అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 07:59 PM IST
అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మాణం – సీఎం కేసీఆర్

International level Cinema City Construction – CM KCR : అంతర్జాతీయ స్థాయి తగ్గట్టు సినిమా సిటీ నిర్మాణం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వమే సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మించాలన్న తలంపుతో ఉందన్నారు. దీనికి సంబంధించి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు ఆయనతో భేటీ అయ్యారు.



హైదరాబాద్ లో సృష్టించిన వరదల బీభత్సానికి పలువురు విరాళాలు అందిస్తున్నారు. సీఎం సహాయ నిధికి సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు విరాళాలు ప్రకటించారు. చిరంజీవి రూ. కోటి, నాగార్జునలు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా..దీనికి సంబంధించిన చెక్కులను వీరిద్దరూ సీఎం కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చకు వచ్చినట్లు సమాచారం.



కరోనా సమయంలో సినీ పరిశ్రమ స్థంభించిన సంగతి తెలిసిందే. అన్ లాక్ డౌన్ తర్వాత..సినీ షూటింగ్ లు కొనసాగుతున్నాయి. కానీ..థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. ఆ సమయంలోనే.. ప్రభుత్వ పెద్దలతో సినీ రంగానికి చెందిన ప్రముఖులు భేటీ అవుతూ వస్తున్నారు.



చిరంజీవి, నాగార్జునలు సీఎం కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ సినీ స్టూడియోను నిర్మించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగర శివారు ప్రాంతాల్లో సినిమా సిటీ నిర్మాణం కోసం సుమారు 1500 నుంచి 2000 ఎకరాల స్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఎయిర్ స్ట్రిప్ తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. బల్గేరియా వెళ్లి..అక్కడ సినిమా సిటీని సందర్శించిన అనంతరం ప్రణాళికలు రూపొందించాలన్నారు.



హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ద్వారా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని, హైదరాబాధ్ అన్ని రకాలుగా అనువైన ప్రాంతమని కేసీఆర్ చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా..సినిమా సిటీ ఆఫ్ హైదరాబాద్ నిర్మిస్తే..భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయి సినిమా షూటింగ్ లకు హైదరాబాద్ వేదిక అవుతుందని ఆయన భావిస్తున్నారు. నిర్మాణానికి భూములు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు.