Jamuna : వెండితెర సత్యభామ.. జమున సినీ ప్రస్థానం..

మిస్సమ్మ సినిమాలో అమాయకత్వం, అల్లరి పాత్రతో మెప్పించి, ఆ తర్వాత పొగరుబోతు, ఇగో ఉన్న క్యారెక్టర్స్ తో వరుస సినిమాలు చేసి మెప్పించింది జమున. మొదటిసారి వినాయక చవితి సినిమాలో సత్యభామ పాత్ర పోషించింది జమున. ఆ తర్వాత................

Jamuna : వెండితెర సత్యభామ.. జమున సినీ ప్రస్థానం..

famous senior actress Jamuna special story

Jamuna :  టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతి రావు.. లాంటి స్టార్లు, మరికొంతమంది సినీ ప్రముఖులు ఇటీవల వరుసగా మరణించగా తాజాగా మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున నేడు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జమున జనించేంచారు. జమున తండ్రి నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు జమున అసలు పేరు జానాబాయి. హంపిలో జన్మించినా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో పెరిగారు. అక్కడే చదువుకున్నారు. తల్లి ప్రోద్బలంతో సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు జమున. చిన్నప్పటి నుంచే పాటలు పాడుతూ, నాటకాలు వేస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి సినిమాల కెరీర్ ఆరంభంలో నాటకాలు కూడా వేస్తూ ఉండేవారు. అలా నాటకాలు వేస్తున్న సమయంలో సావిత్రి దుగ్గిరాలలో నాటకం ఉండగా జమున ఇంటిలోనే బస చేశారు. సావిత్రి జమునని సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించడంతో సినిమాపై ఆశలు పెట్టుకుంది జమున. అక్కడ్నుంచి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు.

దుగ్గిరాలలో అప్పటి ప్రముఖ రాజకీయనాయకులు పాల్గొన్న ఓ బహిరంగ సభలో జమున ప్రార్థనాగీతం పాడగా అందరూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో సినిమాల్లో నటించే ఓ వ్యక్తి జమున వాళ్ళింటికి వచ్చి సినిమాల్లో నటించమని ప్రోత్సహించాడు. జమున పెదనాన్నకు సినిమాల్లో పరిచయాలు ఉండటంతో జమున ఫొటోలు కొన్ని తీసి తెలిసిన వాళ్లకి పంపించారు. అలా మొదట జై వీర బేతాళ అనే సినిమాలో జమునకు అవకాశం వచ్చినా ఆ సినిమా మధ్యలో ఆగిపోవడంతో నిరాశకి గురైంది. కానీ వెంటనే గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ సినిమాతో మరో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో జమున టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా అంతగా ఆడకపోయినా జమున క్యారెక్టర్ కి మాత్రం పేరొచ్చింది. ఈ సినిమా సమయానికి జమునకి 14 ఏళ్ళు మాత్రమే.

ఇక అక్కడుంచి జమునకి వరుసగా అవకాశాలు వచ్చాయి. మొదట సెకండ్ హీరోయిన్ గా, చెల్లెలి పాత్రలు వచ్చినా ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. బంగారు పాప, దొంగరాముడు, మిస్సమ్మ, చిరంజీవులు, ముద్దుబిడ్డ, భాగ్యరేఖ, భూకైలాస్, ఇల్లరికం, గులేబకావళి కథ, గుండమ్మకథ, బొబ్బిలియుద్ధం, మంచి మనిషి, మూగమనసులు, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, దొరికితే దొంగలు, తోడు-నీడ, పూలరంగడు, రాము, మట్టిలో మాణిక్యం, పండంటి కాపురం, తాసిల్లార్ గారి అమ్మాయి, సంసారం, మనుషులంతా ఒక్కటే, తెనాలి రామకృష్ణ, ఉండమ్మా బొట్టు పెడతా.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో జమున హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అప్పట్లో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య.. లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు.

మిస్సమ్మ సినిమాలో అమాయకత్వం, అల్లరి పాత్రతో మెప్పించి, ఆ తర్వాత పొగరుబోతు, ఇగో ఉన్న క్యారెక్టర్స్ తో వరుస సినిమాలు చేసి మెప్పించింది జమున. మొదటిసారి వినాయక చవితి సినిమాలో సత్యభామ పాత్ర పోషించింది జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం సినిమాలో మరోసారి సత్యభామ పాత్ర పోషించి ఆ పాత్రకే వన్నె తెచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి ధీటుగా నటించి సత్యభామ పాత్రతో అదరగొట్టేసింది. ఆ సినిమాతో టాలీవుడ్ వెండితెర సత్యభామగా జమునని పిలవడం మొదలుపెట్టారు. అంతలా ఆ పాత్ర నిలిచిపోయింది.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 190 కి పైగా సినిమాల్లో నటించింది జమున. 1965లో జూలూరి రమణారావుతో జమున వివాహం జరిగింది. పెళ్లయ్యాక కూడా సినిమాలని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత భర్త, పిల్లల కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలివచ్చి ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ లో నివాసం ఉంటున్నారు. జమునకి వంశీ, స్రవంతి ఇద్దరు సంతానం. ప్రస్తుతం జమున కొడుకు వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో పనిచేస్తున్నారు. కూతురు ఇక్కడే హైదరాబాద్ లో నివసిస్తుండగా జమున ఆవిడ వద్దే ఉంటుంది.

Jamuna : టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత..

ఇందిరాగాంధీ ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి కూడా వచ్చి 1988లో కాంగ్రెస్ తరపున రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి కొన్నాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉన్నారు. అనంతరం బీజేపీలో చేరి వాజపేయి తరపున ప్రచారం చేశారు. రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలిగా కూడా జమున పనిచేశారు. వయోభారంతో కొన్ని సంవత్సరాల క్రితం సినిమాల నుంచి తప్పుకున్నారు. 2014లో ఆమె భర్త గుండెపోటుతో మరించారు. అప్పట్నుంచి కూతురు దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు సినీ పరిశ్రమ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులని గెలుచుకున్నారు. సినీ పరిశ్రమలోనే కాక రాజకీయాల్లోనూ ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఆమె మరణంతో టాలీవుడ్ మరోసారి విషాదంలోకి వెళ్ళింది. నేడు ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించనున్నారు. జమున మరణంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.