మల్టీఫ్లెక్స్‌, సినిమా థియేటర్లలో రాబోయే కొత్త రూల్స్ ఇవే..!

  • Published By: sreehari ,Published On : July 21, 2020 / 03:01 PM IST
మల్టీఫ్లెక్స్‌, సినిమా థియేటర్లలో రాబోయే కొత్త రూల్స్ ఇవే..!

కరోనా సమయంలో సినిమా ధియేటర్లలో మూవీలు చూడగలమా? ఒకవైపు రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో మల్టీఫ్లెక్స్ లు, సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి? కరోనా మరింత వ్యాప్తించే ప్రమాదం లేకపోలేదు. సినిమా హాల్‌లో సామాజిక దూరం సాధ్యమేనా? అంటే అదే దిశగా మల్టీఫ్లెక్స్ యజమాన్యాలు చర్యలు చేపడుతున్నాయి. మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్లన్ని మూతపడ్డాయి.

ఇప్పుడు కోవిడ్ -19 మహమ్మారి మధ్య ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని మల్టీఫ్లెక్స్ నిర్వాహకులు హామీ ఇవ్వడంతో సినిమా హాల్స్ ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. సినిమా హాల్స్ రీఓపెన్ చేయడంపై ఇప్పటికే పివిఆర్ సినిమాస్ ప్రత్యేక అధికారులకు ఇమెయిల్ ద్వారా భద్రతా కొలత సమాచారాన్ని రిలీజ్ చేసింది. సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి మల్టీప్లెక్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరిస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులు నిలబడేందుకు వీలుగా ఒక మీటరు దూరంలో ఫ్లోర్ మార్కర్స్ ఉంటాయని, కెమికల్ స్ప్రే, పరిశుభ్రత కోసం సినిమా హాళ్ళలో హ్యాండ్ శానిటైజింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాయి.

పివిఆర్ తీసుకొస్తున్న కొత్త మార్పులలో.. ముఖ్యంగా పాట్-డౌన్ సెర్చింగ్ తొలగిస్తోంది. అంటే.. థియేటర్లలో ఎంట్రీ పాయింట్ దగ్గర ప్రతిఒక్కరిని తనిఖీ చేయడాన్ని నిలిపివేస్తున్నారు. దీనికి బదులుగా డోర్-ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, హ్యాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీ చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే తప్పా రెండోది హెచ్చరికగా వినియోగించనున్నారు.

మల్టీఫ్లెక్స్ లకు వచ్చే ప్రేక్షకులందరిని పరీక్షిస్తారు. వారిలో ఎవరికైనా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా వైరల్ జ్వరం లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వారిని తిరిగి ఇంటికి పంపించి వేస్తారు. మూవీ టికెట్ నగదును పూర్తి స్థాయిలో వాపస్ చేస్తారు. మల్టీఫ్లెక్స్ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ప్రతి ప్రేక్షకుడు ఆరోగ్యా సేతు యాప్‌ లో తమ ఆరోగ్య స్థితిని చూపించాల్సి ఉంటుంది.

థియేటర్లలో ఒక సీటు గ్యాప్ :
పివిఆర్ సూచించిన ప్రకారం.. కస్టమర్ల మధ్య ఒక సీటు గ్యాప్ ఉంటుంది. సినిమా చూసే అనుభవంలో కూడా పెద్ద మార్పు కనిపించనుంది. అయితే, ఎవరైనా ఒకరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి టికెట్లు బుక్ చేసుకుంటే మాత్రం.. వారంతా కలిసి కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, వారి పక్క సీట్లలో మాత్రం ఖాళీగా ఉంటాయి.

అంతేకాదు.. ఒకే దారిలో అందరూ వెళ్తే.. రద్దీగా మారే అవకాశం ఉంది. అందుకే ఆడిటోరియంలలో రద్దీని నివారించడానికి సీటు వరుసల వారీగా బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయనున్నాయి. ఆగస్టు 15 నాటికి సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నానని పివిఆర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం పొందలేదని అంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ మూవీలు మరెన్నో థియేటర్లలో సందడి చేసేందుకు ఎదురుచూస్తున్నాయి. భారతీయ మూవీలను సెప్టెంబర్ నుంచి మాత్రమే విడుదల చేసే అవకాశం ఉంది. మల్టీఫ్లెక్స్ సహా ఇతర సినిమా హాల్లో ఎక్కువ సమయం ఇంటర్వెల్ ఉండనుంది. ఈ సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయించే అనేక రకాల ఆహార, పానీయాల ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తోంది. పివిఆర్ అల్ట్రా వైలెట్ (UV) క్యాబినెట్లను ఉపయోగించే ముందు ఫుడ్ ప్యాకేజింగ్ లను శానిటైజ్ చేయనున్నారు.

ఎయిర్ కండిషనింగ్ పునరుద్ధరణ :
ఇతర మల్టీప్లెక్సులు కూడా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య భద్రతా చర్యలను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నాయి. ఐనాక్స్ వంటి ప్రధాన ప్లేయర్లు.. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఐనాక్స్ ‘రూఫ్ మౌంటెడ్ ఎసి ప్యాకేజీ యూనిట్ (RMPU)ను ఇన్‌స్టాల్ చేస్తామని ప్రకటించింది. సాధారణ ఎసి కంటే 20 శాతం ఎక్కువ ప్రెష్ ఎయిర్‌ను ఫీల్టర్ చేస్తుంది.

కార్నివాల్ సినిమాస్, సామాజికంగా దూరాన్ని ప్రేక్షకులకు మార్గనిర్దేశం చేస్తోంది. అయితే INOX కూడా తమ మూవీ షోలను వేర్వేరు టైమింగ్స్ సెట్ చేస్తోంది. తద్వారా విరామం లేదా నిష్క్రమణ సమయంలో ఎలాంటి రద్దీ ఉండదు. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కటే 1,500 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది.

మల్టీప్లెక్స్‌ల పరిస్థితి చాలా క్లిష్టమైనదిగా చెప్పవచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఇదో అవకాశంగా చెప్పవచ్చు.. ఎందుకంటే చాలావరకు సినీ హాల్స్ మూతపడ్డాయి. ఫిల్మ్ ట్రేడ్ ఎనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. భారతీయ సినిమా చరిత్రలో థియేటర్లు నెలల తరబడి సున్నా టికెట్ల అమ్మకాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి.