K Viswanath – Chiranjeevi : మెగాస్టార్‌తో కళాతపస్వి బంధం.. ప్రతి సినిమాకి అవార్డు!
తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి, విశ్వనాథ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కె.విశ్వనాథ్ గారు తనకి తండ్రి లాంటి వారని ఎన్నో సందర్భాల్లో చిరు చెప్పుకొచ్చాడు. విశ్వనాథ్ కూడా...

K Viswanath – Chiranjeevi : తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు అంతా కళాతపస్వికి నివాళులు అర్పించేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
విశ్వనాథ్ కెరీర్ లో ఎన్నో మరుపురాని చిత్రాలను తెరకెక్కించారు. తన చిత్రాలతో తెలుగు పరిశ్రమని ఇంటర్నేషనల్ స్థాయి వరకు తీసికెళ్లారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన విశ్వనాథ్ ఎంతో మంది స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. హీరోలంతా విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడం ఒక ఛాలెంజ్ లా భావించేవారు. ఎందుకంటే ఆయన కథలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి, పాత్రధారులు కాదు. మాస్ హీరో అయినా ఆయన సినిమాలో చేస్తే కథకు తగట్టు మారాల్సిందే. చిరంజీవి, కమల్ హాసన్, వెంకటేష్ ఆయన దర్శకత్వంలో డిగ్రీలు అందుకున్నవారే.
ఇక మెగాస్టార్ చిరంజీవి, విశ్వనాథ్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కె.విశ్వనాథ్ గారు తనకి తండ్రి లాంటి వారని ఎన్నో సందర్భాల్లో చిరు చెప్పుకొచ్చాడు. విశ్వనాథ్ కూడా చిరంజీవిని అలానే చూసేవారు, చిరు ఎప్పుడు కనిపించినా కొడుకుల ముద్దాడేవారు. ఇక విశ్వనాథ్ గారి ప్రతి పుట్టిన రోజుకి చిరంజీవి.. ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ నెల 19న విశ్వనాథ్ పుట్టినరోజు, కానీ చిరు విష్ చేయడానికి ఈ ఏడాది ఆయన లేరు.
ఇక వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. చిరు వంటి మాస్ హీరోతో ప్రయోగాలు చేశారు విశ్వనాథ్. శుభలేఖతో మొదలైన వీరి ప్రయాణం స్వయంకృషి, ఆపద్భాంధవుడు వరకు కొనసాగింది. శుభలేఖ సినిమా 1982 లో వచ్చింది. చిరంజీవి, సుమలత నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చిరు కెరీర్ లోనే మొదటిసారి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నాడు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి కేవీ మహదేవన్ సంగీతం అందించారు.
ఆ తరువాత ఖైదీ, గుండా, అడివి దొంగ, రాక్షసుడు వంటి చిత్రాలతో మాస్ హీరోగా ఎదిగిన చిరంజీవితో పెద్ద సాహసమే చేశారు విశ్వనాథ్. స్వయంకృషి వంటి సినిమా తీసి చిరుతో ప్రయోగం చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవితో చెప్పులు కుట్టించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. చెప్పులు కొట్టుకునే స్థాయి నుంచి చెప్పుల షాప్ కి ఓనర్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఈ మూవీలో చిరంజీవి నటించాడు అనేకంటే జీవించాడు అనే చెప్పాలి. ఈ సినిమాకి చిరు నంది అవార్డు అందుకున్నాడు. విజయశాంతి, సుమలత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.
వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి సినిమా ఆపద్భాంధవుడు. 1992 లో వచ్చిన ఈ చిత్రంలో చిరంజీవి నటన తారాస్థాయిలో ఉంటుంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే అనాధగా వచ్చిన చిరంజీవిని చేరదీసి, తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన కుటుంబానికి ఆపద్భాంధవుడులా నిలుస్తాడు. హీరోయిన్ గా నటించిన మీనాక్షి శేషాద్రి ఒక సంఘటన వలన మెంటల్ హాస్పిటల్ చేరుతుంది. ఆమెను నార్మల్ గా మార్చడానికి తాను పిచ్చి వాడిలా నటించి మెంటల్ హాస్పిటల్ కి వెళ్లి.. పిచ్చి వాళ్ళ మధ్య పిచ్చి వాడిలా నటిస్తూ హీరోయిన్ ని మళ్ళీ మంచి మనిషి చేసే చిరంజీవి ప్రయత్నం అందరి మనసులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటనకి చిరంజీవి ఫిలింఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.
ఇక విశ్వనాథ్ మరణం తెలుసుకున్న చిరంజీవి తీవ్ర బావోద్వేగానికిలోనయ్యాడు. ఆయన మరణానికి చింతిస్తూ ట్వీట్ చేశాడు. ‘ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్ ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతి ని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు’ అంటూ ట్వీట్ చేశాడు.
Shocked beyond words!
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! ?? pic.twitter.com/3JzLrCCs6z— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023