ఈ దశాబ్ధంలో వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఇవే: బాహుబలినే నెం.1

  • Published By: vamsi ,Published On : December 15, 2019 / 09:22 AM IST
ఈ దశాబ్ధంలో వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఇవే: బాహుబలినే నెం.1

ఒక దశాబ్ధం ఎన్నో సంచలన విజయాలు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయిని చేరిన సమయం.. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునే ప్రపంచానికి ఇది తెలుగోడి సత్తా అని చూపిన సినిమా బాహుబలి. ఈ సినిమా ఈ దశాబ్ధ కాలంలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. హిందీలో విడుదలైన టాప్ 10 హిందీ సినిమాలు ఇవే.

బాక్సాఫిస్ బాహుబలి.. రూ.510కోట్ల వసూళ్లతో ఫస్ట్ ప్లేస్:
2015లో వచ్చిన ‘బాహుబలి’ సినిమాకి కొనసాగింపుగా 2017లో బాహుబలి 2 విడుదలైంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లు వసూలు చెయ్యగా.. హిందీలో ఈ సినిమా 510 కోట్లు ఆర్జించి అత్యద్భుత రికార్డు క్రియేట్ చేసింది. టాప్ టెన్‌లో ఈ సినిమాకు ఫస్ట్ ప్లేస్ దక్కింది.

దుమ్ము రేపిన దంగల్ కలెక్షన్లు.. సెకెండ్ ప్లేస్:
ఈ దశాబ్దపు రెండవ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రంగా బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ నటించిన `దంగల్` సినిమా నిలిచింది. 2016లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లు వసూలు చేయగా.. హిందీలో రూ.375కోట్లు ఈ సినిమా వసూలు చేసింది. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవితకథ ఆధారంగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారత్‌తోపాటు చైనాలోనూ వసూళ్ల సునామీ సృష్టించింది.

బాక్సాఫిస్ టైగర్ సల్మాన్.. థార్డ్ ప్లేస్:
సల్మాన్ ఖాన్, కత్రినా ఖైఫ్ నటించిన టైగర్ జిందా హై ఫిల్మ్ బాక్సాఫీసు రికార్డులు తిరగరాసింది. 2017లో విడుదలైన ఈ సినిమా కలెకన్లు సుమారు రూ.345 కోట్లు. అలీ అబ్బాస్ జఫర్.. టైగర్ జిందా హైను డైరక్ట్ చేశాడు. 2012లో వచ్చిన ఈ ఎక్ థా టైగర్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా సల్మాన్ గత సినిమాలను రికార్డ్‌లను క్రాస్ చేసింది.

PK.. వివాదాలకు కేరాఫ్‌.. టాప్ ఫోర్త్ ప్లేస్:
వివాదాలకు కేరాఫ్‌గా నిలిచి సెటైరికల్ మూవీగా తెరకెక్కిన అమీర్ ఖాన్ సినిమా పీకే. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో  రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. 2014లో విడుదలైన ఈ సినిమా హిందీలో రూ. 340 కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. భారతీయ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. చైనీస్ బాక్సాపీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి చిత్రంగా పీకే రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ దశాబ్ధంలో టాప్ వసూళ్లు దక్కించుకున్న నాల్గవ సినిమాగా పేరు దక్కించుకుంది. 

సంజు.. బయోపిక్.. కలెక్షన్లు పీక్.. టాప్ 5:
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథతో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన సినిమా సంజు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలైంది. ఈ సినిమా రూ .335 కోట్లు సంపాదించింది. బాక్సాఫీస్ వద్ద. ఈ చిత్రంలో విక్కీ కౌషల్, సోనమ్ కపూర్ మరియు డియా మీర్జా కూడా నటించారు. ఈ సినిమా రికార్డు వసూళ్లు క్రియేట్ చేసి ఈ దశాబ్ధంలో టాప్ 5 ప్లేస్ దక్కించుకుంది.

భావోద్వేగాల భజరంగీ భాయ్‌జాన్.. టాప్ 6:
బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేసిన సల్మాన్‌ఖాన్ స్టారర్ భజరంగీ భాయ్‌జాన్.. సల్మాన్‌ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఈ సినిమా.. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న ఓ కనిపించని అందమైన కోణాన్ని స్పృశిస్తూ సాగింది. పాక్ నుంచి వచ్చి తప్పిపోయిన ఓ మాటలు రాని చిన్నారిని హీరో మళ్లీ వాళ్ల దేశానికి ఎలా పంపించాడనే స్టోరీలైన్‌ను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగాలతో చిత్రీకరించారు దర్శకుడు ఖబీర్ ఖాన్. ఈ స్టోరీని అందించింది బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాదే. ఈ సినిమా రూ.315 కోట్ల వసూళ్లు రాబట్టింది. 
 
సల్మాన్ ఖాన్ సుల్తాన్.. టాప్ 7:
బాలీవుడ్ కండలవీరుడు సల్లూభాయ్ కుస్తీయోధునిగా కనిపించిన సినిమా సుల్తాన్. అతనికి జోడీగా అనుష్కాశర్మ నటించింది. ఈ సినిమా అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కగా ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ తల్లిగా అలనాటి ప్రముఖ నటి రేఖ నటించింది. 2016 రంజాన్‌కి ఈ సినిమా విడుదలై రూ.300కోట్లు వసూలు చేసింది. 

మల్టీస్టారర్ వార్.. టాప్ 8:
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్. ఈ సినిమా 2019లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి రోజునే రూ.51.6 కోట్ల కలెక్షన్ల సత్తాను చూపించిన ఈ సినిమా 2019 అక్టోబర్ 2వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా మొత్తంగా రూ.295కోట్లను వసూలు చేసింది. 

పోరాటాల పద్మావత్.. టాప్ 9:
ఒక సినిమా విడుదల కావాలంటే ఎంత కష్టపడాలి అనేదానికి నిదర్శనం పద్మావత్ సినిమా. ఈ సినిమా విడుదలకు వచ్చిన అవాంతరాలు అన్నీ, ఇన్నీ కావు. దీపికా పదు‌కొణె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా‌ బాక్సా‌ఫీసు వద్ద మంచి వసూళ్లు రాబ‌ట్టింది.‌ ఎన్ని వివా‌దాలు ముసు‌రు‌రినా.. పలు రాష్ట్రాల్లో విడు‌దల కాక‌పో‌యినా వసూళ్లు బాగానే రాబట్టింది.‌ 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.‌250 కోట్లు  రాబట్టుకుంది.‌ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శ‌క‌త్వంలో తెర‌కె‌క్కిన ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్, షాహి‌ద్‌క‌పూర్‌ కీలక పాత్రలు పోషించారు.‌ౌ

అర్జున్ రెడ్డి రీమేక్.. కబీర్ సింగ్.. టాప్ 10:
బోల్డ్‌ కాన్సెప్ట్‌ కథాంశంతో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందించిన సినిమా కబీర్ సింగ్. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఇది రీమేక్. సినీప్రియులతో పాటు సినీ ప్రముఖులను ఆశ్చర్యపోయేలా చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ పాత్రను షాహీద్‌ కపూర్‌ పోషించగా.. షాలినీ పాత్రలో కైరా అడ్వాణీ కనిపించింది. ఈ సినిమా హిందీలో 2019లో విడుదల అవగా.. రూ.275కోట్లను వసూలు చేసింది. ఇది టాప్ 10 ప్లేస్‌లో నిలిచింది.