దిశ సినిమాను ఆపేయండి హైకోర్టులో పిటిషన్

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 01:41 PM IST
దిశ సినిమాను ఆపేయండి హైకోర్టులో పిటిషన్

Disha film : దిశ ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మిస్తున్న సినిమాపై దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తక్షణమే ఈ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ కోరారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌రావు విచారించారు.



తమను సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు సినిమా తీయడం సరికాదన్నారు. కూతురును పోగొట్టుకున్న బాధలో ఉన్న తమను సినిమా తీసి మమ్మల్ని మరింత బాధపెట్టొద్దని ఆయన కోరారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై పిటిషనర్‌ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయలేదని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు.



అయితే తాము స్టేట్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశామని దిశ తండ్రి తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. ఇప్పటికైనా త్వరితగతిన పిటిషనర్‌ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెన్సార్‌ బోర్డును ఆదేశించారు.



యథార్థ సంఘటనలను సినిమాలుగా మరలుస్తూ..వివాదాల్లో నిలుస్తుంటారు వర్మ. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ లో తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే.



దిశపై అత్యాచారం, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్.. దీని ఆధారంగా ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్స్, టీజర్ విడుదల చేశారు కూడా.