రాంగోపాల్ వర్మ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 07:55 AM IST
రాంగోపాల్ వర్మ అరెస్ట్

విజయవాడ : దర్శకుడు రాంగోపాల్ వర్మను గన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ సిద్దమయ్యాడు. హోటల్ లో ప్రెస్ మీట్ కు యాజమాన్యం  నిరాకరించంది. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ లో నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతానని వర్మ ప్రకటించాడు. అలర్ట్ అయిన పోలీసులు ముందు జాగ్రత్తగా వర్మను అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్టు వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు వర్మను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్ కి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది అన్యాయం అని వాపోయాడు. ప్రజాస్వామ్యంలో ప్రెస్ మీట్ పెట్టుకునే హక్కు లేదా అని పోలీసులను ప్రశ్నించాడు. వర్మ తీరుపై టీడీపీ నాయకులు మండిపడ్డాడు. మరుగున పడిపోయిన సినిమా పబ్లిసిటీ కోసమే వర్మ ఇదంతా చేస్తున్నాడని విమర్శించారు.

వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మే 1న ఏపీలో రిలీజ్ కానుంది. తాను విజయవాడలో ల్యాండ్ అవుతున్నట్లు ఆదివారం (ఏప్రిల్ 28,2019) ట్విట్టర్ ద్వారా వర్మ తెలిపాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1న విడుదల కానుంది, విజయవాడలోని నోవాటెల్‌లో ప్రెస్ మీట్ ఉంటుందని ట్విట్టర్ లో ప్రకటించాడు. ఆ కాసేపటికి వర్మ మరో ట్వీట్ చేశాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం…కానీ ఆ హోటల్ వాళ్లకి ఎవరో వార్నింగ్ ఇవ్వటం మూలాన భయంతో పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఐలాపురంలో హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం. వారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. హోటల్స్, క్లబ్బుల యజమానులు.. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని” ట్వీట్‌లో తెలిపాడు. నోవాటెల్‌లో కాకుండా నడి రోడ్డుపై ప్రెస్‌మీట్ పెడుతున్నట్లు వర్మ ప్రకటించాడు. పైపుల రోడ్డులో NTR circle దగ్గర today sunday 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపాడు. మీడియా మిత్రులకి, NTR నిజమైన అభిమానులకి..నేనంటే అంతో..ఇంతో..ఇష్టమున్న ప్రతీవారికి, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ వర్మ ట్వీట్ చేశాడు.