Bheemla Nayak: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడే.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్. దగ్గుబాటి రానా, పవన్ కలయికలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Bheemla Nayak: భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడే.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Bheemla Nayak

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్. దగ్గుబాటి రానా, పవన్ కలయికలో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ(23 ఫిబ్రవరి 2022) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది చిత్రయూనిట్. సోమవారమే(ఫిబ్రవరి 21న) ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో వాయిదా పడింది.

ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌‌లో జరగనుండగా.. ఈరోజు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ విషయంలో ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈరోజు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.

సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుండగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యూసుఫ్‌గూడ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అమీర్‌పేట, మైత్రివనం నుంచి వచ్చే వాహనాలు యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు.

-సవేరా ఫంక్షన్ హాల్-కృష్ణకాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా ట్రాఫిక్ మళ్ళింపుకు చర్యలు తీసుకున్నారు.
-జూబ్లిహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్‌గూడ వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్ళిస్తారు.
-సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ముందుగా 21వ తేదీ కార్యక్రమం కోసం ఇచ్చిన పాస్‌లు ఇవాళ పనిచేయవని పోలీసులు వెల్లడించారు. పాత పాసులతో వచ్చేవారిని లోనికి అనుమతించమని స్పష్టం చేశారు పోలీసులు. ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే పెట్టుకోవాలని స్పష్టం చేశారు.