ఇదే లారెన్స్ గొప్పతనం: పుట్టినరోజు చేసుకోను.. దత్తత తీసుకుంటే చదివిస్తా!

  • Published By: vamsi ,Published On : October 29, 2019 / 10:47 AM IST
ఇదే లారెన్స్ గొప్పతనం: పుట్టినరోజు చేసుకోను.. దత్తత తీసుకుంటే చదివిస్తా!

తమిళనాడు బోరు బావి చిన్నారి సుజిత్ విల్సన్ తిరిగి రావాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. అయితే చివరకు రెండేళ్ల సుజిత్ బోరు బావిలోనే ప్రాణాలు వదిలి బయటకు వచ్చాడు. అధికారులు నాలుగు రోజులు కష్టపడి చేసిన పని చివరకు వృధాగా మిగిలింది. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ప్రజలతో దేశం కోరుకుంది. అయితే అది జరగలేదు. ఈ క్రమంలోనే సుజిత్ మరణం తనను కలచివేసిందని, ఆ కారణంగానే ఇవాళ(అక్టోబర్ 29వ తేదీన) తన పుట్టినరోజు జరుపుకోట్లేదంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించాడు దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.

ఇదే సమయంలో బిడ్డను కోల్పోయి శోకంలో మునిగిపోయిన సుజిత్ తల్లిదండ్రులకు ఒక సూచన చేశాడు. సుజిత్ మరణం దేశ ప్రజలను బాధపెట్టింది అని, దేశ ప్రజల గుండెల్లో సుజిత్ ఎప్పటికీ బతికే ఉంటాడని అన్నారు. అయితే, దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని.. ఆ పిల్లాడికి సుజిత్ అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందని లారెన్స్ చెప్పుకొచ్చారు. సుజిత్ తల్లిదండ్రులు ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటే.. ఆ పిల్లవాడి చదువుకోవడానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని కూడా లారెన్స్ చెప్పుకొచ్చారు.

లారెన్స్ చేసిన సూచనను మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. వాస్తవానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు లారెన్స్‌కు కొత్తేమీకాదు. ఆయన సొంతంగా చారిటీని నడుపుతున్నారు. వందల మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించారు. వరదలు వచ్చినప్పుడు స్వయంగా వెళ్లి సహాయం అందించారు. సంపాదించే మొత్తంలో చాలా వరకు లారెన్స్ సేవా కార్యక్రమాలు చేసేందుకే ఉపయోగిస్తుంటారు.