మత్తు వదలరా మూవీ రివ్యూ

  • Published By: vamsi ,Published On : December 25, 2019 / 08:33 AM IST
మత్తు వదలరా మూవీ రివ్యూ

ఆల్మోస్ట్ 2019 చివరికి వచ్చేశాం.. గత కొన్నేళ్లతో పోల్చుకుంటే సినిమా రంగం ఈ సంవత్సరం కొత్తదనంకి దూరంగా.. రొటీన్ రొట్ట ఫార్ములకు దగ్గరగా అయిపోయింది. అయితే అటువంటి సమయంలోనే ఇంకో ఐదు రోజుల్లో సినిమా సంవత్సరం అయిపోతుంది అనగా కొత్తదనం ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఓ సినిమా. ఆ సినిమానే ‘మత్తు వదలరా..’. మాములుగా ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి ఓ హీరోని ఇంట్రడ్యూస్ చెయ్యాలంటే భారీ ప్లానింగ్.. భారీ కథ.. భారీ కథనం.. ఎలివేషనల్ సీన్లు పెట్టేస్తారు.

అయితే బాహుబలి లాంటి ప్రపంచస్థాయి సినిమా తీసిన రాజమౌళి ఫ్యామిలీ నుంచి రొటీన్ సినిమాల్లా కాకుండా కథను నమ్ముకుని కీరవాణి కొడుకు శ్రీసింహా హీరోగా.. మరో కొడుకు కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌లుగా ఓ చిన్న సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు.. అయితే ఇంత సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు అన్నదమ్ములు.. కొత్త కథతో వచ్చిన దర్శకుడు ఏ మేరకు ఆకట్టుకున్నారు. 2019లో మూస  సినిమాల మత్తును ఈ సినిమా వదిలించిందా? అనే విషయం తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. 

కథ:
మన చుట్టూ ఉన్న వేలాది మంది చాలీచాలని జీతంతో బతికే కుర్రాళ్ల కథే మత్తు వదలరా కథ. బాబూ మోహన్ (శ్రీ సింహా) డెలీవరి బాయ్.. బాబూ మోహన్ స్నేహితులు ఏసుదాస్ (సత్య), అభి (అగస్త్య).  ఏసుదాస్, అభితో కలిసి బాబూ మోహన్ ఓ ఇరుకు గదిలో ఉంటాడు. చిన్న చిన్న జీతాలు వచ్చే యువకుల్లో ఉండే ఫ్రస్టేషన్ ఆ కుర్రాడిలో ఉంటుంది. బాబూ మోహన్‌కి కాస్త అతి నిద్ర.

ఈ లక్షణాల్లో భాగంగా.. అలుపు, అసహనం, ఆగ్రహం, ఆరాటం, మతిభ్రమణం వంటివి న్యాచురల్‌గా ఉంటాయి. ఏసుదాస్‌తో కలిసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు బాబూ మోహన్. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేలు కంటే ఎక్కువ సంపాదన లేకపోవడంతో ఏసుదాస్ సలహాతో తెలివిగా కస్టమర్లను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు హీరో. తర్వాత ఏమయ్యింది అనేదే అసలు కథ. 

విశ్లేషణ:
హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌ ఆధారంగా దర్శకుడు కథను సిద్ధం చేసుకున్నాడు. ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు అనే మూస ట్రెండ్‌ని పక్కనబెట్టి సినిమా చాలా ఆసక్తికరంగా..  తెలుగు మసాలాలు లేకుండా, గ్రిప్పింగ్ కథనంతో, చివరి దాకా సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ, బోర్ కొట్టకుండా సినిమాని నడిపించాడు దర్శకుడు.  కామెడీతో నవ్విస్తూ.. సస్పెన్స్‌తో టెన్షన్ పెడుతూ.. క్రియేటివిటీని ఉపయోగిస్తూ.. దర్శకుడు రితేష్ రానా ఎక్కడా తడబడలేదు.. అనుకున్న కథను అనుకున్నట్లుగానే చక్కగా తెరకు ఎక్కించాడు.

దర్శకుడు రితేష్ రానా ఎంచుకొన్న పాయింట్, కథను నడిపించిన విధానంతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. సీన్లను డిజైన్ చేసుకొన్న విధానం.. అందులో కామెడీని నింపిన తీరు సినిమాను కమర్షియల్‌గా కూడా వర్క్ ఔట్ అయ్యేలా చేశాయి. లీడ్ క్యారెక్టర్స్ అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కోవడం అనే చిన్న పాయింట్‌ని బేస్ చేసుకుని ఆసాంతం సినిమాని నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు.

