కొరఢా : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై GST దాడులు

  • Published By: madhu ,Published On : December 24, 2019 / 08:06 AM IST
కొరఢా : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై GST దాడులు

సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరఢా ఝుళిపించారు. సినిమా దర్శకులు, నిర్మాతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఆదాయం తక్కువగా చూపి టాక్స్‌ ఎగ్గొట్టారనే కారణంతో.. వంశీ క్రియేషన్స్‌, హాసిని క్రియేషన్స్‌తోపాటు మొత్తం 15మంది సినీ ప్రముఖుల నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఓ సినీ ప్రొడక్షన్ కంపెనీ… పెండింగ్‌లో ఉన్న 60 లక్షల బిల్లును చెల్లించినట్లు సమాచారం.

ప్రముఖ బిల్డర్లు, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్‌ సంస్థల కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 12కోట్లకు పైగా జీఎస్టీ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఓ కూల్‌డ్రింక్  కంపెనీ రూ. 5 కోట్లకు పైగా బకాయి ఉండగా ఎలక్ట్రానిక్ సంస్థలు రెండు కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్లాస్టిక్ పైపుల కంపెనీ కూడా భారీగా టాక్స్ ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.

కేంద్ర జీఎస్టీ నిఘా విభాగంతోపాటు, కేంద్ర జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో కూడిన 23 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది.

ఇటీవలే బుల్లితెర నటులపై కూడా జీఎస్టీ దాడులు జరిగాయనే వార్తలు హల్ చల్ చేశారు. కొంతమంది నటులు దీనిపై రెస్పాండ్ అయ్యారు. తమ నివాసాలపై ఎలాంటి దాడులు జరగలేదని వారు ఖండించారు. తాజాగా జరుగుతున్న సోదాలు కలకలం రేపుతున్నాయి. 

Read More : 

ఓ మై గాడ్ : తిరుమలలో వాటర్ కాస్ట్ లీ