Maha Samudram : రివ్యూ

సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా ‘ఆర్ఎక్స్100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ..

Maha Samudram : రివ్యూ

Maha Samudram Review

Maha Samudram: సిద్ధార్థ్, శర్వానంద్ ‘ఆర్ఎక్స్100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం.. ‘మహా సముద్రం’.. అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలు.. ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమా.. పైగా అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా కావడం, ప్రోమోలన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడంతో మూవీ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈరోజు గ్రాండ్‌గా థియేటరల్లో రిలీజ్ అయిన ‘మహా సముద్రం’ ఎలా ఉందో చూద్దాం..

కథ..
అర్జున్ (శర్వానంద్), విజయ్ (సిద్దార్థ్) ఇద్దరూ చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్. అర్జున్ జాబ్ గురించి ట్రైల్స్ చేస్తుంటాడు. విజయ్ పోలీస్ కావాలని సిన్సియర్‌గా ట్రై చేస్తుంటాడు. విజయ్ ప్రేయసి మహా (అదితి రావు) చిన్నపిల్లలకు నాట్యం నేర్పిస్తుంటుంది. విజయ్‌ను ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటుంది. ఒక రోడ్ యాక్సిడెంట్‌తో అర్జున్‌కు లా చదువుతున్న స్మిత (అను ఇమ్మానుయేల్) పరిచయం అవుతుంది. వైజాగ్ సముద్రానికి కింగ్‌గా డ్రగ్స్, నకిలీ కరెన్సీ వంటివి దందా చేస్తుంటాడు ధనుంజయ్ (రామచంద్ర రాజు – ‘గరుడ’ రామ్).

సొంత అన్న వైకల్యాన్ని ఆసరాగా చేసుకుని అతని దగ్గరి నుంచి వ్యాపార సామ్రాజ్యాన్ని లాక్కుంటాడు. అన్న గూని బాబ్జీ (రావు రమేష్) సైతం తమ్ముడి ఆకృత్యాలు చూసి భయపడుతుంటాడు. విజయ్ వీలు దొరికినప్పుడల్లా ధనుంజయ్‌ని అతని వ్యాపార కలాపాల్ని కనిపెడుతుంటాడు. ఆ ప్రాసెస్‌లో ఒక రోజు ఫ్రెండ్ అర్జున్‌ని కూడా తీసుకెళ్తాడు. ధనుంజయ్ వ్యాపారం గురించి చెప్తూ.. పోలీస్ అయితే మన వాటా మన కాళ్ల దగ్గరికే వచ్చేస్తుంది. పవర్, మనీ రెండూ దొరుకుతాయి అనడంతో విజయ్‌ను ఇందుకే పోలీస్ అవుతున్నావా అని మందలిస్తాడు అర్జున్. చుంచు మామ (జగపతి బాబు) తన స్థాయిలో సముద్రంలో వ్యాపారం చేస్తుంటాడు. విజయ్ తండ్రి తనను మోసం చేశాడన్న కారణంగా అర్జున్‌ను విజయ్‌తో తిరగొద్దని మందలిస్తుంటాడు.

Maha Samudram

 

ధనుంజయ్‌ను ఫాలో అవుతూ వెళ్లి అతనికి దొరికిపోతాడు విజయ్. ఆ ఘర్షణలో ధనుంజయ్ చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే.. నిన్ను, మమ్మల్ని చంపేస్తాడని చెప్పి చుంచు మామ విజయ్‌ను వైజాగ్ వదిలి వెళ్లిపోమ్మంటాడు. అర్జున్, విజయ్‌తో నేను మహాను తీసుకుని స్టేషన్‌కి వస్తాను. నువ్వక్కడికి వచ్చెయ్ అని చెప్పి.. మహాను తీసుకుని రైల్వే స్టేషన్‌కి వస్తాడు. ఎంత వెతికినా విజయ్ కనిపించడు. చివరకి రన్నింగ్ ట్రైన్‌లో నుంచి వీళ్లకు కనిపిస్తాడు. మహా ఇచ్చిన ఫోన్ కూడా విసిరేస్తాడు. ఫ్రెండ్ అర్జున్‌ని, ప్రేమించిన అమ్మాయి మహాని వదిలేసి విజయ్ ఎందుకలా వెళ్లిపోయాడో అర్థం కాదు. చనిపోయాడనుకున్న ధనుంజయ్ బతికే ఉన్నాడని, మిమ్మల్ని చంపకముందే నా తమ్ముణ్ణి చంపెయ్యమని గూని బాబ్జీ ఆఫర్ ఇచ్చినా తిరస్కరిస్తాడు అర్జున్. అతని నుండి మహాను కాపాడే క్రమంలో ధనుంజయ్‌ను చంపేస్తాడు అర్జున్. చుంచు మామ సలహాతో సముద్రాన్ని ఆధారంగా చేసుకుని అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తూ వైజాగ్‌ సముద్రానికి కింగ్‌గా ఎదుగుతాడు అర్జున్. గర్భవతి అయిన మహాను తండ్రి ఇంట్లో నుండి గెంటెయ్యడంతో తన ఇంట్లో పెట్టుకుంటాడు అర్జున్. కొద్ది రోజులకు మహా ఓ పాపకు జన్మనిస్తుంది. అసలు విజయ్ ఎక్కడికి వెళ్లిపోయాడు. గూని బాబ్జీకి అర్జున్‌కి మధ్య వైరం ఎలా ముగిసింది అనేది కథ..

నటీనటులు..
శర్వానంద్ కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. స్నేహితుడి తప్పులను భుజం మీద మోస్తూ.. నిజాయితీగా ఉన్న వ్యక్తి అక్రమ వ్యాపారాలు చెయ్యడం, స్నేహితుడి భార్యను సొంత మనిషిలా చూసుకోవడం. అతని కూతురి ఆలనా పాలనా చూడడం. చివరకు తన ప్రేమను కూడా వదులుకోవడం.. ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు.

విజయ్‌గా సిద్దార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అలరించాడు. చాలా రోజుల తర్వాత కొత్త సిద్దార్థ్‌ను చూస్తున్నామన్న ఫీల్ కలిగించాడు. మహా పాత్రలో అదితి నటన బాగుంది. స్మిత పాత్ర ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. చుంచు మామగా జగపతి బాబు మరో డిఫరెంట్ పాత్రలో అలరించారు. రావు రమేష్, గూని బాబ్జీ క్యారెక్టర్‌లో ఆద్యంతం ఆకట్టుకున్నారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే బాబ్జీ వేసే ఎత్తులు పై ఎత్తులు సినిమాలో కీలకం. క్రూరమైన విలన్‌గా రామచంద్ర రాజు, అర్జున్ తల్లిగా శరణ్య క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి.

టెక్నీషియన్స్..
‘ఆర్‌ఎక్స్ 100’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో యూత్‌ని ఆకట్టుకున్న యువ దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమాకి భారీ కథను, అందుకు తగ్గట్లు హెవీ స్టార్ కాస్టింగ్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. కథ, క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే, డైలాగులతో ఆకట్టుకున్నాడు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు సినిమాను భారీగా తీర్చిదిద్దాయి.

ఓవరాల్‌గా..
లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మహా సముద్రం’ యూత్, మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.