అల్లు జయంతి.. చిరు, చరణ్ భావోద్వేగం..

  • Published By: sekhar ,Published On : October 1, 2020 / 06:28 PM IST
అల్లు జయంతి.. చిరు, చరణ్ భావోద్వేగం..

Chiranjeevi – Allu Ramalingaia: తెలుగు ప్రేక్ష‌కులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం… గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ, డాక్ట‌ర్‌ అల్లు రామ‌లింగ‌య్య. తెలుగు తెరపై ఎప్పటికీ చెరిగిపోని హాస్యపు జల్లు.. అల్లు.. 1000 కి పైగా చిత్రాల్లో నటించి… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి మార్గదర్శకుడయ్యారాయన.


అల్లు తెర‌పై క‌నిపిస్తే పాత్ర క‌నిపిస్తుంది కానీ ఆయ‌న క‌నిపించ‌రు. తెలుగు సినిమా చరిత్రలో గ‌ర్వించ‌ద‌గ్గ‌ గొప్ప క్లాసిక్స్‌లో అల్లు రామ‌లింగ‌య్య పాత్రలు ఉండ‌టం విశేషం. నటుడుగానే కాక హోమియోపతి డాక్ట‌ర్‌గా ప‌లు సేవాకార్య‌క్ర‌మాలు అందించిన అల్లు రామ‌లింగ‌య్య 1 అక్టోబ‌ర్ 1922న జ‌న్మించారు. ఆయ‌న ఈ సంవ‌త్స‌రంతో 99 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుని 2021 సంవ‌త్స‌రంలో శతజయంతి మైల్ స్టోన్‌ని అందుకోనున్నారు.


ఆయన జయంతి సందర్భంగా ఆయన కుమారుడు, మనవళ్లు.. ఆయన పేరు మీద ‘అల్లు స్టూడియో’ని నిర్మించనున్నట్లుగా ప్రకటించగా.. ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు ఆయన అల్లుడు, మెగాస్టార్‌ చిరంజీవి. ట్విట్టర్‌ ద్వారా అల్లు రామలింగయ్యను ఆయన గుర్తు చేసుకున్నారు.


‘‘ఆయన పేరు గుర్తురాగానే అందరి పెదాలపైన చిరునవ్వు మెదులుతుంది. మావయ్యగారు కేవలం అందరిని మెప్పించిన నటుడే కాదు.. తియ్యని గుళికలతో వైద్యం చేసే హోమియోపతి డాక్టర్‌ కూడా. స్వాతంత్ర్య సమరయోధుడు, తత్వవేత్త, నాకు మార్గదర్శి.. గురువు..

అన్నిటిని మంచి మనసున్న మనిషి. ఈ 99వ పుట్టినరోజునాడు ఆయనని స్మరిస్తూ.. వచ్చే సంవత్సరం ఆయన శతజయంతి వేడుక ఆయన జీవితాన్ని, జీవన విధానాన్ని ఆవిష్కరిస్తుందని ఆశిస్తున్నాను..’’ అని పేర్కొంటూ చిరంజీవి.. తన పెళ్లిలో అల్లు రామలింగయ్య ఆశీస్సులు తీసుకుంటున్న ఫొటోని షేర్‌ చేశారు.

‘‘తన 99వ జయంతి సందర్భంగా ప్రియమైన తాత శ్రీ అల్లు రామలింగయ్య గారిని తలుచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన లేని లోటు తీర్చలేనిది..’’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు.