‘జార్జ్ రెడ్డి’ – రివ్యూ

ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ..

10TV Telugu News

ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ..

‘‘జార్జ్ రెడ్డి’’ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఓయూ లెఫ్ట్ వింగ్ విద్యార్థి నేత జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. జార్జ్ రెడ్డి గురించి తెలుసుకోవాలని ఇప్పటి జెనరేషన్ వారు ఆసక్తిగా ఉన్నారు. మరి సినిమా వారి అంచనాలను అందుకుందా, లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కష్టమైతే పడ్డారు కానీ ??
తెలుగు సినిమా దర్శకులకు  పొలిటికల్ మూవీస్ తీయడం చేతగాదని మరో సారి ప్రూవ్ చేసిన సినిమా జార్జ్ రెడ్డి.. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీలో హత్యకు గురైన విద్యార్ధి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితంలో అనేక విచిత్రమైన మలుపులు ఉన్నాయి. దర్శకుడు అసలు వాటిని పట్టించుకోడానికి నిరాకరించి  మొరాయించాడు. జార్జ్ రెడ్డి తల్లిదండ్రిలది  ప్రేమ వివాహం. కులాంతర, మతాంతర వివాహం. తండ్రి చిత్తూరు జిల్లాకు చెందినవాడు. తల్లి కేరళ రాష్ట్రానికి చెందిన క్రైస్తవ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ. జార్జ్ రెడ్డి తొలి నాటి స్కూలింగ్ కొంత కేరళలో సాగింది. ఆ తర్వాత  జార్జ్ హైస్కూల్ చదువుతున్న రోజుల నాటికి  కుటుంబం తెలంగాణకు వచ్చింది.

హైస్కూలు  చదువు వరంగల్ సెయింట్ గాబ్రియల్ స్కూల్లో సాగింది. సెయింట్ గాబ్రియల్ స్కూల్లోనే ఇప్పటి మావోయిస్ట్ పార్టీ తొలినాటి రూపశిల్పుల్లో ఒకరైన కె.జి.సత్యమూర్తి చదవుకున్నారు. జార్జ్ రెడ్డి హైస్కూల్ చదువు ముగుస్తున్న దశలోనే దేశంలో దరిద్రం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. ఆకలి చావులు పెరిగాయి. కరువు విస్తరించింది. బ్రతుకు భారమైపోయి స్వతంత్ర భారత ప్రభుత్వాల మీద ఉన్న భ్రమలు తొలగిపోయాయి.. సరిగ్గా అదే సమయంలో  భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయింది. మరో వైపు పశ్చిమబెంగాల్‌లో చారు మజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ పోరాటం ప్రారంభం అవుతున్న 1967 నాటికి జార్జ్ రెడ్డి హైదరాబాద్  చేరుకున్నాడు. ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో చేరాడు. 

Read Also : తోలుబోమ్మలాట – రివ్యూ

తను యూనివర్సిటీకి  వచ్చిన నాటికి కలకత్తా విశ్వవిద్యాలయం విప్లవ రాజకీయ పాఠశాలగా మారిపోయి ఆ ప్రభావం మిగిలిన విశ్వవిద్యాలయాలకు  వ్యాపిస్తున్న పరిస్ధితి ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా ఈ ప్రభావానికి లోనయ్యింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్ధుల మీద స్థానికంగా వచ్చే కింది తరగతుల కులాల విద్యార్ధుల మీదా, గ్రామాల నుంచి వచ్చే భూస్వామ్య వర్గాల పిల్లలు, నగరం నుంచీ వచ్చిన అగ్రకుల విద్యార్ధులు కలసి దాడులు చేసే పరిస్థితి ఉండేది. ఆ పరిస్ధితిని ప్రశ్నించే చైతన్యం తీసుకువచ్చింది జార్జ్ రెడ్డి. అందుకే జార్జ్ రెడ్డిని వాళ్లు టార్గెట్ చేశారు. 1972 ఏప్రిల్ 14న యూనివర్సిటీలోనే  జార్జ్ రెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది ఎబీవీపీ కి చెందిన గూండాలు అని ఆరోపణలు వచ్చాయి. 

సరైన సాక్షాలు లేనందున జార్జ్ రెడ్డి హత్య కేసు  కొట్టేశారు. కానీ ఆ హత్య చేసింది మాత్రం ఎబీవీపీ వారే అనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. 
జార్జ్ రెడ్డి సినిమాలో ఈ చరిత్రను చెప్పడం మర్చిపోయాడు డైరక్టర్. జార్జ్ రెడ్డి అని పేరు పెట్టడం వల్ల అతని జీవితం, నాటి సామాజిక రాజకీయ పరిస్థితులు అన్నీ చెప్పాల్సి ఉంటుంది కదా… అయినా దర్శకుడు వాటన్నిటినీ వదిలేశాడు. అవేవీ లేకుండా కేవలం విశ్వవిద్యాలయంలో మూడు విద్యార్ధి సంఘాల మధ్య గొడవల్లో ఓ విద్యార్ధి హత్యకు గురవడంగా కథను నడిపితే దానికి ‘‘జార్జ్ రెడ్డి’’ అనే టైటిల్ ఎందుకు పెట్టాలి? మరింకేదైనా పెట్టుకోవచ్చు కదా… అనే అభిప్రాయం స్వయంగా జార్జ్ రెడ్డి అభిమానులూ, అలనాటి సహచరులే వ్యక్తం చేస్తున్నారు.  

