విలువైన మద్దతు ఇచ్చారు…అమీర్ కు మోడీ థ్యాంక్స్

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2019 / 05:27 AM IST
విలువైన మద్దతు ఇచ్చారు…అమీర్ కు మోడీ థ్యాంక్స్

దేశంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ పదార్థాలపై నిషేధం విధించాలన్న ఉద్యమానికి విలువైన మద్దతు అందిస్తున్నందుకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ఇవాళ(ఆగస్టు-28,2019)ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అమీర్…ఉత్తేజపరిచే మాటలు ఇతరులను ప్రేరేపించడం ద్వారా ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని మోడీ ట్వీట్ చేశారు.

మహాత్ముడి జయంతి(అక్టోబర్-2)రోజు నుంచి ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ పదార్థాలపై నిషేధం కోసం కొత్త ప్రజా ఉద్యమాన్ని లాంఛ్ చేయబోతున్నట్లు తన మన్ కీ బాత్ ప్రసంగంలో మోడీ చెప్పిన విషయం తెలిసిందే. ఆగస్టు-15న ఎర్రకోటపై ప్రసంగం సమయంలోనూ మోడీ దీని గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో  సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉండే అమీర్ ఖాన్..మోడీ మిషన్ కు మద్దతు ప్రకటించారు. మనందరం ప్రధాని మోడీ తీసుకున్న చొరవకు బలమైన మద్దతు తెలపాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలంటూ సోమవారం అమీర్ ఖాన్ ట్వీట్ చేశారు.

అక్టోబర్-2 నుంచి  అన్ని రైల్వే స్టేషన్‌లతో పాటు రైళ్లలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ పదార్థాలపై నిషేధం విధించాలని భారత రైల్వే ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా 360 ప్రధాన స్టేషన్‌లలో వాటర్‌ బాటిళ్లను నిర్వీర్యం చేసేందుకు 1,853 క్రషింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించనుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ మంచినీటి బాటిళ్లను, కూల్‌డ్రింక్‌ బాటిళ్లను తిప్పిపంపే ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డ్‌ ఇండియన్‌ రైలే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఐఆర్‌సిటిసి)ని కోరింది.

ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల సరఫరాను నిలిపివేయాలని రైల్వే సరఫరాదారులు, విక్రేతలను రైల్వే అధికారులు కోరారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తూ తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూలమైన తిరిగి వాడదగిన చేతి సంచుల వినియోగాన్ని రైల్వేలు ప్రోత్సహించాలని రైల్వే అధికారులకు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, ప్లాస్టిక్‌ కవర్లు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగి ఉండకూడదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.