MM Keeravani : కూటి కోసం వ్యవసాయం చేసిన దగ్గర్నుంచి.. పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్ వరకూ.. కీరవాణి సంగీత ప్రయాణం..

కీరవాణి.. ఏ ముహూర్తంలో ఓ రాగం పేరు ఆయనకు పెట్టారో కానీ సప్త స్వరాలని ఆయన రాగాలలో ఆటలాడిస్తాడు, ఆయన సంగీతంలో ఊయలలూపుతాడు. అన్నమయ్య అంటూ భక్తి రసాన్ని, అల్లరిప్రియుడు అంటూ అల్లరిని, కొమరం భీముడో అంటూ..................

MM Keeravani : కూటి కోసం వ్యవసాయం చేసిన దగ్గర్నుంచి.. పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ నామినేషన్ వరకూ.. కీరవాణి సంగీత ప్రయాణం..

MM Keeravani :  కీరవాణి.. ఏ ముహూర్తంలో ఓ రాగం పేరు ఆయనకు పెట్టారో కానీ సప్త స్వరాలని ఆయన రాగాలలో ఆటలాడిస్తాడు, ఆయన సంగీతంలో ఊయలలూపుతాడు. అన్నమయ్య అంటూ భక్తి రసాన్ని, అల్లరిప్రియుడు అంటూ అల్లరిని, కొమరం భీముడో అంటూ బాధని, మేజర్ చంద్రకాంత్ అంటూ దేశభక్తిని, బొంబాయి ప్రియుడు అంటూ ప్రేమని.. ఇలా అన్ని రకాల సంగీత సాగరంలో మనల్ని ముంచెత్తుతున్నాడు కీరవాణి. ఇప్పుడు మన దేశంలోనే కాదు నాటు నాటు మాస్ బీట్ తో ప్రపంచాన్ని ఊర్రూతలూగిస్తున్నారు కోడూరి మరకతమణి కీరవాణి.

కీరవాణి తండ్రి శివదత్త మంచి చిత్రకారుడు అంతే కాక గిటార్‌, సితార్‌, హార్మోనియం, కథలూ, కవితలు, సాహిత్య రంగంలోనూ ప్రవేశం ఉంది. ఆయన సినిమాలపై ఆసక్తితో ఎల్వీప్రసాద్‌ దగ్గర సహాయకుడిగా కొన్నాళ్ళు చేసి అవకాశాలు లేకపోవడంతో తిరిగి వచ్చేశారు. శివదత్త, సంగీత దర్శకురాలు శ్రీలేఖ వాళ్ళ నాన్న, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌.. ఇలా అన్నదమ్ములు అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వ్యవసాయం చేసేవారు. తన కొడుక్కి సంగీతం మీద మక్కువతోనే కీరవాణి అనే రాగం పేరు పెట్టారు.

 

కీరవాణి సంగీతం నేర్చుకోవాలని పట్టుబట్టి ఆయన తండ్రి శివదత్తే నేర్పించారు. ఆ తర్వాత రాయచూరులో దత్తప్ప అనే విద్వాంసుడి దగ్గర కీరవాణి కొన్నాళ్ళు సంగీతం అభ్యసించారు. వయోలిన్‌ కూడా అక్కడే నేర్చుకున్నారు. కొన్నాళ్ళు ఓ ఆర్కెస్ట్రా వాళ్ళు కీరవాణిని తమ ట్రూప్‌లో చేర్చుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఇంటర్ అయ్యాక ఇంజినీర్‌ అవ్వాలి అని అనడంతో ఎంట్రన్స్ పరీక్ష రాసినా సీటు రాలేదు. ఇంట్లో వాళ్లంతా బాధపడినా కీరవాణి తండ్రి మాత్రం సంతోషించి సంగీతంపై ఫోకస్ చేయమన్నాడు. అప్పట్నుంచి కీరవాణి తండ్రి పాటలు రాస్తూ కొడుకుని బాణీలు కట్టమన్నారు. కొన్ని రోజుల తర్వాత ‘జాలీ ఫ్రెండ్స్‌’ అనే ఆర్కెస్ట్రాలో చేరి పాటలు కూడా పాడారు. అప్పుడే సినిమాల్లోకెళ్ళి గాయకుడు కావాలని అనుకోని మద్రాసు వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగాడు. కానీ అవకాశాలు రాలేదు. కనీసం వయోలినిస్టుగానైనా వెళదాం అనుకున్నప్పుడు ఓ మలయాళ సంగీత దర్శకుడు బెంగళూరులో ఓ కన్నడ సినిమా రీరికార్డింగ్‌ ఉంది. మా వయోలినిస్ట్‌ రాలేదు అని చెప్పి రమ్మన్నాడు కానీ అతని టీంలో వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేశాం రావక్కర్లేదు అన్నా బెంగుళూరుకి డైరెక్ట్ గా వెళ్లడంతో ఆ సంగీత దర్శకుడు ఎంతో సంతోషించారు. దాంతో ఆయన దగ్గర కొన్నాళ్ళు జీతం మీద పనిచేశారు కీరవాణి.

