంచి నేను నీకు దగ్గరగా ఉండి ఉన్నా లేదా నువ్వు నన్ను కలిసి ఉన్నా బాగుండేది. నీకు ఇలా జరగడం వారి కర్మ.. నీది కాదు సుశాంత్” అని శేఖర్ కపూర్ ట్వీట్ చేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(34) ఆత్మ‌హ‌త్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వచ్చినా ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఇది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన మామ అనడం మరిన్ని సందేహాలకు దారితీసింది. 

ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్టుమార్టం రిపోర్టులో ఏమొస్తుందా అని అంతా ఎదురుచూశారు. చివరకు సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. సుశాంత్ ది ఆత్మహత్యే అని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఉరి కారణంగా సుశాంత్ మరణించాడని రిపోర్టులో ఉంది. 

సుశాంత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే శరీరంలో విషపూరితాలు ఏమైనా ఉన్నాయో లేదో టెస్ట్ చేసేందుకు అవయవాలను జేజే ఆసుపత్రికి పంపారు. అసలు సుశాంత్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడనేది అంతు చిక్కడం లేదు. పెద్ద మిస్టరీగా మారింది. 

పోలీసులు ఆ మిస్టరీని ఛేదించే పని ఉన్నారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతో సుశాంత్ సూసైడ్ కేసుని పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కాగా, సుశాంత్ ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. సోమవారం(జూన్ 15,2020) డాక్టర్ ఆర్‌ఎన్ కోపర్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.