జెర్సీ : ఎమోషనల్ జర్నీ

జెర్సీ మూవీ రివ్యూ..

  • Publish Date - April 19, 2019 / 11:03 AM IST

జెర్సీ మూవీ రివ్యూ..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ సినిమా నేచురల్ స్టార్ నానికి ఆశించిన విజయాన్ని అందించిందా?  సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పిన మ్యాజిక్‌ను ప్రేక్షకులు ఫీల్‌ అయ్యారా లేదో ఓ సారి చూద్దాం..

కథవిషయానికొస్తే.. అర్జున్ (నాని) ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారిపోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్‌ (క్రికెట్‌ లైఫ్‌) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్‌.. ఓ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్‌ అయి నార్మల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తూ ఉంటాడు. అర్జున్‌, సారాలకు నాని అనే కొడుకు పుడతాడు. కొంత కాలానికి అర్జున్‌ ఉద్యోగం కూడా పోతుంది. క్రికెట్‌ను వదిలేసి, గవర్నమెంట్ జాబ్ పోయి పనీపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు బర్త్‌డే రోజు అడిగిన గిఫ్ట్ కూడా కొనివ్వలేకపోతాడు. ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్‌.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటాడు. అసలు అర్జున్‌ క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్‌ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ కథ.

నటీనటుల విషయానికొస్తే.. అర్జున్‌ పాత్రలో నానిని తప్ప మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేకుండా.. ఆ పాత్రలో జీవించేశాడు. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గానూ, నార్మల్‌ ఫ్యామిలీ పర్సన్‌గానూ నటించి మెప్పించాడు. రియల్‌ లైఫ్‌లో నాన్నగా మారిన నాని.. రీల్‌ లైఫ్‌లోనూ ఆ ఫీలింగ్‌ను క్యారీ చేశాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ మంచి మార్కులు కొట్టేసింది. లవర్‌గా.. భార్యగా రెండు పాత్రల్లో శ్రద్దా సహజంగా నటించింది. కోచ్‌గా, స్నేహితుడిగా అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. మనిషి కష్టాలు పడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్‌ అవ్వడం.. ఈ కాన్సెప్ట్‌ వెండితెరకు మామూలే. కానీ ఈ కథకు క్రికెట్‌ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్‌ తిన్ననూరి తన టాలెంట్‌తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి.డెబ్బై రోజుల నాని కష్టం..తెరపై స్పష్టంగా కనిపిస్తుంది.

టెక్నీషియన్స్ విషయానికొస్తే..గౌతమ్‌ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి మ్యాజిక్‌ చేశాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్‌ కాస్త లెంగ్తీ గానూ, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది. ఇక నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సెకండాఫ్‌లో వేగం పెంచినా.. పూర్తిగా క్రికెట్‌ నేపథ్యంలో సాగింది.

ఓవరాల్ గా చెప్పాలంటే ..నాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగగా.. చివర్లో వచ్చే ట్విస్ట్ షాకింగ్‌గా అనిపిస్తుంది. అనిరుధ్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అవ్వగా.. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమా మొత్తం 1986, 96 నేపథ్యంలోనే జరగ్గా..అప్పటి వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్‌ చక్కగా చూపించారు. ఎడిటింగ్‌ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్

నాని

తండ్రీ కొడుకుల ఎమోషన్

కథా, కథనం

సంగీతం

మైనస్‌ పాయింట్స్‌

నిడివి

స్లో నెరేషన్

పూర్తి క్రికెట్ బ్యాక్ డ్రాప్

 

ట్రెండింగ్ వార్తలు