తెలిసిన వాళ్ళు సినిమా తీస్తూ సంగీతం బాధ్యతలు కీరవాణికి అప్పచెప్పారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అలా రెండు, మూడు సినిమా ఛాన్సులు వచ్చి చేజారిపోయాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర కొన్నాళ్ళు అసిస్టెంట్‌గా చేసి బయటకి వచ్చినా అవకాశాలు లేకపోవడంతో ఇంటికెళ్లి మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టాడు. కానీ సినిమాల మీద ప్రేమతో మళ్ళీ మద్రాసు వెళ్తే ఈ సారి వేటూరి గారి పరిచయంతో పాటలకి బాణీలు కట్టడం మొదలుపెట్టారు. శివ సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో కీరవాణి ఓ ‘విజిటింగ్‌ కార్డు’ తయారు చేసి తను చేసిన పాటలు, బాణీలు కొన్ని ఓ క్యాసెట్టులో రికార్డు చేసి దాన్ని కొన్ని కాపీలు తీసి కనిపించిన దర్శక నిర్మాతలు అందరికి ఇచ్చినా ఫలితం లేకపోయింది. అప్పుడే వేటూరి గారి సిఫార్సుతో ఉషాకిరణ్‌ మూవీస్‌ లో మొదటిసారి ‘మనసు-మమత’ సినిమాకి సంగీతదర్శకుడిగా ఛాన్స్ రావడంతో ప్రయాణం మొదలైంది. అందుకే ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేదికపై తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన రామోజీ రావు గురై పేరు కూడా చెప్పారు.

మొదట చిన్న చిన్న సినిమాలు, ఆఫర్స్ వచ్చిన సినిమాలు అన్నీ చేసుకుంటూ వెళ్లినా గుర్తింపు రాలేదు. సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో కీరవాణికి మంచి గుర్తింపు వచ్చింది. తమిళ్ లో బాలచందర్ దర్శకత్వంలో ‘అళగన్‌’ సినిమాకి మొదట అవకాశం రాగా ఆ సినిమాకి కీరవాణి చేసిన పాటలు సూపర్ హిట్ అవ్వడంతో తమిళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నాడు. కీరవాణికి వచ్చిన మొదటి అవార్డు కూడా ఇదే. తమిళ్ లో కీరవాణి పేరు మరకతమణి అని పడుతుంది. తెలుగులో ఆర్జీవీతో ‘క్షణక్షణం’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కీరవాణికి పెద్ద సినిమాల ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. కె.రాఘవేంద్రరావు కీరవాణి కాంబినేషన్ లో దాదాపు 25 పైగా సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక రాజమౌళి మొదటి సినిమా నుంచి అన్ని సినిమాలకి కీరవాణినే సంగీత దర్శకుడు. ఒకానొక సమయంలో నిద్ర పోవడానికి కూడా ఖాళీ దొరకకపోవడంతో కేవలం పెద్ద సినిమాలు, మంచి సినిమాలు, పేరున్న సినిమాలే చేయాలని డిసైడ్ అయ్యారు. హిందీలో కూడా కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు.

కొన్ని సంవత్సరాల పాటు తన ఇంట్లో అందరూ సెటిల్ అయ్యేవరకు ఉమ్మడి కుటుంబం ఇంటి బాద్యతలన్నీ కూడా కీరవాణినే చూసుకున్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం ముమాత్రమే కాదు పాటలు రాశారు, పాడారు కూడా. ఇప్పటివరకు దాదాపు 250 కి పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు. ఇంత సీనియర్ సంగీత దర్శకుడికి సొంత స్టూడియో కూడా లేకపోవడం విశేషం. తనకన్నా తక్కువ వాళ్ళైనా, చిన్న వాళ్ళైనా, ఎవరైనా సరే అందరికి మర్యాద ఇస్తారు. 11 నంది అవార్డులు, సైమా అవార్డులు, 8 ఫిలింఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డు.. ఇలా భారత దేశంలో అనేక అవార్డులు గెలుచుకున్న కీరవాణి RRR సినిమాతో అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంటున్నారు.

Sukumar : ఈ కుర్చీ మీ కోసమే రాజమౌళి సార్.. సుకుమార్ స్పెషల్ పోస్ట్..

RRR సినిమాలోని నాటు నాటు పాటతో ప్రపంచాన్ని ఊపేశారు. విదేశీయులు సైతం ఈ పాటకి కాలు కదులుపుతున్నారు. దీంతో నాటు నాటు సాంగ్ కి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు వరించాయి. నాటు నాటు పాటతో ప్రపంచ సినిమా అవార్డులలో ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సాధించారు. అనంతరం ఏకంగా నాటు నాటు పాటతో ప్రపంచ సినిమా అత్యున్నత పురస్కారం ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి అందనంత ఎత్తుకి ఎదిగారు. ఒక్క అడుగు దూరంలో ఆస్కార్ ఎదురు చూస్తుంది. ఆయనకి ఆస్కార్ రావాలని భారతదేశం మొత్తం కోరుకుంటుంది. వరుసగా ఇన్ని ఆనందాల మధ్య భారత ప్రభుత్వం తాజాగా కీరవాణికి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడంతో ఈ సంతోషం మరింత రెట్టింపైంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు, మ్యూజిక్ అభిమానులు, ప్రముఖులు కీరవాణికి అభినందనలు తెలియచేస్తున్నారు.