తమన్‌పై ట్రోలింగ్ అందుకేనా? కాపీ కొడితే ఆఫర్లు వస్తాయా?

తమన్‌పై ట్రోలింగ్ అందుకేనా? కాపీ కొడితే ఆఫర్లు వస్తాయా?

Music Director Thaman:టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. పాటలతో ఎంత ఫేమసో.. ట్రోలింగ్‌తో అంతే ఫేమస్ అవుతుంటారు.. ఎప్పుడూ ఏదో ఒక వివాదం తమన్ చుట్టూ తిరుగుతూనే ఉంటది.. కాదుకాదు తిప్పుతూనే ఉంటారు సోషల్ మీడియాలో ట్రోలర్స్. వాస్తవానికి ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు అన్నీ కూడా తమన్ చేతిలోనే ఉన్నాయి. బిజీబిజీ షెడ్యూల్‌లతో తమన్ గడిపేస్తూ ఉంటాడు.. టాప్ హిట్లు కొట్టేస్తుంటాడు. కాపీ కొట్టి.. ఇంటికెళ్తే మా అమ్మ అన్నం పెడుతుందా?అంటూ త‌మ‌న్ ఆవేదన వ్యక్తం చేస్తే దానిని కూడా ట్రోలింగ్ కంటెంట్ చేసేశారు. తమన్ కొట్టిన ప్రతీ పాటకు ‘ఇదిగో కాపీ ట్యూను’ అంటూ ట్రోలింగ్ చేయడంపై తమన్ డైరెక్ట్‌గా ఇప్పడు రియాక్ట్ అయ్యారు.

తాను చేసే ట్యూన్‌లు కాపీ కాదు అంటూ గట్టిగా చెబుతున్న తమన్.. సంక్రాంతికి రాబోతున్న `క్రాక్‌` సినిమా రిలీజ్ సంధర్భంగా మాట్లాడుతూ.. “నేను నిజంగా కాపీ కొడితే.. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ ఊరుకుంటారా? ఇంతింత పారితోషికాలు ఇస్తారా? అసలు సినిమా ఆఫ‌ర్లు వ‌స్తాయా? అంటూ ప్రశ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాపై ఒక్క ఫిర్యాదు కూడా ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. తనను ట్రోల్ చేసేవారిని గురించి ప‌ట్టించుకోనంటూనే సీరియస్ అయ్యారు.

బిజినెస్‌మెన్‌లోని `పిల్ల చావ్`పాటపై వ‌చ్చినన్ని విమ‌ర్శ‌లు నాకెప్పుడూ ఎదురుకాలేదు. మ‌రొక‌రైతే మ్యూజిక్ మానేసేవారు.. కానీ నేను నిల‌దొక్కుకున్నా.. తర్వాత కూడా వంద సినిమాలు చేశా. `అల వైకుంఠ‌పుర‌ములో` సూప‌ర్ హిట్ట‌య్యింది. ఆసినిమాలోని పాట‌ల‌కు గొప్ప స్పంద‌న వ‌చ్చింది. అందుకే న‌న్ను ఎలా టార్గెట్ చేయాలా? అని ఓ వ‌ర్గం ఆలోచిస్తోంది. వాళ్ల ప‌నే ఇదంతా. వాళ్ల‌కు నేను స‌మాధానం చెప్పాలంటే రెండు నిమిషాల ప‌ని. నేను కాపీ కొట్టా అన్నవాళ్లు సొంతంగా ఓ ట్యూన్ కొట్టి, హిట్టు కొట్ట‌గ‌ల‌రా“ అని స‌వాల్ విసిరాడు త‌మ‌న్‌.

తనపై కొంతమంది పనికట్టుకుని టీమ్‌లా తయారయ్యి ట్రోలింగ్ చేస్తున్నారని, విమర్శలు, వివాదాలను పట్టించుకునే టైమ్ కూడా తనకు లేదని అన్నారు.