మర్డర్ సినిమా రిలీజ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్, చాలా సంతోషంగా ఉంది – వర్మ

  • Published By: madhu ,Published On : November 6, 2020 / 01:17 PM IST
మర్డర్ సినిమా రిలీజ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్, చాలా సంతోషంగా ఉంది – వర్మ

MURDER Movie Ramgopal Varma : మర్డర్ సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందించారు. తమ మంచి ఉద్దేశ్యాలను కోర్టు అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు 2020, నవంబర్ 06వ తేదీ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. హైకోర్టు నుంచి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత వివరాలు తెలియచేస్తామని, ప్రతొక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆర్జీవీ.



మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ‘మర్డర్‌’(కుటుంబ కథా చిత్రం) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్‌లు కూడా విడుదల చేశారు. ట్రైలర్ కూడా విడుదల చేశారు.
అయితే..మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యంతరం వ్యక్తం చేస్తూ..తన కొడుకు హత్య కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా సినిమా తీస్తే..సాక్షులు, బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించారు.



ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారాయన. బాలస్వామి సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా..వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే..తాజాగా..2020, నవంబర్ 06వ తేదీ శుక్రవారం మర్డర్‌ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా రిలీజ్‌పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను… హైకోర్టు కొట్టేసింది. మర్డర్‌ సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. అయితే మర్డర్‌ సినిమాలో ప్రణయ్‌, అమృతల అసలు పేర్లు వాడకూడదని హైకోర్టు షరతు విధించడంతో… చిత్ర యూనిట్‌ అంగీకారం తెలిపింది.



అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నిర్మాత నట్టి కుమార్ పిల్లలు నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.



మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కూతురు అమృత.. ప్రణయ్‌ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కారణంతో అల్లుడిని హత్య చేయించాడు.
2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం సృష్టించింది. గిరిజ నన్ను క్షమించు..అమృత..ఇంటికి రా..అని ఓ లేఖ అక్కడ కనిపించింది.



మారుతీరావు అంత్యక్రియలకు భారీ పోలీసు బందోబస్తుతో అమృత వచ్చింది. కానీ..బంధువులు అందుకు అంగీకరించలేదు. దీంతో అమృత తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో..తల్లిని 2020, మార్చి 14వ తేదీ శనివారం అమృత కలిసింది.



2018, జనవరి 31 ప్రణయ్, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
2018, సెప్టెంబర్‌ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన..మారుతీ రావు..ప్రణయ్‌ని అతి దారుణంగా హత్య చేయించాడు.



జూన్ 12వ తేదీన పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. 1600 పేజీల ఛార్జీషీట్‌ను న్యాయస్థానంలో సమర్పించారు.
కూతురు తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్, ఎంఏ కరీం, అస్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు.
మారుతీ రావు(ఆత్మహత్య చేసుకున్నాడు), శ్రవణ్, కరీం బెయిల్‌పై రిలీజ్ అయ్యారు.