Manchu Vishnu : అలా చేస్తే ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకుంటా – విష్ణు

Manchu Vishnu : అలా చేస్తే ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకుంటా – విష్ణు

Manchu Vishnu

Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు కోరారు.  పెద్దలు ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని తెలిపారు. గతంలో మా భవనానికి అయ్యే ఖర్చులో 25 శాతం ఇస్తానని తెలిపాను, కానీ ఇప్పుడు తమ కుటుంబం మొత్తం కలిసి మా భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చాడు. మా భవనం గురించి కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యల గురించి ఆలోచిద్దామని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు సోమవారం ఓ వీడియో విడుదల చేశారు విష్ణు… ఇందులో సినీ పరిశ్రమకు సంబందించిన విషయాలను పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడులో ఉన్న సమయంలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం నటులకి కలిపి ఒక్క నడిగర్ సంఘం మాత్రమే వుండేదని.. తెలుగు నటీనటులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ‘తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనికి తెలుగు నటీనటులే అధ్యక్షులుగా ఉంటూ అద్భుతంగా నడిపారని తెలిపారు.

ఆ తర్వాత 1993లో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ని అక్కినేని నాగేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మోహన్ బాబు, చిరంజీవి మరికొంత మంది పెద్దలు కలిసి హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. మోహన్ బాబు ‘మా’ పదవిలో ఉన్నా, లేకపోయినా సినీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటారని తెలిపారు. 1990లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సినీ కార్మికులకి నివాసం కల్పిద్దాం అని స్థలాన్ని కేటాయించిందని.. 1997లో దాన్ని ఒక పెద్ద రాజకీయ నాయకుడు తన ఫ్యాక్టరీ కోసం సొంతం చేసుకుందామని ప్రయత్నిస్తే, మోహన్ బాబుకు ఆ విషయం తెలిసి సినీ కార్మికుల తరుపున అప్పటి గవర్నర్ రంగరాజన్ ని కలిసి ఒక పిటిషన్ ఇచ్చారని వివరించారు. మోహన్ బాబు కృషి వలన ఆ స్థలం సినీ కార్మికులకు దక్కిందని అదే ఇప్పుడు చిత్రపురి కాలనీగా ఉందని తెలిపారు.

తనను 2015లో మా అధ్యక్షుడిగా పోటీ చేయమని దాసరి నారాయణరావు సూచించారని, అయితే ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత వద్దని మోహన్ బాబు సూచించారని విష్ణు అన్నారు. ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్ళే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటాను. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి తాను సిద్ధమని తెలిపాడు. పెద్దలను గౌరవిస్తాం.. వాళ్ళ సలహాలు పాటిస్తాం మని అన్నారు. మాలో యంగర్ జనరేషన్ ని ఆశీర్వదించాలని కోరారు విష్ణు