‘మా’ ఎన్నికలు : నరేశ్ కే మెగా ఫ్యామిలీ సపోర్ట్

  • Published By: vamsi ,Published On : March 9, 2019 / 08:43 AM IST
‘మా’ ఎన్నికలు : నరేశ్ కే మెగా ఫ్యామిలీ సపోర్ట్

‘మా’ అసోషియేషన్ ఎన్నికలు సాధరణ ఎన్నికలు మాదిరే రంజుగా సాగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రెసిడెంట్‌గా శివాజీ రాజా కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు జరుగుతుండగా.. పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్నికలవేళ కాక పుట్టిస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్.. జీవిత, రాజశేఖర్‌లతో తన టీమ్‌ను రెడీ చేసుకుని గట్టి పోటీని ఇస్తుండగా మరోసారి సీటు దక్కించుకోవడం కోసం పోటీలో నిలుస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇప్పటివరకు శివాజీరాజాకు, హీరో శ్రీకాంత్‌కు సపోర్ట్ చేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు మాత్రం సీనియర్ నటుడు నరేష్‌కు సపోర్ట్ చేస్తుంది.

గతంలో ‘మా’ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, జయసుధలు నిలబడినప్పుడు గందరగోళ పరిస్థితులు ఎర్పడ్డాయి. మీడియాకు ఎక్కి హడావుడి చేశారు. ఇప్పుడు కూడా సినిమా కెమెరాల ముందు చేయాల్సిన డ్రామాను మీడియా కెమెరాల ముందు చేస్తున్నారు. రెండవసారి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న శివాజీరాజాకు తన సపోర్ట్ లేదంటూ మెగా బ్రదర్ నాగబాబు స్పష్టం చేశారు. నరేష్, జీవిత, రాజశేఖర్ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నానని,  ఎందుకంటే ఎప్పుడూ ప్రెసిడెంట్‌గా ఒక్కరే కంటిన్యూగా చేయకూడదనేది నా అభిప్రాయం. నేను ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు కూడా నన్ను మళ్లీ చేయమన్నారు. అయితే నేను ఒక్కసారే చేస్తానని చెప్పానన్నారు. అసలెవరికి రెండు మూడు సార్లు చేసే అవకాశం ఉండకూడదు అంటూ ఆయన తెలిపారు.

దీనంతటికీ కారణం శ్రీరెడ్డి విషయంలో జరిగిన పరిణామాలే అంటున్నారు. నాగబాబు, మెగా ఫ్యామిలీ కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎవ‌రు ప‌డితే వాళ్లు వ‌చ్చి మా అసోసియేష‌న్ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటే శివాజీరాజా వాళ్లు చూస్తూ ఉన్నారు కానీ.. యాక్ష‌న్ తీసుకోలేదని, అందుకే డిసప్పాయింట్ అయ్యానంటూ నాగబాబు తెలిపారు. మీడియా కూడా అప్పుడు ‘మా’కు వ్య‌తిరేకంగా మాట్లాడితే న‌రేష్, జీవిత‌గారే ధైర్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. ఈసారి కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే వాళ్లేం చేస్తారో కూడా తెలుస్తుందని అన్నారు.