ప్రపంచంలో మూడో అతిపెద్దది : అత్యాధునిక టెక్నాలజీతో బాహుబలి థియేటర్

నెల్లూరు జిల్లాలో సరికొత్త థియేటర్ రెడీ అయింది. ఏకంగా 106 అడుగుల స్క్రీన్‌తో అద్భుత అనుభూతులు పంచేందుకు సిద్ధమైంది.

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 01:09 PM IST
ప్రపంచంలో మూడో అతిపెద్దది : అత్యాధునిక టెక్నాలజీతో బాహుబలి థియేటర్

నెల్లూరు జిల్లాలో సరికొత్త థియేటర్ రెడీ అయింది. ఏకంగా 106 అడుగుల స్క్రీన్‌తో అద్భుత అనుభూతులు పంచేందుకు సిద్ధమైంది.

ఇప్పటివరకు చూసిన సినిమా థియేటర్లన్నీ 35ఎంఎం.. లేదంటే.. 70ఎంఎం స్క్రీన్లు ఉన్నవే. మొన్నటి వరకు ఇవే ప్రేక్షకులను అలరించాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతకాలం క్రితం బిగ్‌ స్క్రీన్స్ వచ్చాయి. అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను మిగులుస్తున్నాయి. కానీ అంతకుమించి మెస్మరైజ్‌ చేసేందుకు.. నెల్లూరు జిల్లాలో సరికొత్త థియేటర్ రెడీ అయింది. ఏకంగా 106 అడుగుల స్క్రీన్‌తో అద్భుత అనుభూతులు పంచేందుకు సిద్ధమైంది.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు సమీపంలో ఈ భారీ మల్టీప్లెక్స్ నిర్మితమైంది. పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని చెన్నై-కోల్‌కతా జాతీ రహదారి పక్కన పిండిపాళెం వద్ద… వి-సెల్యులాయిడ్ సంస్థ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించింది. వి-ఎపిక్ పేరుతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో మూడు థియేటర్స్ ఉన్నాయి. స్క్రీన్-1, స్క్రీన్-2లు 150 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు. స్క్రీన్-3 మాత్రం ఈ మల్టీప్లెక్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిల‌వ‌బోతోంది. ఎందుకంటే.. 106 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తు ఈ స్క్రీన్ సొంతం. 650 సీట్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌లో ప్రతీ సీట్ కింద సబ్ ఊఫర్ ఫిట్ చేసారు. ఇలా చేయడం కూడా ఇదే తొలిసారి. 4 కే రెజల్యూషన్‌, త్రీడీ సౌండ్ సిస్టమ్‌తో ఈ స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లలో మూడోది కాగా.. ఆసియాలోనే రెండో అతిపెద్ద స్క్రీన్‌. 

పలు హిట్ చిత్రాలను అందించిన యు.వి. క్రియేషన్స్‌కు చెందిన వి-సెల్యులాయిడ్ ఎల్‌ఎల్‌పి సంస్థ ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించింది. ఈ సంస్థ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొత్త థియేటర్లను నిర్మించింది. ఈ సంస్థలో వంశీకృష్ణారెడ్డి, మెగా హీరో రామ్‌చరణ్‌ భాగస్వాములుగా6 ఉన్నారు. ఇటు యూవీ క్రియేషన్స్‌లో హీరో ప్రభాస్‌కు సోదరుడైన ప్రమోద్‌ కూడా పార్ట్‌నర్‌గా ఉన్నారు. దీంతో ఈ థియేటర్‌ ప్రభాస్‌కు చెందినదిగా ప్రచారం సాగుతోంది.

అన్నిహంగులతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేందుకు సిద్ధమైన ఈ బాహుబలి థియేటర్… ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంతో 2019, ఆగస్టు 30వ తేదీన రిబ్బన్ కట్ చేసుకోబోతోంది. చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి కూడలి ప్రాంతమైన నాయుడుపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ థియేటర్ ఏర్పాటు చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ థియేటర్‌లో ఎప్పుడెప్పుడు సాహో సినిమా చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. 

ఈ మల్టీప్లెక్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ 2019, ఆగస్టు 29వ తేదీన ప్రారంభించనున్నారు. రేపు హైదరాబాద్‌ నుంచి చెన్నై చేరుకోనున్న ఆయన… అక్కడి నుంచి కారులో సూళ్లూరుపేటలోని ఈ థియేటర్‌కు చేరుకుంటారు. థియేటర్‌తోపాటు అందులోని షాపింగ్, ఫుడ్‌ కోర్టు, గేమింగ్ జోన్లను కూడా ప్రారంభిస్తారు. మరుసటి రోజున సాహో చిత్రం ప్రదర్శనతో ఈ థియేటర్‌ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Also Read : ఆసియాలోనే అత్యాధునికం : కరీంనగర్ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి