‘జాను’ రివ్యూ

శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘జాను’ శుక్రవారం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది..

  • Published By: sekhar ,Published On : February 7, 2020 / 10:14 AM IST
‘జాను’ రివ్యూ

శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘జాను’ శుక్రవారం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది..

ఒక భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చెయ్యడం అనేది ఎప్పుడూ కూడా కత్తి మీద సామే.. అయితే కొన్ని సినిమాలు రీమేక్ చేస్తున్నారు అంటేనే ప్రేక్షకులు భయపడిపోతారు. వీళ్ళు ఈ సినిమాను ఎలా రీమేక్ చేస్తున్నారా అని.. క్లాసిక్ అనిపించుకున్న సినిమాలను రీమేక్ చేస్తున్నారు అంటే అందులో నటించే నటీనటులు భయపడతారు. అలాంటి ఒక సినిమానే ‘96’.. తమిళ్ సినిమా రీమేక్‌గా వచ్చిన ‘జాను’ తమిళ్‌లో ‘96’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, విజయ్ సేతుపతి తమ అద్భుతమైన నటనతో సినిమాని రక్తి కట్టించారు. దాంతో ఒక మామూలు పాయింట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఒక మోడరన్ క్లాసిక్ స్థాయికి వెళ్లింది.

నిజానికి ఇలాంటి సినిమా రీమేక్‌లో నటించడానికి అసలు ఇష్టపడని సమంత కూడా ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ దిల్ రాజుకున్న కాన్ఫిడెన్స్‌తో నటించడానికి ఒప్పుకుంది. శర్వానంద్ కూడా సమంతా కాన్ఫిడెన్స్ చూసి నటించడానికి ఒప్పుకున్నాడు. దిల్ రాజు నమ్మకంతో అద్భుతమైన నటీనటులు టెక్నిషియన్స్ తోడవడం, అలాగే ఈ సినిమా ఒరిజి నాలిటి మిస్ అవ్వకుండా ‘96’ ని తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులో డైరెక్ట్ చేయడం జరిగింది.

( కథ) : 
ట్రావెల్ ఫోటోగ్రాఫర్ అయిన రామ్ చాలా కాలం తరువాత తన సొంత ఊరికి తిరిగివస్తాడు. అక్కడ తాను చదివిన స్కూల్‌కి వెళతాడు. అక్కడికి వెళ్ళిన తరువాత పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుండగా పాత మిత్రులను కలవడానికి గెట్ టు గెదర్ పెడితే బావుంటుంది అనే ఆలోచన వచ్చి, దానికి ఫ్రెండ్స్ అంతా కూడా ఓకే అనడంతో గెట్ టు గెదర్ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ గెట్ టు గెదర్‌కి అందరితో పాటు జానకి  కూడా వస్తుంది. అయితే రామ్‌కి, జానుకి ఒక ఫీల్ ఓరియెంటెడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.
అయితే చిన్నప్పటి నుంచి జానకి అంటే రామ్‌కి చాలా ఇష్టం. ఆ ఇష్టం పెరిగి ప్రేమగా మారుతుంది. ఆ విషయం జానకికి కూడా తెలిసి ఆమె కూడా రామ్‌ని ఇష్టపడుతుంది. స్కూల్ ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత రామ్ ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్ళిపోతుంది. దాంతో జాను వేరే పెళ్లి చేసుకుంటుంది. రామ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత ఎదురుపడిన రామ్, జానకి ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళ మధ్య ఏర్పడిన తొలిప్రేమ అనుభవాలను ఎలా గుర్తుచేసుకుంటారు?, చివరికి ఎలాంటి నిర్ణయానికి వస్తారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

