మాస్ మహారాజా ‘డిస్కో రాజా’ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : January 24, 2020 / 10:08 AM IST
మాస్ మహారాజా ‘డిస్కో రాజా’ రివ్యూ

మాస్ మహారాజా రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘డిస్కో రాజా’ రివ్యూ..

మాస్ మహారాజా రవితేజ మళ్ళీ ఫామ్‌లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే తన రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా ఈసారి ఒక సైన్స్ ఫిక్షన్‌తో కూడిన కమర్షియల్ కథను సెలక్ట్  చేసుకున్నాడు. అదే ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ లాంటి డిఫరెంట్ మూవీస్ తెరకెక్కించిన వి.ఐ.ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ‘నేల టిక్కెట్’ సినిమాతో బాగా నష్టపోయిన నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి రవితేజపై నమ్మకంతో ఈ సినిమా నిర్మించాడు. మరి మాస్ మహారాజా హిట్ అందుకున్నాడా? లేదా.. చూద్దాం. 

Image
కథ విషయానికి వస్తే :
వాసు ఒక అనాథ. వాసు లాంటి కొంత మంది అనాథలను ఒక పెద్దాయన చేరదీసి పెంచుతాడు. ఈ కుటుంబానికి వాసు పెద్ద దిక్కులా ఉంటాడు. అయితే, పెద్దాయన అనాథలను చేరదీసి సొంత బిడ్డల్లా చూసుకోవడం అతని ఒక్కగానొక్క కొడుక్కి నచ్చదు. వ్యసనాలకు బానిసై తండ్రి దగ్గర నుంచి డబ్బులాక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలో పాప ఆపరేషన్ కోసం కుటుంబం అంతా కలిసి సంపాదించిన రూ.25 లక్షలను పెద్దాయన కొడుకు కాజేస్తాడు. ఆ డబ్బుతో గోవా పారిపోతాడు. అతడిని వెతికి పట్టుకోవడానికి వాసు వెళ్తాడు. రోజులు గడుస్తాయి కానీ వాసు తిరిగిరాడు. 
ఇంత‌లోనే మంచు కొండ‌ల్లో గ‌డ్డక‌ట్టుకుపోయిన ఓ మృత‌దేహం లద్దాఖ్‌లో శాస్త్రవేత్తలకు దొరుకుతుంది. దాన్ని సొంతం చేసుకున్న శాస్త్రవేత్తలు ప్రయోగం మొద‌లుపెడ‌తారు. ఆ దేహానికి మ‌ళ్లీ ప్రాణం పోస్తారు. కానీ అత‌నెవ‌ర‌న్నది మాత్రం క‌నిపెట్టలేరు. అతను బ్రతికినా.. గతం మర్చిపోతాడు. ఇంత‌లోనే డిస్కోరాజ్ కొడుకే ఈ వాసు అయి ఉంటాడని విలన్ బ‌ర్మాసేతు గ్యాంగ్‌అతన్ని చంపడానికి ట్రై చేస్తుంటారు. ఇంత‌కీ డిస్కోరాజ్ ఎవ‌రు? అత‌నికీ వాసుకీ సంబంధ‌మేమిటి? 1980ల్లో డిస్కోరాజ్‌కీ, బ‌ర్మాసేతుకీ మ‌ధ్య ఏం జ‌రిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఓ మనిషి సడన్‌గా చనిపోతే.. అనే ప్రశ్నే అర్ధం లేనిది. చాలా మరణాలు సడన్‌‌గానే జరగుతాయి. అప్పుడు చాలా పనులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. వాటిని పూర్తి చేసుకోవడం కుదరదు. అలా కుదరదు కనుకే హత్యలు జరుగుతాయి. కాదు కాదు కుదరదనే నమ్మకమే హత్యలు చేయిస్తుంది. అలాంటి నమ్మకం మీద దెబ్బ కొట్టేందుకు తీసిన సినిమా ‘డిస్కో రాజా’. 

Image
ఎయిటీస్‌లో బాగా పాపులర్ అయిన డిస్కో బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఓ డాన్ రివేంజ్  చరిత్ర ఇది. ఫస్టాఫ్ చాలా ఫాస్ట్‌గా ఆడియన్స్‌లో క్యూరియాసిటీ లెవెల్స్ పెంచేందుకు ప్రయత్నిస్తూ బాగానే లాక్ చేశాడు థ్రిల్లర్ జానర్ మీద పట్టున్న దర్శకుడు వి.ఐ ఆనంద్. అయితే ఆ పట్టు సెకండాఫ్‌కి వచ్చే సరికి సడలింది. ముఖ్యంగా క్లైమాక్స్ అంత లాక్కుండా ఉండే బాగుండేది. ఆడియన్స్‌ని థ్రిల్ చేయడానికి పన్నిన వ్యూహమే దెబ్బతినేసింది. నిజానికి అంతకన్నా ప్రీ క్లైమాక్స్ దగ్గరే సినిమాను ముగించేసి ఉంటే బాగుండేది. లేదూ.. బాబీ సింహా పాత్రను చంపేయకుండా నడిపించి ఉన్నా బాగుండేది. ఏది ఏమైనా రిలీజైన సినిమా అచ్చైన అక్షరం మార్చలేం కనుక అలా జరిగిపోయింది.  
ఈ పొరపాట్లు దర్శకుడు తర్వాత సినిమాల్లో సరిచేసుకునే అవకాశం ఉంది అని చెప్పడమే. ఓ థ్రిల్లింగ్ క్లైమాక్స్ ప్లాన్ చేయకుండా ఉంటే చాలా బాగుండేది. మరణించిన మనిషిని మూలికా వైద్యంతో ఓ మాంత్రికుడు బ్రతికించి తిరిగి ఈ ప్రపంచంలోకి ప్రవేశ పెట్టినట్టు గతంలో చాలా జానపద కథలు వచ్చాయి. ఇలాంటిది చదవడానికి బాగుంటాయి గానీ సినిమా తీసేప్పుడు చాలా కావాలి. ఆ చాలా వదిలేశాడు డైరక్టర్. 
ఇక నటీనటుల విషయానికి వస్తే :
రవితేజ డిస్కో రాజాగా ఇరగదీశాడు. తన బాడీ లాంగ్వేజ్‌కి పూర్తిగా తగ్గ పాత్ర ఇది. దాన్ని అంతే ఎనర్జిటిక్‌గా నడిపించేశాడు. సినిమా కథ పరంగా హీరో వయసు తగ్గిపోయినట్టు చూపించినప్పటికీ  అది రవితేజకూ వర్తించేలా ఉంది. డాన్సులు కూడా చాలా బాగా చేశాడు. డిస్కోరాజాగా రవితేజ చేసిన సీన్లన్నీ చాలా బాగా వచ్చాయి. కమెడియన్స్ అందరూ వెన్నెల కిషోర్ నుంచి ప్రారంభించి జబర్దస్త్ బ్యాచ్ వరకు అందరూ బాగా చేశారు. 
విలన్‌గా బాబీ సింహా రవితేజకు ధీటుగా నటించాడు. అతని ప్రెజన్స్ బాగా ఎలివేట్ అయ్యింది. ఆ మధ్య ఆర్ఎక్స్100 లో తెలుగు ఆడియన్స్‌కు రీ ఇంట్రడ్యూస్ అయిన రాంకీ మరోసారి ఓ పాజిటివ్ రోల్‌లో బాగా చేశాడు. 
హీరోయిన్స్ గురించి చెప్పాలంటే నభా నటేష్ ది కేవలం గ్లామర్ పాత్ర. అయితే దాని నిడివి చాలా తక్కువ. ఉన్నంతలో తను బాగానే చేసింది. మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో నటించే ప్రయత్నం చేసింది. కొంత మేర సక్సెస్ అయ్యింది కూడా. హీరో నుంచి బయటకు వచ్చి ఈ మధ్య కమెడియన్‌గా తిరిగి జండా ఎగరేయాలనే ప్రయత్నంలో ఉన్న సునీల్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుదామనుకున్నాడు గానీ.. ఇంకొంచెం  ప్రాపర్‌గా డిజైన్ చేసుంటే బాగుండేది. 
నిజానికి ఒకప్పుడు సునీల్ కన్న కలే అది. దాన్ని త్రివిక్రమ్ దారి మళ్లించాడు. రాజనాలతో కామెడీ చేయించి సక్సస్ అయిన కె.వి.రెడ్డి గారి స్పూర్తితో అనుకుంటా విలన్ పర్సనాల్టీతో కామెడీ చేయడం ప్రారంభించాడు త్రివిక్రమ్ సునీల్‌తో.. అది బాగానే వర్కౌట్ అయ్యింది.

