నా కెరీర్‌ను నాశనం చేయాలని నాలుగు వెబ్‌సైట్లు ప్రయత్నిస్తున్నాయి: విజయ్ ఆగ్రహం.. మహేష్‌తో సహా మద్దతు తెలుపుతున్న ప్రముఖులు..

విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతున్న సినీ ప్రముఖులు..

  • Published By: sekhar ,Published On : May 4, 2020 / 05:03 PM IST
నా కెరీర్‌ను నాశనం చేయాలని నాలుగు వెబ్‌సైట్లు ప్రయత్నిస్తున్నాయి: విజయ్ ఆగ్రహం.. మహేష్‌తో సహా మద్దతు తెలుపుతున్న ప్రముఖులు..

విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతున్న సినీ ప్రముఖులు..

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా మరియు ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వెబ్‌సైట్లకు చెందిన వ్యక్తులు తనపై కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన విజయ్.. కరోనా సంక్షోభంలో తను చేస్తున్న సేవలపై ఆ వెబ్‌సైట్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై ఫైర్ అయ్యాడు. ఇటువంటి ఫేస్‌న్యూస్‌ల వల్ల తను మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ బాధపడుతున్నారని అతను పేర్కొన్నాడు. అయితే ఈ విషయంలో విజయ్ దేవరకొండకి… సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాస్ మహరాజ్ రవితేజ, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు మద్దతుగా నిలిచారు. 


‘‘నాపై లేనిపోని వదంతులను కొన్ని వెబ్ సైట్స్ రాస్తున్నాయి. పక్క వ్యక్తిని తొక్కి ముందుకు వెళ్లాలనుకునేవారు సమాజంలో ఉన్నారు. ఎదుటివాడు నాశనమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలని వీరు అనుకుంటారు.. ఇలాంటి వారు సమాజంలో ఉండటం ప్రమాదకరం.సినీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వెబ్ సైట్లు… తప్పుడు వార్తలు రాస్తూ, వాటిని అమ్ముతూ, డబ్బు చేసుకుంటున్నాయి. గత నెల రోజులుగా నాలుగు వెబ్ సైట్ల వాళ్లు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు రాస్తామని, ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరిస్తున్నారు.
అసలు విరాళాలు అడగడానికి మీరెవరు. నాకు ఇవ్వాలనిపించినప్పుడు, ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికి ఇస్తాను. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో పేదల కోసం విరాళాలను సేకరిస్తున్నాము.

ప్రజలు విపరీతంగా విరాళాలను ఇస్తున్నారు.. ఇప్పటికి ఆ మొత్తం రూ. 70 లక్షలు దాటింది. తమ కార్యకలాపాలు ప్రతి ఒక్కరికి తెలియాలని వెబ్ సైట్‌లో అప్‌డేట్స్ ఇస్తున్నాము.
అందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటే.. ఆ వెబ్‌సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. సేకరిస్తున్న విరాళాల్లో గందరగోళం జరుగుతోందని, సినీ పరిశ్రమ నుంచి నేను విడిపోయి.. ఈ పని చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు..’’ ఆవేదన వ్యక్తం చేశాడు విజయ్. ‘‘మా జీవితాలను అగౌరవ పరచాలని భావించే ఇలాంటి వెబ్‌సైట్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని నేను ఇండస్ట్రీని కోరుతున్నాను’’ అంటూ విజయ్‌కు సపోర్ట్‌గా మహేశ్ బాబు ట్వీట్ చేశారు.