Chiranjeevi : చిరంజీవి‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

పవన్ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉంటారు. వేరే సినిమాల హీరోల ఫంక్షన్లకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ..పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా చిరంజీవినే టార్గెట్ చేశారు.

Chiranjeevi : చిరంజీవి‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

Chiranjeevi

Pawankalyan fans takes Chiranjeevi: మెగా కంపౌండ్‌ను సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. హీరోతో సంబంధం లేకుండా.. మెగాస్టార్ ఫ్యామిలీపై ఉండే అభిమానాన్ని చాటుకుంటారు అభిమానులు. తమ హీరోలపై ఈగ వాలనివ్వరు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే చెప్పాల్సిన పనే ఉండదు. పవర్ స్టార్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. పోస్టులు, ట్వీట్లతో సోషల్ మీడియా మోతమోగిపోతుంటుంది. ఓ రేంజ్‌లో తిట్టిపోస్తారు అభిమానులు. పవన్ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉంటారు. వేరే సినిమాల హీరోల ఫంక్షన్లకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ..పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా చిరంజీవినే టార్గెట్ చేశారు.

అన్న అంటే పవన్‌కు భయంతో కూడిన గౌరవం. పీఆర్పీ పెట్టినప్పుడు అన్న అడుగు జాడల్లో నడిచాడు పవన్. సినిమాల్లోకి వచ్చినా.. రాజకీయాల్లోకి వెళ్లినా అన్నయ్యే నాకు ఆదర్శం అని రెండు రోజుల కిందటే ప్రకటించాడు తమ్ముడు. ఒక్క పవన్‌కే కాదు.. మెగా హీరోలకు రోల్ మోడల్ చిరంజీవి. ఇండస్ట్రీకి రూట్ చూపించడమే కాకుండా… నేమ్, ఫేమ్ సంపాదించి పెట్టిన చిరంజీవిని నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అభ్యంతరకరమైన కామెంట్స్‌తో ఆగ్రహం చూపిస్తున్నారు.

అసలు తమ్ముడి ఫ్యాన్స్ అన్నను ఎందుకు టార్గెట్ చేశారు. పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సిన అవసరం ఏంటి.. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. కరోనాతో ఇబ్బంది పడుతున్న చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఏపీ సీఎం జగన్ కొన్ని రాయితీలు ప్రకటించారు. ఏపీలో థియేటర్లు, మల్టీప్లెక్సులకు సంబధించి 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలల విద్యుత్‌ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేశారు. 2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు కరెంట్ బిల్లులను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఏపీ సర్కార్. కరోనాతో కుదేలైన ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలవాలని జగన్ నిర్ణయించడంతో… మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్నందుకు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ.. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో వైఎస్ జ‌గ‌న్‌ ఆదుకున్నారని.. తద్వారా వేలాది కుటుంబాలకు ఊరట లభించింద‌ని ప్రశంసించారు.

ఈ ఒక్క ట్వీట్ ఇప్పుడు అన్నాదమ్ముళ్ల ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టింది. మా నాయకుడు అధికార పక్షంపైన, సీఎం జగన్‌పైన పోరాటం చేస్తుంటే.. ఈ ప్రశంసలు ఏంటి అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. చిరంజీవి ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జనసేనకు ఇబ్బంది అవుతోందంటూ తమ్ముడి పార్టీ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తిరుప‌తిలో జ‌గ‌న్‌ను విమర్శించి రెండు రోజులు కాలేదు.. ఉప ఎన్నిక ముందు జగన్‌ను అభినందించడమేంటంటూ మండిపడుతున్నారు. తమ్ముడు పొలిటికల్ కెరీర్‌ను నాశనం చేసేలా చిరు ట్వీట్ ఉందంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే అన్నయ్య ఏది చేసిన ఆలోచించే చేస్తారు.. మీరు అనవసరంగా ఆవేశపడకండి అంటున్నారు చిరు ఫ్యాన్స్. అన్నయ్య వల్లే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చింది.. అలాంటి అన్నయ్యనే ట్రోల్ చేస్తారా.. అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. చిరంజీవిని ట్రోల్ చేసేముందు ఆలోచించుకోవాలి అంటూ చురకలేస్తున్నారు. తమ్ముళ్ళూ చిరంజీవి ప్రశంసించింది రాజకీయ వేదికమీద కాదు. ఇండస్ట్రీకి సంభంధించిన విషయంలో మెచ్చుకున్నారు. మీలో పవర్ లేదు ఆలోచన శూన్యం. ఆలోచనతో పని చేయండి ఆవేశంతో కాదు. అంటూ పవన్ ఫ్యాన్స్‌కు సూచనలిస్తున్నారు. ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.