రెండు పార్ట్‌లుగా పుష్ప.. అక్టోబర్ 13న విడుదల!

రెండు పార్ట్‌లుగా పుష్ప.. అక్టోబర్ 13న విడుదల!

Pushpa

టాలీవుడ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రాల‌లో ఒక‌టి ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప. రంగస్థలం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి, ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. అల్లూ అర్జున్ లుక్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. లారీ డ్రైవ‌ర్‌గా అల్లూ అర్జున్, గిరిజ‌న యువ‌తిగా ర‌ష్మిక మందనా ఈ సినిమాలో క‌నిపించ‌బోతున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వాయిదా పడగా.. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నఈ సినిమా ఇప్పట్లో పూర్తి కాదు అని అంటున్నారు. డిసెంబర్ నాటికి సినిమా రెడీ అవ్వవచ్చునని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాని తక్కువ నిడివితో… రెండు భాగాలుగా థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందనే మరో టాక్ సినిమా వర్గాల్లో వినిపిస్తుంది.

ముందుగా సిద్ధమైన సినిమా వరకు అక్టోబర్ 13వ తేదీన ఫస్ట్ పార్ట్‌గా రెండు గంటల నిడివితో విడుదల చేసి, తర్వాత పార్ట్‌ని పండుగకు విడుదల చెయ్యాలని భావిస్తున్నట్లుగా సినీవర్గాల సమాచారం.

సినిమాలో కథ రెండు భాగాలుగా ఉందట.. ఎర్రచందనం రవాణా కూలీగా ప్రారంభమై డాన్‌గా ఎదిగిన హీరో కథలో తొలిసగం అంతా రఫ్‌గా ఇప్పటికే విడుదలైన లుక్‌లో సాగుతుందని, డాన్‌గా అయ్యాక.. స్టైలీష్ లుక్‌లోకి సినిమా మారిపోతుందని చెబుతున్నారు. ఫాజిల్ పోషిస్తున్న అటవీ రేంజర్ పాత్ర ఇంటర్వెల్ బ్యాంగ్ టైమ్‌కు ఎంటర్ అవుతుందని చెబుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుష్పని రెండు పార్ట్‌లుగా చేస్తే ఎలా వుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం.

ఫస్ట్ పార్ట్ పూర్తి చెయ్యాలంటే.. 25రోజులు షూట్ చేస్తే సరిపోతుంది. కోవిడ్19 ప్రభావం అక్టోబర్ నాటికి పూర్తిగా తగ్గిపోతే.. థియేటర్లలో విడుదలై ఫస్ట్ పార్ట్ 200 కోట్లు.. సెకండ్ పార్ట్ 200 కోట్లు మార్కెట్ చేసుకోవచ్చనేది నిర్మాతలు ఆలోచిస్తున్న విషయం. నిర్మాణ వ్యయం కోవిడ్ కారణంగా ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. నిర్మాతలు లాభాల్లో పడాలంటే మాత్రం ఈ రకంగా ప్లాన్ చెయ్యాలని అంటున్నారు.