YS Jagan Chiranjeevi Meeting : మరోసారి జగన్‌తో చిరు భేటీ -సినిమా టికెట్ల గొడవకు శుభం కార్డు పడనుందా !

సినిమా ఇండస్ట్రీ సమస్యలు, టికెట్‌ రేట్ల వివాద పరిష్కారానికి ముందడుగు వేసిన చిరంజీవి.. సీఎం జగన్‌తో గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను క

YS Jagan Chiranjeevi Meeting : మరోసారి జగన్‌తో చిరు భేటీ -సినిమా టికెట్ల గొడవకు శుభం కార్డు పడనుందా !

CM Jagan Chiru Meeting

YS Jagan Chiranjeevi Meeting :  సినిమా ఇండస్ట్రీ సమస్యలు, టికెట్‌ రేట్ల వివాద పరిష్కారానికి ముందడుగు వేసిన చిరంజీవి.. సీఎం జగన్‌తో గురువారం మరోసారి భేటీ కానున్నారు. చిరంజీవితో పాటు ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంను కలిసే అవకాశం ఉంది. వారంతా ఇండస్ట్రీ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే టికెట్ల ధరలపై చర్చించనున్నారు.

మరోవైపు ఇవాళ (ఫిబ్రవరి8న) సినీ ప్రముఖులతో చిరంజీవి భేటీ కావాలని భావించినా.. పలువురు ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో మరోసారి వాయిదా పడింది. ఈ మీటింగ్‌లో సీఎం ముందు ఏ ప్రతిపాదనలు పెట్టాలనే దానిపై చర్చించాలని అనుకున్నారు.

ఎల్లుండి గురువారం సీఎం-చిరు భేటీలో అయినా గత కొంతకాలంగా నలుగుతోన్న టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలు, టికెట్ల వివాదం కొలిక్కి వస్తుందా..? చిరు వేసిన ముందడుగు ఫలిస్తుందా..? ఇండస్ట్రీ ఒక్కతాటిపైకి వస్తుందా..? సీఎం జగన్‌ టాలీవుడ్‌ ట్రబుల్స్‌కి పరిష్కారం చూపిస్తారా..? చిరుతో జగన్‌ భేటీ మొత్తం ఎపిసోడ్‌కు శుభం కార్డు వేస్తుందా..? వీటన్నింటికీ సమాధానం ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందని పరిశీలకలు భావిస్తున్నారు.

ఇండస్ట్రీ సమస్యలపై జనవరి 13న సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఈసారి ఇండస్ట్రీ సభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలుస్తానని చిరంజీవి ఆరోజే ప్రకటించారు. అందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు మరోసారి ముఖ్యమంత్రితో చర్చించేందుకు… ఇండస్ట్రీ మనోగతాన్ని తెలియచేసేందుకు మెగాస్టార్ చిరంజీవి మరోసారి సమావేశం కానున్నారు.

ఇటు వరుసగా పెద్ద సినిమాల రిలీజ్‌ తేదీలను నిర్మాతలు ప్రకటిస్తున్నారు. కరోనా, టికెట్‌ రేట్ల వ్యవహారంతో ఆగిపోయిన సినిమాలన్నీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వరుస పెట్టి మూవీస్‌ అన్నీ సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ట్రిపుల్‌ ఆర్‌, భీమ్లా నాయక్‌, ఆచార్య, రాధేశ్యామ్‌, ఏఫ్‌-3, సర్కారువారి పాట సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్నాచితకా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

ఇలా వరుస పెట్టి సినిమాలు వస్తున్నందున వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సినీ ఇండస్ట్రీ కోరుతోంది. ప్రభుత్వం కూడా ఈ సమస్యకు శుభం కార్డు వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి, సీఎం వైఎస్.జగన్‌ భేటితో ఈసారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఇండస్ట్రీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సినిమా ఇండస్ట్రీ సమస్యలు కొలిక్కి వచ్చాయని.. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే కొందరు టికెట్ల ఇష్యూను రాజకీయం చేశారని ఆరోపించారాయన. ఇండస్ట్రీ సమస్య అంత పెద్ద సమస్యేమీ కాదని.. ఆ సమస్యను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు సజ్జల.

మరో వైపు రాజ్యసభలోనూ ఏపీ సినిమా టిక్కెట్ల అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌. పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసేందుకే ఏపీ ప్రభుత్వం.. మూవి టిక్కెట్‌ రేట్లను రెగ్యులరైజ్‌ చేస్తోందని ఆరోపించారు.

Also Read : Searching For Parents : ఎక్కడున్నావమ్మా…కన్నవారి కోసం 40 ఏళ్ల వ్యక్తి గాలింపు

అయితే చిరంజీవి జగన్‌ని కలవడంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు. అది చిరు వ్యక్తిగత సమావేశమే కానీ.. అసోసియేషన్‌ భేటీగా భావించొద్దన్నారు. వ్యక్తిగతంగా ఒకరు మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావనన్నారు.