పెళ్లాం చెబితే వినాలి.. ఇంటి పనుల్లో బిజీ అయిన హాస్యనటులు..

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి పనులు, వంట పనులతో బిజీ అయిన ప్రముఖ నటులు..

  • Published By: sekhar ,Published On : March 29, 2020 / 10:16 AM IST
పెళ్లాం చెబితే వినాలి.. ఇంటి పనుల్లో బిజీ అయిన హాస్యనటులు..

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటి పనులు, వంట పనులతో బిజీ అయిన ప్రముఖ నటులు..

కరోనా మహమ్మారి ప్రభావంతో సెలబ్రిటీల దగ్గరి నుండి సామాన్యుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి నచ్చిన పనులతో వాళ్లు కాలక్షేపం చేస్తున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వీడియోల రూపంలో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు సెలబ్రిటీలు. తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ సమయంలో తానేం చేస్తున్నారో తెలియచేశారు.

‘నేను ఇంట్లో ఏం చేస్తున్నానో తెలిస్తే మీకు మంచి వినోదం అవుతుంది. ఉదయం టిఫిన్‌ నా భార్య చేస్తుంది. మధ్యాహ్నం కూరగాయలు అన్నీ కట్‌ చేసి, నేనే వంట చేస్తున్నా. కృష్ణాజిల్లా పాలకూర చేయడంలో నేను స్పెషలిస్ట్‌.. అందుకే ఎక్కువగా చేస్తున్నాను. ‘వద్దండి.. నాకు బోర్‌ కొడుతోంది, నేను చేస్తా’ అని మా ఆవిడ అంటున్నా, వినకుండా నేనే చేస్తున్నా. బీరకాయ పాలకూర, టమోటా రోటి పచ్చడి, (టమోటాలు కొనే పని కూడా లేదు.. ఇంట్లోనే చెట్లు ఉన్నాయి.. కోయడం చేయడమే).. మగాళ్లు చేయడానికి పని లేదని సాకులు చెప్పకుండా.. మొహమాట పడకుండా మీకు వచ్చిన పని చేయండి’ అని సలహా ఇచ్చారాయన.

పాపులర్ కమెడియన్ అలీ ఇంటిపనులు చేస్తున్నట్టు తెలిపారు. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే అలీ ఇప్పుడు ఇంటి పనులతో బిజీ అయ్యానని తెలుపుతూ ఫోటోలు షేర్ చేశారు. ‘రోజూ కార్లు కడుగడం.. ఇంటి పని, కాయగూరలు తరగడం వంటి పనులు చేస్తున్నా. అప్పుడప్పుడు కాసేపు టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. వంట పని లాంటివి. నాకు కొన్ని వంటలు వచ్చు. బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌లో వంట చేసేవాణ్ణి.. అందుకని నన్ను బాడుగ (అద్దె) కట్టమనేవాళ్లు కాదు. అప్పుడు నా బట్టలు నేనే ఉతుక్కునేవాణ్ణి. ఇస్త్రీ మాత్రం బయట చేయించుకునేవాణ్ణి. అప్పుడు షర్ట్‌కి యాభై పైసలు, ప్యాంటుకి యాభై పైసలు ఉండేది. ఇంటిలో మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏం మనం స్నానం చేయడం లేదా? వేరే వాళ్లు చేయిస్తున్నారా? చిన్నప్పుడంటే తల్లిదండ్రుల చేయించేవాళ్లు’ అని తెలిపారు.