పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పదలచుకుంది ఏంటి? చెప్పింది ఏంటి?

  • Published By: sekhar ,Published On : July 23, 2020 / 06:54 PM IST
పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పదలచుకుంది ఏంటి? చెప్పింది ఏంటి?

పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ కొన్నింటిని కావాలనే టచ్ చేసింది. మరికొన్నింటిని అలా ప్రస్తావించి…తన వైఖరిని బైటపెట్టింది. మూడు రాజధానులపై పాత వైఖరినే బైటపెట్టారు. వేల ఏకరాలు సేకరించడం టీడీపీ తప్పు. అలాగని మూడు రాజధానులనంటూ వికీంద్రీకరణ మంత్రమూ పనిచేయబోదని అన్నారు పవన్ కళ్యాణ్. అధికార, ప్రతిపక్షపార్టీల మద్య రైతు నలిగిపోతున్నాడని…తాను ఆదుకొంటానని అన్నారు పవన్. సీఎం జగన్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో… ప్రతిపక్షంగా అన్నింటిని వ్యతిరేకించాలన్నది తన అభిమతం కాదన్నారు. కరోనా ప్రపంచానికి వచ్చిన విపత్తు. సంసిద్ధంగా ప్రభుత్వాలు ఉంటే తీవ్రతను తగ్గించొచ్చు. రెండు నెలల లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అందుకే లాక్‌డౌన్ తర్వాత కేసులు పెరిగాయన్నారు. టెస్టుల విషయంలో మన:స్ఫూర్తిగా చేశారని ప్రశంసించారు. బాగా చేశారని తాను ట్వీట్ చేశానని.. అదే టెస్టుల తర్వాత రోగులు వైద్య సదుపాయాల విషయాల్లో మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆస్పత్రులకు వెళితే, ఆహారం సరిగా లేదు.. ఇంట్లోనే ఉండమని చెబుతున్నారనే తనకు నివేదికలొస్తున్నాయని అన్నారు.

Pawan Kalyan ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా లేదన్నది క్షేత్రస్థాయి నివేదికల సారాంశమని, కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రభుత్వం బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలి అన్నారు పవన్ కళ్యాణ్. సొంత ఇల్లు ఉండాలనేది అందరి కలగా అభివర్ణించిన పవన్ కేంద్ర నిధులతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ కింద ఇళ్లు కడుతున్నారని గుర్తు చేశారు. ఇళ్లు కట్టేసి ఉన్నా, రకరకాల కారణాలతో లబ్దిదారులకు ఇవ్వలేదని.. అన్నారు. కేంద్ర సాయంతో టీడీపీ లక్షల ఇళ్లు నిర్మించిన తర్వాత ఇవ్వలేదు..కర్నూలు, మంగళగిరిలో స్వయంగా తానే చూశానన్నారు. బీజేపీ, జనసేన తరఫున లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నానని.. వారికి అండగా ఉంటామన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజల్ని మోసం చేసే విధానమే అన్నారు. పదివేల మందికి ఇస్తామంటారు.. ఇచ్చేది వెయ్యిమందికి మాత్రమే. అసైన్డ్ భూముల్ని భయపెట్టి లాక్కుంటున్నారు.. వారికి మరో చోట స్థలాలు ఇస్తున్నారన్నారు. ఇది సరైన విధానం కాదన్న భావనను గట్టిగా వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి దళిత వర్గ మహిళా నేత. ఒకటి కాదు నాలుగైదు ఘటనలు జరిగాయంటే పనితీరులో లోపం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి శిరోమండనం కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలి.. లేకపోతే ప్రభుత్వంపై కొత్త అనుమానాలు తెరపైకి వస్తాయన్నారు.