NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..

సినిమాల్లో రాముడు, కృష్ణుడు.. రాజకీయాల్లో జగదేక వీరుడు.. పేద ప్రజల కష్టాలను తీర్చిన దేవుడు.. సదా స్మరణీయుడు. క్రమశిక్షణ, ఆకుంఠిత దీక్ష, దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..

NTR 100 years special article on NTR Political life

100 Years of NTR :  తెలుగు జనతకు వందనం.. తెలుగు యువతకు అభివందనం.. తెలుగు మమతకు అభినందనం.. తెలుగు జాతికి శుభాభివందనం.. ఇది అన్న ఎన్టీఆర్‌ ప్రసంగాల్లో తొలి పలుకు.. ఆ పలుకు పెను సంచలనమైంది. తెలుగోడి సత్తాను జగమంతా చాటింది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ.. పేదల దేవుడు ఎన్టీఆర్‌. మూడు అక్షరాల ఆ పేరు తెలుగు నాట సుపరిచితం. సినిమా వాళ్లను చిన్నచూపుతో చూడకండి.. ఏదో ఒక రోజు వారు ప్రపంచాన్నే మార్చేయగలరు అని ప్రముఖ రచయిత బెర్నాడ్‌ షా మాటలను నిజం చేస్తూ చలనచిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెను సంచలనాలకు తెరతీశారు ఎన్టీఆర్‌. ఆ మహాపురుషుని శతజయంతోత్సవాలు జరుపుకుంటున్న వేళ.. యుగపురుషుడిని స్మరించుకుంటున్నారు తెలుగు ప్రజలు.

సినిమాల్లో రాముడు, కృష్ణుడు.. రాజకీయాల్లో జగదేక వీరుడు.. పేద ప్రజల కష్టాలను తీర్చిన దేవుడు.. సదా స్మరణీయుడు. క్రమశిక్షణ, ఆకుంఠిత దీక్ష, దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు ఆహర్నిశలు కృషి చేసిన యుగ పురుషుడు. సినీ ప్రియులకు ఎన్టీవోడు.. అభాగ్యులకు అన్న.. అభిమానులకు అన్నగారు.. ఒక్క మాటతో తెలుగు నేలను ఏకం చేసిన ఒకే ఒక్కడు నందమూరి తారక రామారావు. ఆయన పేరే ఓ తారక మంత్రం. పెను సంచలనం.. మన మధ్య లేకపోయినా.. ఆయన స్మరణలో ప్రతిక్షణం తెలుగు నేల పులకరిస్తుంది. అనుక్షణం ఆ మహనీయుడిని స్మరిస్తుంది. అంతలా తెలుగు హృదయాలను కట్టిపడేసిన యుగపురుషుడి కోసం ఎంత చెప్పినా.. ఇంకా ఉంటూనే ఉంటుంది. తరగని చరిత్రకు.. చెరగని చరితకు ఆయన నిలువెత్తు రూపం. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్‌ది ఓ శకం. రాజకీయాల్లో విప్లవాత్మక నిర్ణయాలకు.. పెను సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఎన్టీఆర్‌.

