సీమలో సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ కథతో రవితేజ సినిమా!

  • Published By: vamsi ,Published On : November 18, 2019 / 07:48 AM IST
సీమలో సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ కథతో రవితేజ సినిమా!

తానూ సీమ బిడ్డనేనంటూ అప్పటి అధికార పార్టీపై తీవ్ర స్వరంతో ఎంపీకే సవాల్ విసిరిన పోలీస్, తర్వాతి కాలంలో ఎంపీగా మారిన కథాంశంతో మాస్ మహరాజ్ రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే సినిమా చేస్తున్న రవితేజ, గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు రాగా ఒకటి సూపర్ హిట్ అయ్యింది. ఇంకొకటి యావరేజ్‌గా నిలిచింది.

ఈ క్రమంలోనే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వీరి కాంబినేషన్‌లో ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను నిజజీవిత అంశాలను తీసుకుని సినిమాగా తీస్తున్నట్లు ఇప్పటికే సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఎవరి కథను సినిమాగా తీస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.

అయితే లేటెస్ట్‌గా ఈ విషయంలో చిత్రయూనిట్ నుంచి క్లారిటీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం హయాంలో వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమం వద్ద గ్రామస్థులకు, ఆయన శిష్యులకు మధ్య చెలరేగిన వివాదం అప్పట్లో సంచలనం అయింది. ఈ ఘటనతో గ్రామస్థులకు మద్దతుగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఆందోళన చేపట్టారు.

ఈ సమయంలో జేసీ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించగా.. అప్పటి సీఐ గోరంట్ల మాధవ్ ‘తమ సొంత మైలేజీ కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇదో అలవాటుగా మారింది’ అంటూ మీసం తిప్పి హెచ్చరించారు. ఈ విషయం అప్పట్లో సంచలనం అవగా.. తర్వాతి కాలంలో గోరంట్ల మాధవ్, వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఈ క్రాక్ సినిమాకు స్పూర్తి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అని తెలుస్తుంది.