ఆపరేషన్ గోల్డ్‌ ఫిష్ – రివ్యూ

ఆది సాయికుమార్, సాషా చెత్రి, నిత్యా నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ..

  • Edited By: sekhar , October 18, 2019 / 10:57 AM IST
ఆపరేషన్ గోల్డ్‌ ఫిష్ – రివ్యూ

ఆది సాయికుమార్, సాషా చెత్రి, నిత్యా నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ..

దేశభక్తి, మతం, ఉగ్రవాదం, పాకిస్తాన్ ఈ మూడు అంశాల చుట్టూ ఓ ప్రేమ కథ.. ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా.. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ లాంటి సినిమాలతో కూల్ డైరెక్టర్‌గా ఆడియన్స్ మనసుల్లో చోటు దక్కించుకున్న సాయికిరణ్ అడివి ఆ మధ్య ‘కేరింత’ అని కొంత ట్రాక్ తప్పిన సినిమా తీసినప్పటికీ హిట్టు కొట్టాడు. ఈ సారి పూర్తిగా దారి తప్పి ఆపరేషన్ చేశాడు. గోల్డ్ ఫిష్ దొరకడం కష్ట సాధ్యమే. సాయికుమార్‌కి ఉన్న దేశభక్తి, పోలీస్ ఇమేజ్‌ను ఆది మీదకు మళ్లించేందుకు తీసిన సినిమాలా అనిపించినప్పటికీ అది కూడా ఫెయిల్యూర్ ఎటెంప్ట్..

కథ :
అనగనగా ఓ పాకిస్తాన్ ఉగ్రవాది ఉంటాడు. అతన్ని భారత సైన్యం పట్టుకుంటుంది. ఆ తర్వాత అతనికి కోర్టు ఉరి వేస్తుంది. ఈ లోగా ఓ కేంద్ర మంత్రి కుమార్తెను కిడ్నాప్ చేయుట.. ఉగ్రవాదిని వదిలేయమని డిమాండ్ చేయుట జరిగిపోతుంది. అసలా మంత్రి కూతురు ఎక్కడుందో ఉగ్రవాదులకు లీక్ వదిలేదే ఓ సైనికాధికారి. ఉగ్రవాదులకు ట్రాప్ వేయడం కోసం ఆ ప్రయత్నం చేసిన అతను ఆ మంత్రి కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి కదా… అలా కాకుండా ఆ అమ్మాయిని ఉగ్రవాదులకు దొరికేలా చేసి ఓ అమాయక వాచ్ మెన్ ప్రాణం పోయే పరిస్థితి తీసుకువస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరమీద చూడాల్సిందే.. 

Read Also : రాజుగారి గది 3 – రివ్యూ

నటీనటులు :
ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రలే చేసే ఆది ఈసినిమాలో అర్జున్ పండిట్ క్యారెక్టర్‌‌లో సీరియస్‌గా బాగా నటించాడు. అయితే ఈ క్యారెక్టర్ ఆదిలోని నటుడిని పూర్తిగా బయటపెట్టే విధంగా అయితే లేదు. రచయితగా తెలిసిన అబ్బూరి రవి తనలోని నటుడిని ఈ సినిమాలో విలన్‌గా బయట పెట్టుకున్నాడు.. రవి మాత్రమే కాదు డైరెక్టర్‌తో సహా టెక్నీషియన్స్ చాలా మంది ఈ సినిమాలో కొన్ని పాత్రల్లో కనిపించారు. ఇక హీరోయిన్ సాషా చెత్రి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ లభించకపోయినా ఉన్నంతలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.. 

టెక్నీషియన్స్ :
డైరెక్టర్ సాయికిరణ్ అడివి చాలా సహజమైన భావోద్వేగాలతో సినిమాలు తీయగలను అని ఎప్పుడో నిరూపించుకున్నాడు. పైగా ఆయన శేఖర్ కమ్ముల శిష్యుడు కూడా. అలాంటప్పుడు హాయిగా అలాంటి సినిమాలు తీసుకుంటే బాగుంటుంది కదా అనే అభిప్రాయం కలుగుతుంది తప్ప దేశభక్తి నిండిపోదు ఈ సినిమా చూస్తుంటే. 
ఓ దశలో శేఖర్ కూడా ఇలా గాడి తప్పిన సినిమాలు చేసి ‘ఫిదా’తో తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు బడ్జెట్ సమస్య కూడా బలంగా ఉంటుంది. అది అడుగడుగునా కనిపిస్తూనే ఉంది ఈ సినిమాలో. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గొడవ వేరు. ఉగ్రవాదం గొడవ వేరు. ఆజాదీ కాశ్మీరీ నినాదం పాకిస్తాన్‌ది కాదు. ఆజాదీ కాశ్మీర్ అంటే పాకిస్తాన్‌కీ భారతదేశానికీ సంబంధం లేకుండా కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా ఉంటుందని వీటన్నిటినీ కలగాపులగం చేసి డైలాగులు రాసిన రచయితను అభినందించాలి. 
శ్రీ చరణ్ పాకాల సంగీతం పర్వాలేదు అనిపించింది. సీనియర్ రైటర్ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ చక్కగా ఉన్నాయి.. సినిమాటోగ్రఫీ బాగుంది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. 
ఆడియన్స్‌ను మెప్పించేందుకు దర్శకుడు చాలా ప్రయత్నమే చేశాడు గానీ ఆ లక్ష్యం చేరుకోవడం మాత్రం అంత తేలిక కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దేశభక్తి యజ్ఞంలో మరో సినిమా సమిథ అనుకోవడం తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేదు. మరి బాక్సాఫీస్ దగ్గర ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రిజల్ట్ చూడాలంటే కొంత కాలం ఆగాలి. 

ప్లస్ పాయింట్స్
నటీనటుల పెర్ఫార్మెన్స్ 
కాలేజ్ కామెడీ 
మైనస్ పాయింట్స్
కథ, కథనం 
లాజిక్ లోపించిన డైలాగ్స్ 
ఉగ్రవాదం కాన్సెప్ట్ 
బిగ్ ఏరియాలో వర్కౌట్ చేయాలనుకోవడం