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్‌… సమూల మార్పులకు ఆధ్యుడు. రాజకీయం అంటే పెత్తందారులు.. భూస్వాముల హక్కుగా భావించే రోజుల్లో.. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పరిచయం చేసిన శక్తి ఎన్టీఆర్‌. ఉత్తర భారతీయులు.. ముఖ్యంగా హిందీవాళ్లు తెలుగు నాయకులను.. తెలుగు వారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలనే ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపించారు ఎన్టీఆర్‌. తన పార్టీకి తెలుగు దేశం అని పేరు పెట్టి తెలుగు శక్తి చాటిచెప్పారు. 1982లో టీడీపీని స్థాపించి చైతన్య రథంపై సుమారు 75 వేల కిలోమీటర్ల మేర పర్యటించి రాజకీయ సునామీ సృష్టించారు. 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవ శఖానికి నాంది పలికారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అధికారమే ఉండేది. ఉమ్మడి ఏపీలో ఆ పార్టీని ప్రశ్నించే నాయకుడే ఉండేవారు కాదు. జాతీయస్థాయిలో జనతాపార్టీతోపాటు వామపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా.. కాంగ్రెస్‌ రాజకీయాలు తట్టుకుని నిల్చోవడం అంటే పెను సవాలే. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పాచికలు పారలేదు. ఎన్టీఆర్‌ ప్రభంజనం ముందు ఆ పార్టీ నిలవలేదు. 1983లో జరిగిన ఎన్నికల్లో 294 స్థానాల ఉమ్మడి ఏపీ శాసనసభలో 202 స్థానాలు గెలుచుకుని ఎన్టీఆర్‌ తొలి ప్రభుత్వం కొలువుదీరింది. సినీ నటుడిగా సామాన్యుల జీవితాలపై విస్తృత అవగాహన పెంచుకున్న ఎన్టీఆర్‌.. ముఖ్యమంత్రిగా వారి కష్టాలను తీర్చాలని కంకణం కట్టుకున్నారు. కిలో రెండు రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి పేదల సేవకే ప్రభుత్వం ఉన్నదని చాటిచెప్పారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌.. తన పాలనా కాలంలో బడుగు బలహీన వర్గాలకు గృహ వసతి కల్పించడంతోపాటు వారి కోసమే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు.

రాజకీయాల్లో పెత్తందారీతనం పోవాలని భావించిన ఎన్టీఆర్‌.. తన పార్టీలో బడుగులకు పెద్దపీట వేశారు. యువకులకు పిలిచి టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అప్పటివరకు ఒకటి, రెండు సామాజిక వర్గాల వారే పెద్ద పెద్ద పదవులను అలంకరించేవారు. ఎన్టీఆర్‌ దెబ్బతో మహామహులు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సివచ్చింది. వారి స్థానంలో యువకులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఉన్న నేతల్లో చాలా మంది ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. తానొక్కడే కాదు తనతోపాటు రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా స్వచ్ఛంగా ఉండాలని అనుకునేవారు ఎన్టీఆర్‌. అవినీతికి పాల్పడుతున్నారనే ఉద్దేశంతో తన మంత్రివర్గ సహచరుడిని ఏసీబీకి పట్టించిన చరిత్ర ఆయనది. ఈ ఒక్క ఉదాహరణతో ఎన్టీఆర్‌ జీవితంలో నీతి, నిజాయితీకి ఎంత విలువ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు.

నీతి, నిజాయితీ, నిర్భీతికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్‌. అధికార దర్పానికి పూర్తిగా దూరం ఉండే ఎన్టీఆర్‌.. కేవలం ఒక్క రూపాయి వేతనం తీసుకునే సీఎంగా చరిత్రకెక్కారు. పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని.. ఆటోపై సెక్రటేరియట్‌కు వచ్చేంత సింప్లిసిటీ ఎన్టీఆర్‌కే సాధ్యం. భద్రతా కారణాలతో అధికారులు అంగీకరించకపోతే.. ప్రజాధనం వృథాగా ఖర్చు చేయడం ఇష్టంలేక తన ప్రైవేటు వాహనంలోనే ప్రయాణించి ఆ ఖర్చు కూడా తానే భరించిన గొప్పవ్యక్తిత్వం ఎన్టీఆర్‌ది..

ప్రజలు తనకెంతో ఇచ్చారని.. తాను కూడా ప్రజలకు ఏదో చేయాలనే అనుక్షణం పరితపించే వ్యక్తిత్వం ఎన్టీఆర్‌ సొంతం. సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్‌.. నడవడిక కూడా అంతే సంచలనం సృష్టించేది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, దేవుడి మాన్యాలకు పన్నులు రద్దు, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, సంపూర్ణ మద్యనిషేధం ఇలా ఒకటేమిటి ఎన్టీఆర్‌ అమలు చేసిన పథకాలు చరిత్రలో సువర్ణధ్యాయాన్ని లిఖించాయి. తన విలక్షణ వ్యక్తిత్వంతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్‌లో ఓ మొండి ఘటం కూడా ఉంది. ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటే.. ఇక వెనక్కి తిరిగి చూసేవారు కాదు. 1989లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా, శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టక ముందే పత్రికల్లో ఆ సమాచారం రావడంతో మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించిన ధీశాలి ఆయన. ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచం అస్సలు ఉండేది కాదు. ఎవరు ఏమనుకున్నా.. ప్రజలకు మేలు చేసేది అయితే ఒకే చెప్పడమే ఎన్టీఆర్‌కు తెలుసు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగానే మహిళలపై వేధింపులకు సంబంధించిన అప్పటి బీజేపీ నేత విద్యాసాగర్‌రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మద్దతు పలికారు. ఇలా మహిళల పక్షపాతిగా నిరూపించుకున్న ఎన్టీఆర్‌… దేశచరిత్రలో తొలి ప్రైవేటు బిల్లుకు చట్టరూపం తెచ్చిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు.

విప్లవాత్మక ఆలోచనలకు.. సంచల నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్‌ హయాంలో బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆరే. స్థానిక సంస్థల్లో యువకులు, బీసీల ప్రాతినిధ్యం పెరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దిగువస్థాయి నుంచి నాయకత్వం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎంపీపీ, జడ్‌పీ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకు డైరెక్ట్‌ ఎలక్షన్‌ పెట్టి ఎందరో యువకులను రాజకీయాల్లోకి తెచ్చారు ఎన్టీఆర్‌. ఉమ్మడి ఏపీలో తొలిసారిగా ఏడుగురు బీసీ నాయకులు జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా ఎన్నిక కావడం ఎన్టీఆర్‌ పుణ్యమే. అంతేకాదు అట్టడుగు స్థాయి నుంచి ప్రతిఒక్కరూ రాజకీయాల్లోకి రావాలని ఆశించిన ఎన్టీఆర్‌… క్రమశిక్షణ విషయంలోనూ అంతేకఠినంగా ఉండేవారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు వేసి పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగేలా కృషి చేశారు. ఎవరైనా కట్టుతప్పితే వెంటనే పార్టీ నుంచి తప్పించేవారు. క్రమశిక్షణ లేని వారిని ఏమాత్రం క్షమించేవారు కాదు ఎన్టీఆర్. మూడు సార్లు సీఎంగా పనిచేసినా ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయన గొప్పతనాన్ని చాటిచెబుతోంది.

తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్‌.. జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ చైర్మన్‌గా పనిచేసి కాంగ్రెసేతర పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యేందుకు విశేష కృషి చేశారు. ఇప్పుడంటే కూటమి రాజకీయాలు కీలకంగా మారాయి. కానీ, రెండున్నర దశాబ్దాల క్రితమే కూటమి రాజకీయాలు సృష్టించి.. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు ఎన్టీఆర్‌. 1989లో ఎన్టీఆర్‌ సారథ్యంలోని నేషనల్‌ ఫ్రంట్‌ కూటమి అధికారం చేపట్టింది. ప్రధానిగా పనిచేసే చాన్స్‌ వచ్చినా వద్దనుకున్న ఎన్టీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ప్రధాని చేసి తాను మాత్రం తెలుగు వారి సేవకే పరిమితమయ్యారు. 1985లో మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం చెలరేగిన అల్లర్లు.. సానుభూతిపవనాలను తట్టుకుని 35 మంది ఎంపీలును గెలిపించుకున్నారు ఎన్టీఆర్‌. ఆ సమయలో దేశవ్యాప్తంగా మిగిలిన పార్టీలన్నీ అడ్రస్‌ గల్లంతైతే… లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది టీడీపీ. ఇలా జాతీయస్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది టీడీపీ. ఇది ఎన్టీఆర్‌ గొప్పతనం.. ఆయన రాజకీయ చతురుత వల్లే సాధ్యమైందని ఇప్పటికీ చెప్పుకుంటారు.

NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?

ప్రతిఒక్కరూ చదువు కోవాలని కోరుకునే ఎన్టీఆర్‌.. తన పాలనా కాలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ హయాంలోనే ఎస్‌సీ, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. పేదల పిల్లలు కూడా హాయిగా చదువుకునే అవకాశం ఎన్టీఆర్‌ కాలం నుంచే మొదలైంది. అంతేకాదు విజయవాడలో ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఎన్టీఆర్‌ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. ఇవేకాదు ఎన్టీఆర్‌ కోసం చెప్పాలంటే ఓ చరిత్ర పాఠం తిరగేసినట్లే.. ఊరూరా ఆస్పత్రులు.. ప్రతిపేదవాడికి శాశ్వత నివాసం.. రైతుల ప్రగతికి తీసుకున్న నిర్ణయాలు ఇలా ఓ సంక్షేమ రాజ్యాన్నే స్థాపించారు ఎన్టీఆర్‌. అందుకే ఆయన యుగ పురుషుడిగా.. ప్రజా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

NTR 100 Years : ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తండ్రిగా భావించే నటుడు ఎవరో తెలుసా?

1989లో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో నటించారు ఎన్టీఆర్‌. ఆ సినిమాలో అవినీతిపై దండెత్తిన ఆర్మీ మేజర్‌గా నటించిన ఆయన అప్పటి సర్కార్‌ విధానాలను ఎండగట్టారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించి.. అప్పటి అధికార పక్షానికి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేశారు.

NTR 100 Years : సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్‌ నటుడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్‌ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారు. బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి వ్యాయామం చేయడంతోపాటు.. సూర్యోదయానికి ముందే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకునేవారు ఎన్టీఆర్‌. పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేవారు. అవినీతి అంటే ఆమడ దూరం పెట్టేవారు. తన హయాంలో పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తే నిక్కచ్చిగా నిలదీసేవారు. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే ఎంత మాత్రం క్షమించేవారు కాదు. అంతేకాదు అధికారం వచ్చిందికదా అని ఎప్పుడూ మాట మార్చలేదు ఎన్టీఆర్‌. ఇచ్చిన మాటకు కట్టుబడే వారు. ఏదైతే చెప్పేవారో అదే చేసి చూపించారు. తప్పుడు వాగ్దానాలు.. తప్పించుకునే ధోరణి ఎన్టీఆర్‌ చరిత్రలో కనిపించవు. పేదలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాదీక్ష తీసుకున్నారు ఎన్టీఆర్. పేదవాడి మనసు ఏంటో.. ఏం కోరుకుంటున్నాడో పక్కాగా తెలుసుకొని.. అలాంటి పథకాలే ప్రవేశపెట్టారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి నేడే.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

రాజకీయాల్లో అహర్నిశలు పేదల సంక్షేమం కోసం పనిచేసిన ఎన్టీఆర్‌.. రాజకీయాల్లోకి రాక ముందు కూడా ఎన్నోసార్లు తన సేవా నిరతిని చాటుకున్నారు. రాయలసీమ కరువు నుంచి ప్రజలకు కాపాడేందుకు సహచర నటులతో కలిసి జోలిపట్టుకుని తిరిగిన ఎన్టీఆర్‌.. ఆ తర్వాత దివిసీమ ఉప్పెన సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు స్వయంగా నడుంబిగించారు. చైనా యుద్ధ సమయంలో కూడా విరాళాలు సేకరించి ఆర్మీకి బాసటగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారు ఎన్టీఆర్‌. సినీనటుడిగా మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయనను.. మిత్రులు సన్నిహితులు వద్దని వారించినా వినలేదు. 300 పైగా చిత్రాల్లో నటించి సాంఘిక, పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఎన్టీఆర్‌.. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా.. వెండితెర ఇలవేల్పుగా కీర్తి గడించారు. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మకుటం లేని మహారాజే.