విజయ్ దేవరకొండ ముందే అర్జున్ రెడ్డిపై హీరోయిన్ విమర్శలు

  • Published By: vamsi ,Published On : November 28, 2019 / 09:39 AM IST
విజయ్ దేవరకొండ ముందే అర్జున్ రెడ్డిపై హీరోయిన్ విమర్శలు

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా అతనికి అర్జున్ రెడ్డి సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ వేరే. ఈ సినిమా తెలుగులో విడుదలైనా.. ఇప్పటికే మరో రెండు భాషల్లో సినిమాని రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ బాలీవుడ్‌లో కూడా రికార్డ్‌లు క్రియేట్ చేసింది.

అయితే అక్కడ అర్జున్ రెడ్డి సినిమాని ఎన్ని వివదాలు చుట్టుముట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కబీర్ సింగ్. ఈ సినిమాను మెచ్చుకున్నవారికంటే నోటికొచ్చినట్లు తిట్టిన వారి సంఖ్యే ఎక్కువ. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలపై ప్రముఖ మలయాళ నటి పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు.

విజయ్ దేవరకొండ ముందే ఆమె ఆ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాల్లో తనకు అవకాశం వస్తే మాత్రం అస్సలు నటించనంటూ గట్టిగా విమర్శించారు. ‘ఓ ట్రాజెడీ సినిమాను చూశాక కాసేపు బాధపడి మర్చిపోతాం. కానీ కబీర్ సింగ్ లాంటి సినిమాలో ఓ హీరో.. హీరోయిన్‌ను కొడితే ఈ సీన్లకు.. అబ్బాయిలు యూట్యూబ్‌లో చేసిన కామెంట్స్ చూసి షాకయ్యాను. సామాజిక బాధ్యత లేకుండా ఇలాంటి సినిమాలు చేసే హీరోలకు నేను దూరంగా ఉంటాను. యవతపై చెడు ప్రభావం చూపే సినిమాలు అస్సలు చేయను అంటూ కాస్త గట్టిగానే వ్యాఖ్యలు చేసింది పార్వతి. 

ఇక పార్వతి చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఒక సినిమాను బట్టి వ్యక్తి క్యారెక్టర్‌ ఉండదు. మన కుటుంబం, మనం చదువుకున్న స్కూల్, తల్లిదండ్రులు మనల్ని పెంచిన తీరుపై ఆధారపడి మన క్యారెక్టర్ మారుతూ ఉంటుంది. నేను నటించే సినిమా వివాదాలకు కారణం అయినా కూడా నాకు కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తాను అని అన్నారు విజయ్ దేవరకొండ. సినిమాలను ఒక్కక్కరు ఒక్కో కోణంలో చూస్తారని, చూసే కోణం బట్టి సినిమాలు ఉంటాయని అన్నారు.

నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను దీని గురించే ఆలోచిస్తుంటే నా హెల్త్ పాడయ్యేట్లు ఉంది. నేను మాములుగా ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకుంటాను. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేశారు. కానీ కొందరు అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియకుండా కామెంట్లు చేస్తున్నారని సీరియస్ అయ్యారు విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమాపై పార్వతి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఈ విషయంలో ఆమెపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆమె సినిమలు కూడా నాకు చాలా నచ్చాయి. కానీ నాకు కోపం వచ్చేది ఎక్కడంటే.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న హడావుడి. నెటిజన్స్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావట్లేదు. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తన సినిమాల్లోంచి మధ్యలోనే వెళ్లిపోయినవారు ఉన్నారని, కొందరు నిర్మొహమాటంగా సినిమాలు నచ్చలేదని చెప్పారని, అప్పుడు కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అంతేనని, ఇటీవల డియర్ కమ్రెడ్ సినిమాని గోవాలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించినప్పుడు ఒక చిన్న పాప తన దగ్గరకు వచ్చిందని, సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పిందని, సెకెండాఫ్ బాగా లేదని చెప్పిందని, ఎవరి అభిప్రాయానికి అయినా విలువ ఇవ్వాల్సిందే అని అన్నారు విజయ్ దేవరకొండ.