(నటీనటులు) :
ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవాళ్లకి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. శర్వానంద్, సమంత ఇద్దరూ తమ పాత్రలను అర్ధం చేసుకుని ఎక్కడా ఒరిజినల్ ఛాయలు తమ మీద పడకుండా తమదైన పద్థతిలో నటించడం బాగుంది. 
ఎస్.జానకీదేవి అంటే పాటలు గానం చేసే గాయని అని చెప్పడంతో చాలా పాత పాటలు వినే అవకాశం కలిగింది. ‘యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసింది రాధా’ అంటూ ‘దళపతి’ కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన గీతం జానకి పాడలేదు. అందుకేనేమో ఈ సినిమాలో కూడా చివరి వరకూ జానకి ఆ పాట పాడదు. కానీ రామచంద్రకు ఆ పాటంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తెల్సినప్పటికీ తను పాడదు. చివరలో … తామిద్దరే ఉన్నప్పుడు కేవలం అతని కోసం పాడుతుంది. అది ప్రేమ. సమంత, శర్వానంద్‌ల తర్వాత ఈ సినిమాలో చెప్పుకోదగ్గ నటన వర్ష బొల్లమ్మది. సమంత, శర్వానంద్ చిన్నప్పటి పాత్రలు చేసిన నటీనటులు కూడా చాలా బాగా నటించారు. స్కూలు సీన్స్ అన్నీ చాలా ఇంటెన్సిటీతో తీశారు. ఒక్క రీ యూనియన్ పార్టీ పార్ట్ మాత్రమే డల్ అయ్యింది. 

(సినిమా ఎలా ఉంది) :
జాను రామచంద్ర ఇద్దరూ ఎవరి జీవితాలు వారు గడిపేస్తూ.. తమ మధ్య ఉన్న ప్రేమను బ్రతికించుకోడానికి ప్రయత్నించడాన్ని చెప్పడమే దర్శకుడు ప్రేమకుమార్ పరమోద్దేశ్యం. ఈ సినిమాను క్లాసిక్ అని విమర్శకులు అనేయడానికి అదే కారణం. నేనున్నా లేకున్నా నీవున్నా లేకున్నా మన ప్రేమ మాత్రం ఉంటుందనే నమ్మకం ప్రేమకున్న బలం. జాను రామచంద్రలు  ప్రేమికులు కదా మరి వాళ్లు ఒంటరిగానే ఉన్నారా.. అన్నేళ్ల కలయిక తర్వాత వాళ్లిద్దరూ పెళ్లాడారా? లాంటి అంశాలు తెలుసుకొనే ఉత్సాహం ఈ సినిమాకు పనికి రాదు.  

ప్రేమ బ్రతికిన క్షణాలను చాలా గొప్పగా చిత్రీకరించాడు దర్శకుడు. తెలుగు సినిమా తమిళ సినిమా పోల్చి చూస్తే ఫస్టాఫ్ కాస్త చప్పగా సాగినట్టు అనిపిస్తుంది. కారణం పాత్రలకు తగిన నటీనటులను ఎంపిక చేసుకోకపోవడమే. రీ యూనియన్ పార్టీ సీన్స్‌లో ఇంకొంత ఫ్రెష్ నెస్ కోసం ప్రయత్నించి ఉంటే సినిమా మరింత గొప్పగా ఉండేది. సెకండాఫ్ పూర్తిగా శర్వానంద్, సమంతలకు వదిలేయడంతో ఎమోషనల్  జర్నీ నడిచింది. 

(టెక్నీషియన్స్) :
డైరెక్టర్  ప్రేమ్ కుమార్ తమిళ సినిమాను యాజిటీజ్‌గా దింపేశాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ బాగానే రాసుకున్నాడు.. కాని తెలుగు వెర్షన్‌లో కాస్త వేగం ఉంటే ఇంకా బాగుండేది. కానీ ప్రేమకథలు ఇష్టపడే వాళ్లకు ‘జాను’ నచ్చేస్తుంది. ఒరిజినల్ చూసిన వాళ్లకు మాత్రం అంతగా రుచించదు. గోవింద్ వసంత ఆర్ ఆర్ బావుంది గానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం చేయలేకపోయారు. ఉన్న పరిమితుల్లో మహేంద్రన్ జయరాజ్ కెమేరా పనితనం బావుంది. డైలాగ్స్ ముఖ్యంగా సెకండాఫ్‌లో సమంతకు రాసిన డైలాగ్స్ బావున్నాయి. నిజానికిది పూర్తిగా దర్శకుడి సినిమా. 

 (ఓవరాల్‌గా) :
సమంత, శర్వానంద్ ఇద్దరికీ మంచి పేరు తెచ్చే చిత్రంగా ‘జాను’ నిలుస్తుంది. ఇంత స్లో నేరేషన్ తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు పట్టుకుంటుందో తెలియదు కనుక ‘జాను’ ‘96’ రేంజ్ సక్సెస్ కొడుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. బి,సి సెంటర్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువనే చెప్పాలి.. ప్రేమికులు మాత్రం బాగా ఆదరిస్తారు అని చెప్పొచ్చు.