జార్జ్ రెడ్డిని  ఎబీవీపీ వారే హత్య చేశారనడానికి అంత వరకు వారితో ఆయనకున్న శత్రుత్వానికి సంబంధించి అనేక సంఘటనలను కోర్టుకు సమర్పించినా కేసు కొట్టేసి ఆ నాడు కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందో దాదాపు అలాంటి జడ్జిమెంటే ఈ సినిమా కూడా ఇచ్చిందనే అభిప్రాయం చాలా బలంగా వినిపించింది. రాజకీయ ఇబ్బందులను పక్కన పెట్టేసినా… ఎంత సేపూ ఉస్మానియా క్యాంపస్ చుట్టూనే కథను నడపడం మొనాటినీగా అనిపించింది. అలాగే కలెక్టివ్ ఫంక్షనింగ్ లేకుండా రొటీన్ పద్ధతిలో ప్రతి విషయానికీ హీరో రియాక్ట్ అయి వెళ్లి అవతలి వాళ్లను బాది రావడం తప్ప హీరో పాత్రలో కొత్తదనం కనిపించలేదు. ఆ పాత్ర ఓ రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్రగానే కనిపించింది గానీ జార్జ్ రెడ్డిలా అనిపించలేదు. 
ఎబీవీపీ తో జార్జ్ రెడ్డి ప్రధాన ఘర్షణ సాగింది అని అనేక మంది ఆయన మిత్రులు చెప్తుంటే, సినిమాలో ఎబీవీపీ ని పూర్తిగా పక్కకు తప్పించేశాడు దర్శకుడు.
వారి మద్దతుతో వేరే వ్యక్తులు చేసిన హత్యగా చూపించే ప్రయత్నమే జరిగింది. నిజానికి వేరే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఎబీవీపీ గూండాలు ఈ హత్యకు పాల్పడ్డారనేది జార్జ్ రెడ్డి స్నేహితులు చెప్తున్న మాట.

ప్రస్తుతం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉండడంతో సెన్సిటివ్ వ్యవహారంగా మారుతుందనే ఉద్దేశ్యంతో సినిమాటిక్ లిబర్టీ పేరుతో దర్శకుడు కథను ఇలా మార్చి ఉంటాడని సర్దుకు పోవచ్చు కూడా. అయితే అలా సర్దుకుపోవాలనుకున్నప్పుడు జార్జ్ రెడ్డి టైటిల్ కూడా మార్చి ఏ వీరారెడ్డో అని పెట్టేసుకుంటే పోయేది కదా అనే అభిప్రాయం కూడా జార్జ్ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు.

సినిమా విషయానికి వస్తే…
నటీనటుల్లో జార్జ్ రెడ్డి పాత్ర చేసిన సందీప్ మాధవ్ చాలా బాగా చేశాడు. అతణ్ణి మూగగా ఆరాధించే  విద్యార్ధిని పాత్రలో కనిపించిన ముస్కాన్ ఖూబ్ చందానీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాజన్న పాత్రలో నటించిన అభయ్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాడనే చెప్పాలి. మంగ్లీ పాడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ పాట చాలా బావుంది. దర్శకుడు డెబ్భైల నాటి వాతావరణాన్ని ప్రతిఫలింపచేయడంలో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 
ఫైనల్‌గా…
‘శివ’ ప్లస్ ‘అర్జున్ రెడ్డి’ ఈజీక్వల్టూ ‘జార్జ్ రెడ్డి’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సినిమాకు ఏర్పడ్డ హైప్ కారణంగా ఓ నాలుగు రోజులు కలెక్షన్స్ బావుండే అవకాశం ఉంది. 

ప్లస్ పాయింట్స్
సెవెంటీస్ నాటి వాతావరణం 
నటీనటుల పెర్ఫామెన్స్ 
డైలాగుల్లో మెరిసిన మెరుపులు 
…….
మైనస్ పాయింట్స్ 
విలన్ విషయంలో క్లారిటీ లేకపోవడం 
నాటి చారిత్రక అంశాల ప్రస్తావన లేదు 
బోర్ కొట్టించే యూనివర్సిటీ సీన్స్
ఆకట్టుకోలేకపోయిన స్క్రీన్‌ప్లే