Drugs‌ Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు.. సెప్టెంబర్ 8న ఈడీ ముందుకు రానా

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో ఈడీ తీగ లాగుతోంది. డ్రగ్స్‌, మనీ లాండరింగ్‌ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే ముగ్గురిని విచారించింది.

Drugs‌ Case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసు.. సెప్టెంబర్ 8న ఈడీ ముందుకు రానా

Rana

ED trial in Drugs‌ case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో.. ఈడీ తీగ లాగుతోంది. ఏరికోరి మరి విచారణకు పిలిచి ప్రశ్నిస్తోంది. డ్రగ్స్‌, మనీ లాండరింగ్‌ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇప్పటికే ముగ్గురిని విచారించింది. డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో మొదలైన విచారణ.. నిన్న ఛార్మి.. నిన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వరకు చేరింది. అప్రూవర్‌గా మారిన డ్రగ్‌ పెడలర్ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ.. ఈ కేసులో మరింత మందిని విచారించనున్నారు.

రకుల్ ప్రీత్‌సింగ్‌పై.. 6 గంటలకు పైగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎక్సైజ్‌శాఖ కేసులో రకుల్‌ పేరు లేకున్నప్పటికీ.. క్లబ్‌ పార్టీ ఫుటేజ్ ఆధారంగా రకుల్‌ని ఈడీ అధికారులు ప్రశ్నించారు. రకుల్‌ను విచారణకు పిలిచిన ఈడీ.. ఆమె బ్యాంకు అకౌంట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆరు గంటల్లో మూడు బ్యాంక్‌ అకౌంట్ల వివరాలపై ఆరా తీశారు అధికారులు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబైలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బ్యాంక్‌ అకౌంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్ద మొత్తంలో ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌కు డబ్బులు బదలాయించినట్లు గుర్తించింది ఈడీ.

కెల్విన్‌కు కూడా చాలా సార్లు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ డబ్బులు పంపినట్టు నిర్ధారించుకున్నారు. ఆడిటర్‌తో పాటు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను కలిపి విచారించింది ఈడీ. రకుల్ ప్రీత్‌ సింగ్‌.. కెల్విన్‌, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్లతో చాటింగ్‌ వివరాలు సేకరించిన ఈడీ.. రియా చక్రవర్తితో స్నేహంపై రకుల్‌ను ప్రశ్నించింది. మనీలాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు సంధించారు. ఈనెల 13న ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌, నవదీప్‌ విచారణ తర్వాత.. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వ్యవహారంపై స్పష్టతకు రానున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 31న డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను సుధీర్ఘంగా విచారించారు అధికారులు. పది గంటల పాటు పూరీని విచారించిన ఈడీ.. కీలక విషయాలనే బయటకు లాగింది. విచారణలో ముగ్గురు ఆఫ్రికన్ల ఫోటోలను పూరీ జగన్నాథ్‌కు చూపించిన ఈడీ అధికారులు.. వారెవరో తెలుసా అని పూరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే వారెవరో తనకు తెలియని సమాధానం చెప్పారట పూరీ. పూరీ బ్యాంక్‌ అకౌంట్లను జల్లెడ పట్టిన ఈడీ అధికారులు ఆఫ్రికా దేశాలకు చేసిన రెండు బ్యాంక్ లావాదేవీలపై ఆరా తీశారు. దీనిపై పూరీ ఈడీ అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ కోసమే ఆ లావాదేవీలు జరిపినట్లు పూర్తి వివరించినట్లు సమాచారం.

ఇక.. రెండో తారీఖున నటి ఛార్మిని విచారణకు పిలిచింది ఈడీ. డ్రగ్స్ కేసులో సుమారు 8 గంటల పాటు ఛార్మిని విచారించారు అధికారులు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. ఛార్మి మొబైల్‌లో కెల్విన్ చాటింగ్‌ వివరాలపై కూపీ లాగారు. కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన ఛార్మి.. అతని నెంబర్‌ను దాదా పేరుతో ఎందుకు ఫీడ్ చేసుకున్నారన్న అంశంపై ఆరా తీసింది ఈడీ. దాదా పేరుతో జరిపిన లావాదేవీలపైనా ఛార్మిని ప్రశ్నించారు. ఛార్మి రెండు బ్యాంకు అకౌంట్ల లావాదేవీలపై ఆరా తీసిన అధికారులు.. ఛార్మి, పూరీ బ్యానర్ల ఆర్థిక లావాదేవీలనూ సైతం పరిశీలించారు.

నోటీసులిచ్చిన పన్నెండు మందిలో ముగ్గురిని ఇప్పటి వరకు విచారించింది ఈడీ. అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట వీళ్లు ఏం చెప్పారు..? డ్రగ్స్‌ కేసులో ఈడీ నిజాలు రాబట్టిందా..? టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్‌ కేసులో.. ఈడీ ఇప్పటివరకు ఏం తేల్చిందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. డ్రగ్స్‌ కేసులో.. ఈడీ నోటీసులు అందుకున్న అందరినీ విచారిస్తేనే.. ఈ మత్తు కథా చిత్రమ్‌.. ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.