పాటలు, ఫైట్స్ లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ని చాలా డీసెంట్‌గా పన్నెండు క్యారెక్టర్స్‌తో రెండు మూడు లొకేషన్లను వాడుకుని రెండు గంటల సినిమాను ఆసక్తికరంగా తీశాడు దర్శకుడు. కంటెంట్ ఉన్న కథతో క్యారెక్టర్లనే హీరోలుగా చూపించి, ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌‌లతో చివరి వరకూ సస్పెన్స్ క్రియేట్ చేసి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ కథల్లో కామెడీ వర్కౌట్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అయితే ఆ సామును కూడా సరదాగా చేసేశాడు దర్శకుడు. ఓవరాల్‌గా సినిమాకు వంద శాతం న్యాయం చేశాడు దర్శకుడు. అందుకే కథ సినిమాను నడిపిస్తే.. కామెడీ సినిమాకి బలం అయ్యింది.

నటీనటులు:
ఈ సినిమాలో హీరో ఓ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు.. కిరావాణి కొడుకు.. అంటే మినిమమ్ ఓ స్టార్ హీరోయిన్ ని పక్కన బెట్టి.. భారీ బడ్జెట్‌తో సినిమా తీసే సినిమా కానీ నటుడిలో క్రమశిక్షణ అనే కోణం చాలా ముఖ్యం. ఇందులో నటుడు శ్రీ సింహాలో అది ఫస్ట్ సినిమాలోనే కనిపించింది. కిరవాణి కొడుకు అనే ట్యాగ్‌ని కచ్చితంగా పక్కన పెట్టేసే సత్తా ఉన్నా నటుడు అనిపించుకున్నాడు. సినిమాలో శ్రీ సింహా.. బాబూ మోహన్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు.

అక్కడక్కడా కొత్త నటుడు అనే ఫీలింగ్ కలిగినా.. తన పాత్రకు మాత్రం పూర్తి న్యాయం చేశాడు.  హావభావాలు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగల అన్ని అర్హతలు అతనికి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక సినిమాలో మిగిలిన క్యారెక్టర్లలో ముఖ్యంగా ఫీమేల్ లీడ్ రోల్ చేసిన హీరోయిన్ అతుల్య బాగా నటించింది.

కామెడీ పరంగా సత్య చేసిన పాత్ర అతను అయితేనే న్యాయం చేయగలడు అన్నట్లుగా నటించాడు. న‌రేష్ అగ‌స్త్య పాత్ర రాసుకున్న తీరు ఆ పాత్రలో ఒదిగిన తీరు మెప్పిస్తుంది. ఈ కథలో ముఖ్య పాత్రల్లో నటించిన పావలా శ్యామలా, బిగ్ బాస్ ఫేమ్, సీరియల్ నటి రోహిణి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, విద్యుల్లేఖ పాత్రల్లో ఒక్కో రోల్ వెనుక ఒక్కో ట్విస్ట్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఆయా పాత్రల్లో వాళ్లు ఒదిగిపోయారు.

టెక్నికల్‌గా: 
టెక్నికల్‌గా సినిమాకు ప్రతి ఒక్కరు ఎవరి పనిని వాళ్లు చక్కగా నిర్వర్తించారు. సినిమాలో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమైన కాలభైరవ తన తొలిసినిమాతోనే ఆకట్టుకొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్‌తో సినిమాకు ప్రాణం పోశాడు. రాబోయే రోజుల్లో కాలభైరవ టాలీవుడ్‌లో తన మార్క్ చూపించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫి బాగుంది. కెమెరా పనితనం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. కాకపోతే ఫస్టాఫ్‌లో కొన్నిచొట్ల కత్తెరలు మిస్ అయ్యాడు. అయితే అవి చెప్పుకోదగ్గ పెద్దవి అయితే కాదు. 

నిర్మాణ విలువలు:
మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ ద్వారా ఈ సినిమా విడుదలైంది. సినిమాకు తగ్గట్టుగా నిర్మాణ విలువలు అదే స్థాయిలో ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలతో భారీ సినిమాలను చేసే మైత్రీ మైవీ మేకర్స్ కథను నమ్మి ఈ సినిమాని చేసింది. తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన ఈ సినిమాలో కథకు ఏం కావాలో అది ఇచ్చారు నిర్మాత చిరంజీవి.

హైలెట్స్:
సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు అని చెప్పుకోవాలంటే కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కానీ ఇందులో కథే హీరో.. కథనమే హీరో.. ఫైట్లు.. పాటలు.. మాస్ మసాలా.. రొమాన్స్.. కావాలి అనుకునేవాళ్లకు మాత్రం సినిమాలో అవేమీ దొరకవు. అయితే కొత్తదనం ఆశ్వాదించే అభిమానులకు మాత్రం ఈ సినిమా మత్తు కచ్చితంగా ఎక్కిస్తుంది. కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్విస్ట్‌లు బాగుంటాయి. 

ఓవరాల్‌గా ఎప్పుడూ కమర్షియల్ సినిమాలేనా? అని భావించే వాళ్లకు ‘మత్తు వదలరా’ ఈ వీకెండ్‌కి మంచి ఆప్షన్.  కొత్త కుర్రాళ్లు కిక్కు బాగా ఎక్కిస్తారు.