Movie Theaters: తెలంగాణలో ప్రోత్సాహకాలు.. ఏపీలో పరిస్థితేంటి?

కరోనా మహమ్మారి దెబ్బకు దివాళా అంచుకు చేరిన రంగాలలో సినిమా థియేటర్లు కూడా ఒకటి. అంతకు ముందు లాభసాటి వ్యాపారంగా భావించే సినిమా హాళ్ల నిర్వహణ కరోనా తర్వాత దిక్కుతోచని స్థితిలో పడింది. ఒకటిన్నర ఏడాదిగా గడ్డుకాలాన్ని అనుభవిస్తున్న థియేటర్లు మళ్ళీ పాత రోజులు చూస్తాయా అన్నది అంతుపట్టడం లేదు.

Movie Theaters: తెలంగాణలో ప్రోత్సాహకాలు.. ఏపీలో పరిస్థితేంటి?

Movie Theaters: కరోనా మహమ్మారి దెబ్బకు దివాళా అంచుకు చేరిన రంగాలలో సినిమా థియేటర్లు కూడా ఒకటి. అంతకు ముందు లాభసాటి వ్యాపారంగా భావించే సినిమా హాళ్ల నిర్వహణ కరోనా తర్వాత దిక్కుతోచని స్థితిలో పడింది. ఒకటిన్నర ఏడాదిగా గడ్డుకాలాన్ని అనుభవిస్తున్న థియేటర్లు మళ్ళీ పాత రోజులు చూస్తాయా అన్నది అంతుపట్టడం లేదు. కరోనాకు ముందు మాదిరి మళ్ళీ థియేటర్ల వద్ద సందడి చూడగలమా అనే భావనలు వినిపిస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో తెలంగాణలో థియేటర్లు తెరుచుకొనేందుకు ఎప్పుడో అనుమతులిచ్చారు. నెల రోజుల తర్వాత ఏపీలో కూడా అనుమతి ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల రాత్రి కర్ఫ్యూ కొనసాగుతూనే ఉండడంతో అక్కడ రాత్రి ప్రదర్శన వీలుకాదు. మరోవైపు ఏపీలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తూనే ఉంది. దీంతో ఇది కూడా ఏపీలో థియేటర్ల ఓపెన్ చేసేందుకు ఒక ఇబ్బందిగా మారింది.

ఇప్పటికే దశల వారీగా చర్చలు జరిపిన ఇండస్ట్రీ పెద్దలు.. ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అందుకు సుముఖంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే సినిమా థియేటర్లలో పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. 2018లో జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ ప్రభుత్వం తాజాగా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే.. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గతంలో వకీల్ సాబ్ సినిమా సమయంలో ఏపీ ప్రభుత్వం ఒక్కసారిగా టికెట్ రేట్ లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ ధరలను మళ్ళీ పెంచుతారనే దానిపై ఇంకా సరైన క్లారిటీ రాపోవడం ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లను కలవరపెడుతుంది. ఇటీవల కొత్త జీవో ఒకటి విడుదల చేసినా అది సంతృప్తి ఇవ్వనట్లే కనిపిస్తుంది. దీంతో ఏపీలో థియేటర్ల ఓపెన్ పై అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఏపీలో థియేటర్లు తెరవకపోతే పెద్ద సినిమాల విడుదలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మరి ఈ అంశంలో ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.