సైరాకు బ్రేక్.. షూటింగ్ అడ్డుకున్న ముస్లీంలు

  • Published By: vamsi ,Published On : February 25, 2019 / 07:22 AM IST
సైరాకు బ్రేక్.. షూటింగ్ అడ్డుకున్న ముస్లీంలు

చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ కు బ్రేక్ పడింది. భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బీదర్ లో జరుగుతుంది. 200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో బాహుబ‌లి త‌ర్వాత ఆ స్థాయి సినిమాగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా రామ్ చ‌ర‌ణ్ తెరకెక్కిస్తుండగా.. సినిమా చిత్రీకరణను బీదర్‌ పట్టణంలో స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. మహుమని కోటలో సినిమా చిత్రీకరణ ముస్లిం ప్రార్థనా స్థలంలో జరుగుతుండడంతో ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలు ఉంచకూడదనే ప్రధాన కారణంతో ముస్లిం యువకులు గుంపుగా వచ్చి అడ్డుకున్నట్లు తెలిస్తుంది.

చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిపైన నటుడు కిచా సుధీప్ పైన కేసు పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో భారీ తారాగణంతో నిర్మిస్తున్న సైరానరసింహ రెడ్డి చిత్రం హిస్టారికల్‌ సినిమా కావడంతో నగరంలోని బహుమనీ కోటలో హిందూ విగ్రహాలను పెట్టుకుని షూటింగ్‌ సెట్‌ వేశారు. అయితే ముస్లీం యువకులు షూటింగ్‌ ను అడ్డుకున్నారు. పురాతత్వ శాఖద్వారా అనుమతి పొందినా చిత్రీకరణను ముస్లీం యువకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విచ్చేసి హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. బీదర్ పట్టణం చాలా సెన్సెటీవ్ ఏరియా కావడంతో అక్కడి అధికారులు కూడా సెట్లను తొలగించాలని చిత్రయూనిట్ ను కోరుతున్నారు. సైరా నరసింహా రెడ్డి షూటింగ్ కోసం చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ నటుడు కిచ్చ సుదీప్ లు బీదర్‌కు వెళ్లారు. ఇప్పుడు వారంతా తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడే షూటింగ్ చేయాలని భావిస్తున్నారు.