‘ఒరేయ్.. బుజ్జిగా’.. రివ్యూ..

  • Published By: sekhar ,Published On : October 2, 2020 / 01:27 PM IST
‘ఒరేయ్.. బుజ్జిగా’.. రివ్యూ..

Orey Bujjiga Review: యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల‌, సినిమా చూపిస్త‌మావ‌, ఈడోర‌కం ఆడోర‌కం, కుమారి 21 ఎఫ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాుడు. తర్వాత అతను చేసిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగే ‘గుండెజారి గల్లంత‌య్యిందే’ చిత్రంతో ఇండ‌స్ట్రీని ఆకట్టుకున్న ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్ కుమార్‌కు కూడా త‌ర్వాత ఆశించిన స్థాయి స‌క్సెస్ రాలేదు.




హిట్ కోసం ఎదురుచూస్తున్న రాజ్‌ త‌రుణ్‌, కొండా విజ‌య్‌ కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’.. మాళవిక నాయర్, హెబా పటేల్ కథానాయికలు.. కె.కె.రాధామోహన్ నిర్మాత.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో మేక‌ర్స్ ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో విడుద‌ల చేశారు. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ విషయానికొస్తే..
నిడ‌ద‌వోలులోని కోటేశ్వ‌ర‌రావు(పోసాని కృష్ణ‌ముర‌ళీ) కాంట్రాక్ట‌ర్‌. అత‌ని కొడుకు శ్రీనివాస్‌(రాజ్‌ త‌రుణ్‌). తల్లి చ‌నిపోవ‌డంతో జ్యోతిష్యుడు చెప్పిన దాని ప్ర‌కారం కొడుకు శ్రీనివాస్‌కు పెళ్లి చేయాల‌నుకుంటాడు కోటేశ్వ‌ర‌రావు. కానీ పెళ్లి చేసుకోవ‌డం న‌చ్చ‌ని శ్రీనివాస్ ఊరు వ‌ద‌లి వెళ్లిపోవ‌డానికి ట్రైన్ ఎక్కుతాడు.




సరిగ్గా సమ‌యంలో అదే ఊరిలో ఉండే చీఫ్ ఇంజ‌నీర్ చాముండేశ్వ‌రి(వాణీ విశ్వ‌నాథ్‌) కూతురు కృష్ణ‌వేణి(మాళ‌వికా నాయ‌ర్‌) కూడా పెళ్లి చేసుకోవ‌డం ఇష్టం లేక ఇంట్లో నుంచి వచ్చేస్తుంది. ఇద్ద‌రూ ఒకే ట్రైన్ ఎక్కుతారు. దాంతో శ్రీనివాస్ అలియాస్ బుజ్జిగాడు, కృష్ణ‌వేణి లేచిపోయార‌నే పుకార్లు మొద‌లవుతాయి.

అయితే ట్రైన్‌లో శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి మంచి స్నేహితులు అవుతారు. శ్రీనివాస్ ముద్దు పేరు బుజ్జిగాడు అని తెలియ‌దు. ఊర్లో తామిద్దరం లేచిపోయామనే పుకారు మొద‌లైంద‌నే విష‌యం కృష్ణ‌వేణికి తెలుస్తుంది. దాంతో ఆమె బుజ్జిగాడు మీద పీక‌ల‌దాకా కోపం పెంచుకుంటుంది. మ‌రోవైపు కృష్ణ‌వేణి కార‌ణంగా ఇంట్లో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని తెలుసుకున్న బుజ్జిగాడు, ఆమెను వెతికి ప‌ట్టుకొస్తాన‌ని కృష్ణ‌వేణి అమ్మ‌కు ప్రామిస్ చేస్తాడు.




కృష్ణ‌వేణి కూడా స్వాతి అని పేరు మార్చి చెప్ప‌డంతో, బుజ్జిగాడు కూడా కృష్ణ‌వేణినే త‌ను వెతుకుతున్న స్వాతి అని తెలియ‌క ఆమెతో స్నేహం చేస్తాడు. అస‌లు శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి వేర్వేరు కార‌ణాల‌తో ట్రైన్ ఎక్కార‌నే నిజం తెలియ‌క కుటుంబ స‌భ్యులు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. తాను ప్రేమించిన సృజ‌న‌(హెబ్బాప‌టేల్‌) మోసం చేసి పోవ‌డంతో బుజ్జి మ‌ళ్లీ తిరిగి ఊరికి వెళ్ల‌లేని ప‌రిస్థితి వస్తోంది.

శ్రీనివాస్‌, కృష్ణ‌వేణి ఒక‌రంటే ఒక‌రికి తెలియ‌కుండా ప్రేమ‌లో ప‌డతారు. ఇద్ద‌రి మ‌ధ్య క‌న్‌ఫ్యూజ‌న్స్ ఎలా క్లియ‌ర్ అయ్యాయి. బుజ్జి, కృష్ణ‌వేణి క‌లుస్తారా? లేదా? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.




నటీనటులు..
రాజ్‌త‌రుణ్ గ‌త చిత్రాల కంటే ఈ సినిమాలో కాస్త యాక్ష‌న్ డోస్ పెరిగింది. కొండా విజ‌య్‌కుమార్ ఎప్ప‌టి క‌థ‌నో స్క్రీన్‌పై చూపిస్తూ ఆ కామెడీకి ప్రేక్షకుడు క‌నెక్ట్ అవుతాడ‌నకుని పెద్ద పొరపాటే చేశాడు. స్క్రీన్‌ప్లే చాలా వీక్.. మాళ‌వికా నాయ‌ర్‌, హెబ్బా పటేల్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. యూత్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా ల‌వ్‌ట్రాక్ లేదు. పోసాని, వాణీ విశ్వ‌నాథ్‌, అజ‌య్ ఘోష్‌, న‌రేష్, మ‌ధు నంద‌న్‌, స‌ప్త‌గిరి, స‌త్య‌ అంద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అయితే న‌టీన‌టుల‌ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా వినియోగించుకున్న‌ట్లు అనిపించ‌లేదు.

టెక్నీషియన్స్..
అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాట‌ల్లో ‘ఈమాయ పేరేమిటో…’ అనే మాంటేజ్ సాంగ్ బాగుంది. కాన్సెప్ట్ ప్రకారం ఇలాంటి సాంగ్స్‌ను మన ప్రేక్ష‌కులు చాలా సినిమాల్లో చూసేశారు. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకునేలా లేదు. ఇక అండ్రూ కెమెరా ప‌నితనం పర్లేదనిపిస్తోంది. లొకేష‌న్స్ ప‌రంగా పెద్ద‌గా కష్టపడకుండా సినిమాను చుట్టేశారు. చూడాల్సిన సినిమాలేవీ లేవు కనుక ఓ సారి చూద్దాం అనుకుంటే ‘ఒరేయ్.. బుజ్జిగా’.. చూడొచ్చు..