Image
టెక్నీషియన్స్ విషయానకొస్తే : 
థ్రిల్లర్ జానర్ సినిమాలు చేయడంలో ఉన్న సులువును పట్టుకున్న దర్శకుడు ఆనంద్ కథ మీద ఇంకాస్త వర్కౌట్ చేసుంటే బాగుండేది. ఆడియన్స్‌ను థ్రిల్ చేయాలనుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఉండాలి అనే విషయం మనసులో పెట్టుకోవడం మంచిది. చనిపోయి ముప్పై ఏళ్లైన తర్వాత ఓ మనిషి బ్రతకడం చనిపోయినప్పుడున్న వయసుతోనే ఇప్పుడూ సంచరించడం లాంటి అంశాల వెనుక లాజిక్ వెతకాలనుకుంటే  కమర్షియల్ సినిమాలు చూడకుండా ఉండడమే మంచిదని చాలా కాలం క్రితం దర్శక నిర్మాత క్రాంతికుమార్ గారు చెప్పారు. 
ఇక థమన్ సంక్రాంతి బరిలో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ‘అలవైకుంఠపురంలో’ ఇచ్చిన ఊపుకు తోడు ఎయిటీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అవడంతో తనకు మరో అద్భుతమైన అవకాశం దొరికినట్టు అయ్యింది. ఆర్‌డి బర్మన్ నుంచీ బప్పీలహరి మీదుగా సంగీతాన్ని నడిపించేశాడు. డీఓపీ కార్తీక్ ఘట్టమనేని సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అయ్యాడు. డైలాగ్స్ విషయంలో అబ్బూరి రవి కొన్ని సార్లు మెరిశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా చెప్పాలంటే : 
క్లైమాక్స్ సాగతీత పక్కన పెట్టేస్తే ఓవరాల్‌గా సినిమా బాగానే వచ్చింది. అయితే క్లైమాక్స్ లాంటి లోపాల కారణంగా ఇది యావరేజ్ సినిమాగానే మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. పదిహేను కోట్లతో తీసిన ఈ సినిమా ఇరవై కోట్ల పైన బిజినెస్ చేసింది. బయ్యర్స్‌ను కూడా నష్టపరిచే అవకాశం లేదు.  మాస్ మహారాజా నుండి వచ్చిన సేఫ్ ప్రాజెక్ట్‌గా దీన్ని ఖాతాలో వేసుకోవచ్చు. అలా ఫ్లాపుల నుంచీ కాస్త బెటర్ స్టేజ్‌కి వచ్చాడు రవితేజ. ఇప్పుడు సెట్స్ మీదున్న ‘క్రాక్’ సినిమాతో ఆయన మరోసారి బాక్సాఫీసు దగ్గర తన స్టామినా ప్రూవ్ చేసుకుంటాడని ఆశిద్దాం. 

ప్లస్ పాయింట్స్ 
రవితేజ నటన 
కెమెరా పనితనం 
అబ్బూరి రవి డైలాగ్స్
ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్ 
థమన్ సంగీతం 

మైనస్ పాయింట్స్ 
తడబడిన సెకండాఫ్ 
రొటీన్ సన్నివేశాలు 
హీరో, విలన్‌ల మధ్య బలమైన కాన్ఫిక్ట్ లేకపోవడం 
మెయిన్ విలన్‌ను ప్రాపర్‌గా హ్యాండిల్ చేయకపోవడం 
సన్నివేశాల సాగతీత 
ఆడియన్స్‌ను థ్రిల్ చేయని క్లైమాక్స్..