Rakul Preet Singh : డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందుకు రకుల్‌ప్రీత్‌ సింగ్‌

టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నేడు ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్‌ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ ఇవాళే విచారణకు రమ్మని కోరింది.

Rakul Preet Singh : డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందుకు రకుల్‌ప్రీత్‌ సింగ్‌

Rakul (1)

tollywood drugs case : టాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నేడు ఈడీ ముందుకు రానున్నారు. 6వ తేదీన విచారణకు రాలేనన్న రకుల్‌ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ ఇవాళే విచారణకు రమ్మని కోరింది. ఉదయం పదిన్నరకు రకుల్‌ ఈడీ ముందుకు వచ్చే అవకాశముంది. అయితే ఇప్పటికే పూరీ, ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. రకుల్‌పై కూడా ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ పేరు లేకపోయినప్పటికీ.. డ్రగ్స్ విచారణ చేపట్టిన ఈడీ.. రకుల్ పేరును కూడా చేర్చింది. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రమేయంపై ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.

అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంలో రకుల్ పేరు ఉందా? లేదా? అన్నది ఈడీ విచారణలో తేలనుంది. డ్రగ్స్ సరఫరా కోసం సినీ తారల డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించిన అధికారులు.. విచారణకు హాజరైన వారందరి బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తోంది. రకుల్ బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ పరిశీలించనుంది. కెల్విన్‌తో రకుల్‌కు పరిచయం ఉందా? లేదా? అన్న దానిపైనా ఈడీ ఆరా తీయనుంది.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. సుమారు 8 గంటల పాటు ఛార్మిని ఈడీ అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఛార్మిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. ఛార్మి మొబైల్‌లో కెల్విన్ చాటింగ్‌ వివరాలపై కూపీ లాగారు.

కెల్విన్ ఎవరో తెలియదని చెప్పిన ఛార్మి.. అతని నెంబర్‌ను దాదా పేరుతో ఎందుకు ఫీడ్ చేసుకున్నారన్న అంశంపై ఆరా తీసింది ఈడీ. దాదా పేరుతో జరిపిన లావాదేవీలపైనా ఛార్మిని ప్రశ్నించారు అధికారులు. ఉదయం సెషన్‌లో ఛార్మిని విచారించిన ఈడీ.. ఛార్మి రెండు బ్యాంకు అకౌంట్ల లావాదేవీలను పరిశీలించింది. అలాగే ఛార్మి, పూరీ బ్యానర్ల ఆర్థిక లావాదేవీలనూ సైతం ఈడీ అధికారులు పరిశీలించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు తన నుంచి ఎప్పుడూ పూర్తి సహకారం ఉంటుందన్నారు నటి ఛార్మి. ఈడీ తనను కొన్ని డాక్యుమెంట్లు సమర్పించమని కోరిందన్నారు. దీంతో తాను అన్ని పత్రాలను సమర్పించానని చెప్పింది ఛార్మి.

డ్రగ్స్‌ సరఫరా చేసే కెల్విన్‌తో ఛార్మి వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. ఈడీ ఎదుట అప్రూవర్‌గా మారిన కెల్విన్‌.. డ్రగ్స్ సరఫరాపై ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు చార్మిని ప్రశ్నించారు. 2015-17వరకు జరిగిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లతో పాటు.. ఛార్మి ప్రొడక్షన్‌ హౌస్‌ ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.