మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పోరాటం.. గవర్నర్‌కు ఫిర్యాదు

  • Published By: sreehari ,Published On : September 14, 2020 / 08:14 AM IST
మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా పోరాటం.. గవర్నర్‌కు ఫిర్యాదు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనాకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు మరింత ముదురుతోంది. కంగనా మహా సర్కార్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో… ఈ వివాదం ముదురుపాకాన పడింది. మహారాష్ట్ర సర్కార్‌ తనపట్ల అమానుషంగా వ్యవహరించిందని కంగనా గవర్నర్‌కు కంప్లైంట్‌ చేసింది. మరోవైపు కంగనాకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. తమ మౌనాన్ని పరీక్షించవద్దని వార్నింగ్‌ ఇచ్చారు.



బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర సర్కార్‌పై తన పోరాటం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆమె మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీని రాజ్‌భవన్‌లో కలిసింది. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం తనపట్ల అమానుషంగా వ్యవహరించిన తీరును ఆమె గవర్నర్‌కు వివరించారు. ముంబైలో తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో పాటు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ఈ భేటీలో గవర్నర్‌ దృష్టికి ఆమె తీసుకెళ్లింది. సమాజంలో యువతులు సహా పౌరులందరిలో విశ్వాసం బలపడేలా తనకు న్యాయం జరుగుతుందని కంగనా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది తనను గవర్నర్‌ సొంత కుమార్తెలా ఆదరించి… తన వాదనను ఓపిగ్గా విన్నారని చెప్పింది.

మౌనాన్ని పరీక్షించవద్దు: ఉద్ధవ్‌
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కంగనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికర్థం తమకు ఏమీ చేతకావట్లేదని అర్థంకాదని పరోక్షంగా హెచ్చరించారు. మా మౌనాన్ని పరీక్షించవద్దని ఫైర్‌ అయ్యారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నాని చెప్పారు. ఇప్పటికీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కంగనాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కంగనాకు బ్రిహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరో షాక్‌ ఇచ్చింది.



ఇప్పటికే ఆమె కార్యాలయాన్ని పాక్షికంగా కూలగొట్టిన బీఎంసీ… ఇప్పుడు ఖర్‌లోని కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ మరో నోటీసు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాలయంకంటే… ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు జరిగాయని బీఎంసీ తన నోటీసులు స్పష్టపరిచింది. ఖర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.
https://10tv.in/kangana-ranaut-fan-arrested-in-kolkata-for-threatening-sanjay-raut/
కంగనా వర్సెస్‌ సంజయ్‌ రౌత్‌
మరోవైపు కంగనాపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనాకు బీజేపీ మద్దతు తెలపడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. బీహార్‌లో ఎన్నికల్లో క్షత్రియులు, రాజ్‌పుత్‌ల ఓట్ల కోసమే…బీజేపీ కంగనాకు మద్దతు పలుకుతోందని ఆరోపించారు.



సంజయ్‌రౌత్‌ చేసిన వ్యాఖ్యలకు కంగనా దీటుగా బదులిచ్చారు. శివసేన గూండాలు తనపై హత్యాచారానికి పాల్పడేలా బీజేపీ వ్యవహరించాలా అని ఆమె రౌత్‌ను నిలదీశారు. మొత్తానికి కంగనా, మహారాష్ట్ర సర్కార్‌ మధ్య నెలకొన్న ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.