మజిలీ రివ్యూ

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘నాగ చైతన్య’ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

  • Published By: madhu ,Published On : April 5, 2019 / 01:02 PM IST
మజిలీ రివ్యూ

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘నాగ చైతన్య’ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘నాగ చైతన్య’ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మాస్‌ యాక్షన్‌ జానర్లో తెరకెక్కించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్‌ కావటంతో మరోసారి తనకు మంచి పట్టున్న రొమాంటిక్‌ డ్రామానే ఎంచుకున్నాడు చైతూ. అంతేకాదు తన రియల్‌ లైఫ్‌ పార్టనర్‌తో కలిసి రీల్‌ లైఫ్‌లో మరో సక్సెస్‌ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ ఫుల్‌ ఎంట్రీ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత జంటగా తెరకెక్కిన సినిమా ‘మజిలీ’. మరి ఈ సినిమానైనా చైతూ కెరీర్‌ను సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కించిందా..? లేదా అనేది చూద్దాం. 
Read Also : క‌న్ఫ్యూజ్ చేస్తున్న ‘వెంకీమామ’ టైటిల్‌ లోగో

కథ‌ : –
పూర్ణ (నాగచైతన్య) ITI చదువుతూ ఎలాగైన రైల్వేస్‌ టీమ్‌లో క్రికెటర్‌గా స్థానం సంపాదించాలని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. ఓ గొడవ కారణంగా పరిచయం అయిన అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో పూర్ణ ప్రేమలో పడతాడు. కానీ పెద్దలు వారి ప్రేమకు అడ్డు చెప్తారు. అన్షును దూరంగా తీసుకెళుతారు తల్లిదండ్రులు. అన్షు దూరమైందన్న బాధలో పూర్ణ కెరీర్‌ను కూడా వదిలేసి తాగుబోతులా తయారవుతాడు. ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల కారణంగా పూర్ణ.. శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. తండ్రి కోసం పెళ్లి చేసుకున్న పూర్ణ.. ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. చివరకు పూర్ణ, శ్రావణికి ఎలా దగ్గరయ్యాడు? పూర్ణలో మార్పుకు కారణం ఏంటి? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టుల ఫెర్మామెన్స్ : –
హీరోగా ‘నాగ చైతన్య’ ప్రతీ సినిమాకు పరిణితి సాధిస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో చాలా బాగా నటించాడు. ఫస్ట్‌ హాప్‌లో యువకుడిగా ఎనర్జిటిక్‌ ఫెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్‌ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్‌ ఫెర్ఫామెన్స్‌తో మెప్పించాడు. తొలి పరిచయంలోనే దివ్యాంశ కౌశిక్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. కేవలం సెకండ్ హాఫ్‌లోనే కనిపించిన సమంత తన సూపర్బ్ ఫెర్ఫామెన్స్‌తో అందరినీ డామినేట్ చేసేసింది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. ఇతర పాత్రల్లో రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేష‌ణ‌ : –
‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివా నిర్వాణ మరోసారి ఎమోషనల్‌ డ్రామానే ఎంచుకున్నాడు. ఎలాంటి కమర్షియల్‌ హంగులకు పోకుండా తను అనుకున్న కథను రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. ‘నిన్ను కోరి’ తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌.. చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, ఫ్రెండ్స్‌‌తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన దర్శకుడు, సెకం‍డ్‌ హాఫ్ అంతా ఎమోషనల్‌గా కథ నడిపించాడు. అయితే అక్కడక్కడ కథనం నెమ్మదించటం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. గోపి సుందర్‌ అందించిన పాటలు కథలో భాగం వచ్చిపోతూ అలరిస్తాయి. తమన్‌ తన నేపథ్య సంగీతంతో సీన్స్‌ను మరో స్ధాయికి తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

* కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివా నిర్వాణ
* నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
* నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్‌, రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, తదితరులు. 
* కూర్పు : ప్రవీణ్ పూడి, 
* సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
* నేపథ్య సంగీతం : తమన్‌
Read Also : వరుణ్ కిల్లింగ్ లుక్.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు