”ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్లు తీసేయాల్సిందే”

”ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్లు తీసేయాల్సిందే”

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR (ఆర్‌ఆర్‌ఆర్)’. గోండు వీరుడు కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ అల్లూరి సీతారామరాజుగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా చూస్తున్న అభిమానులకు రాజమౌళి దశలుగా సినిమా టీజర్‌ను విడుదల చేస్తూ వారిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల జూ.ఎన్టీఆర్ మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తున్న కొమురం భీం పాత్రతో టీజర్ విడుదల చేశాడు. అందులో జూ.ఎన్టీఆర్ వేషధారణ వివాదాస్పదంగా మారింది. కొమురం భీం పాత్ర పోషిస్తున్న తారక్‌ ఇందులో ముస్లిం టోపీ పెట్టుకుని కనిపిస్తాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కొమురం భీం విగ్రహానికి ఆదివాసీల యువసేన శనివారం క్షీరాభిషేకం చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్‌’ టీజర్‌లో ఎన్టీఆర్‌కు ముస్లిం వేషధారణలో కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అని, ఆయన చరిత్రను పూర్తిగా అర్థం చేసుకుని సినిమా తీయాలంటూ రాజమౌళికి సూచిస్తున్నారు. ఇష్టారీతిగా సినిమా తీసి ఆదివాసీల మనోభావాలు దెబ్బతీయొద్దంటూ రాజమౌళిపై మండిపడుతున్నారు.

ఈ సినిమాలో ముస్లిం టోపి ఉన్న కొమురం భీం సన్నివేశాలను తొలగించాలని లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆదివాసీలు హెచ్చరించారు. కాగా, బాహుబలి సినిమా అప్పుడు కూడా పలు వివాదాలు చెలరేగాయి. గిరిజనులను అవమానకరంగా చూపారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. బాహుబలి సినిమాలోనూ ప్రభాస్ ఓ సీన్ లో ముస్లిం గెటప్ లో కనిపిస్తాడు. ఈ రూమర్లను జక్కన్న పట్టించుకుంటాడా.. ఏదైనా మార్పులు చేస్తాడా అనేది సినిమా రిలీజ్ కు గానీ తెలిసి రాదు.