కంగ్రాట్స్ : గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ పురస్కారం

  • Published By: madhu ,Published On : December 20, 2019 / 04:39 AM IST
కంగ్రాట్స్ : గోరటి వెంకన్నకు కబీర్ సమ్మాన్ పురస్కారం

తన రచనలు, గానంతో ప్రజలను ఉర్రూతలూగించిన ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు ప్రతిష్ఠాత్మకమైన కబీర్‌ సమ్మాన్‌ పురస్కారం లభించింది. ఏటా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కళాకారులకు, సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి కోవింద్‌ త్వరలో భోపాల్‌లో ప్రధానం చేస్తారు. పురస్కారంలో భాగంగా రూ. 3 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేస్తారు.

తెలంగాణాలో విశేష ప్రజాదరణ పొందిన గోరటి వెంకన్నకు పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల..అనే పాట ఉర్రూతలూగించింది. ఈ పాట ద్వారా మరింత గుర్తింపు దక్కింది ఆయనకు. వెంకన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1963లో జన్మించారు. పల్లె ప్రజలు, ప్రకృతిపై ఆయన ఎన్నో అద్భుతమైన పాటలను రచించి పాడారు. ఏకనాదం మోత, రేల పూతలు, అల చంద్రవంక, పూసిన పున్నం రచనలు చేశారు. పలు సినిమాలకు ఆయన పాటలు రాశారు.

సాహిత్యరంగానికి ఆయన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2016లో కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును అందించింది. అనేక సంస్థల నుంచి ఆయన పురస్కారాలు అందుకున్నారు. నిద్రపోతున్న వేళ, కుబుసం, మహాయజ్ఞం, బతుకమ్మ, మైసమ్మ ఐపీఎస్, శ్రీరాములయ్య, వేగుచుక్కలు వంటి తెలుగు సినిమాలకు పాటలు రాశారు. 
Read More : happy christmas : తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల విందు