అందరూ చూసేట్టు.. అమెజాన్‌లో ‘జల్లికట్టు’

లియో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా ‘జల్లికట్టు’ అమోజాన్‌లో అందుబాటులోకి వచ్చింది..

  • Published By: sekhar ,Published On : November 4, 2019 / 11:10 AM IST
అందరూ చూసేట్టు.. అమెజాన్‌లో ‘జల్లికట్టు’

లియో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా ‘జల్లికట్టు’ అమోజాన్‌లో అందుబాటులోకి వచ్చింది..

‘జల్లికట్టు’.. రిలీజ్‌కి ముందే పలు ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకి సెలెక్ట్ అయిన మలయాళం మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చింది.. ఈ సినిమాకు లియో జోస్ పెల్లిస్సెరి దర్శకత్వం వహించారు. ‘జల్లికట్టు’ సినిమాను క్షుణ్ణంగా వీక్షించిన విశ్లేషకులు సినిమా గురించి తమ అభిప్రాయాలను ఈ విధంగా తెలియచేశారు..

‘కథగా చూస్తే అదొక అడవి ప్రాంతం.. ఆ లోకమే వేరసలు.. అలా ఓ ఊరంతటికీ బీఫ్‌ని సరఫరా చేసే వాళ్ళు ఓ నాటుగేదెని (దున్న) నరకబోతుండగా వాళ్ల నుంచి తప్పించుకుంటూ అడవిలాంటి ఆ ఊళ్ళోకి పారిపోయి పంట పొలాల్ని నాశనం చేస్తూ, అందర్నీ తన పదునైన కొమ్ములతో కుమ్మి వదులుతూ ఊరి జనాలకు నిద్ర లేకుండా నరకం చూపిస్తుంటుంది. దాంతో ఊళ్ళో వున్న ప్రతి వ్యక్తి ఆ దున్నను చంపాలని తిరుగుతుంటారు. ఆ క్రమంలో కొన్ని జీవితాల్ని, వాటి స్వభావాల్ని మన కళ్ళకి కడతాడు దర్శకుడు..

ఒకచోట ఓ డైలాగుంటుంది.. “పూర్వం రోజుల్లో జనాల దగ్గర ఇన్ని డబ్బులెక్కడుండేవి.. ?? ఇప్పట్లా కాకుండా మహా అయితే నెలకొక దున్న మాత్రమే అయ్యేదంతే.. !! అంటే ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి ఎవరికి నష్టంగా పరిణమించింది అనే ప్రశ్న ఇండైరెక్టుగా రేకెత్తిస్తాడు దర్శకుడు.. !! అలాగే గేదె తప్పించుకుని పోతుందన్న విషయం తెలిసిన ఓ శాంతిదూత లాంటి మనిషి ఓ మాటంటాడు.. “వదిలెయ్యండి.. దాన్ని అలాగే స్వేచ్ఛగా బతకనివ్వండి.. అసలు ఈ భూమి వాళ్లదే” అని.. అంతలోనే “అది నీ కఱ్ఱపెండలం పంటంతా నాశనం చేసేసింది” అని ఎవరో చెప్పగానే ఆ గేదెని, దాన్ని వదిలేసిన వాళ్ళని కూడా కలిపి బండ బూతులు తిడతాడు అదే శాంతిదూత..

ఇది అందరిలో చూసే హిపోక్రసీనే.. ఇంకోచోట, కూతురి నిశ్చితార్ధాన్ని మర్నాడు ఘనంగా చెయ్యాలనుకున్న ఓ ఆసామి ఆ నిశ్చితార్ధపు విందులో బీఫ్ మాంసం కూర తప్పనిసరిగా ఉండి తీరాలనుకుంటాడు.. లేకపోతే తనిచ్చే విందుకి అర్ధమే లేనట్టు, పరువు అస్సలు నిలవనట్టు విలవిలలాడతాడు.. కానీ మాంసానికి అవసరమైన ఈ గేదె తప్పించుకుని పారిపోవడంతో ఆఖరికి నాటుకోళ్లతో సరిపెడదామనుకుని, తను సన్నిహితంగా మెలిగే ఒకామె ఇంటినుంచి కోళ్లు తీసుకొద్దామని అర్ధరాత్రి పోయి ఆ ఊళ్ళో కుర్రాళ్ళకి దొరికేస్తాడు.. ఇదే సమయంలో ప్రేమించిన కుర్రాడితో బైక్ పై పారిపోతున్న కూతురు కూడా దొరికేస్తుంది.. !ఇప్పుడు పరువు ఏమైంది? ఇలా చిన్న చిన్న సన్నటి పొరలుగా కనిపించి, మురిపించే థియరీలెన్నో.. ఆఖరికి జంతువుని వేటాడే మనిషిలో దాగున్న రాక్షస ప్రవృత్తిని గ్లోరిఫై చేసే విధానంగానీ, ఆయా తీరుతెన్నుల్ని గానీ చక్కగా పెట్టేశాడు దర్శకుడు..

సినిమా చాలా వరకూ బ్లాక్ థీమే.. డార్క్ సన్నివేశాలకి ఉపయోగించిన ఆ లైటింగ్ స్కీమ్, పొడుగైన సింగిల్ షాట్స్ చూస్తే మూవీ మేకింగ్, టెక్నికల్ అంశాల మీద అవగాహన, ఆసక్తి ఉన్నవాళ్లకి మాత్రం ఆ షాట్ ఎలా తీశాడ్రా బాబూ అని నోరెళ్ళబెట్టి చూసేలా ఉంటాయ్ ఆ షాట్లు, ఫ్రేములూ.. డైలాగులు తక్కువ.. డీటేల్డ్ షాట్లు ఎక్కువ.. వందలకొద్దీ జనాలు కనబడే సీన్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ప్రతీ పాత్రా నటిస్తుంది.. 

వీళ్ళందర్నీ చూశాకా మనలో ఉదయించేవి.. బలాన్ని చూపించడమే మగతనమా.. హింస లేనిదే మనిషికి మనుగడ లేదా.. అనే ఆలోచనలే.. వీటి చుట్టూనే తిరిగిన ఈ సినిమా థీమ్, వయిలెన్స్, డార్క్ సీన్స్ అందరికీ నచ్చకపోవచ్చు.. సెలెక్టెవ్‌గా చూసేవాళ్ళకి మాత్రం మాస్టర్ పీస్’.. అంటూ విశ్లేషకులు ‘జల్లికట్టు’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.