RRR: షూటింగ్ పూర్తిచేసిన జక్కన్న.. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్!

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.. కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుడితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంది

RRR: షూటింగ్ పూర్తిచేసిన జక్కన్న.. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్!

Rrr

RRR: రాజమౌళి, రామారావు, రామ్ చరణ్.. కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుడితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంది. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. కరోనా ప్రభావంతో కాస్త వెనక్కు తగ్గినా అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూనిట్ ఘంటాపదంగా చెప్తుంది.

అందుకు తగ్గట్లే రాజమౌళి శరవేగంగా పనులు చక్కబెడుతున్నాడు. ఈ మధ్యనే ఉక్రెయిన్ లో భారీ షెడ్యూల్ షూటింగ్ చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్ అనూహ్యంగా ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. చిన్నా చితకా పికప్ షాట్స్ మినహా అధికారికంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటన వచ్చింది. అనూహ్యంగా 2018 నవంబర్ 19న బైక్ షాట్ తో మొదలైన ఆర్ఆర్ఆర్ షూటింగ్ తాజాగా చివరికి బైక్ షాట్ తోనే ముగిసినట్లుగా టీమ్ పేర్కొంది.

షూటింగ్ పూర్తి కావడంతో ఇక యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టి చకచకా అది కూడా ముగించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. ఇది సాధ్యం కాదని ప్రచారం జరిగినా యూనిట్ మాత్రం మౌనంగానే తన పని తాను చేసుకుపోతుంది. అయితే, యూనిట్ చెప్పిన డేట్ ప్రకారం విడుదల తేదీకి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కావడంతో ఆర్ఆర్ఆర్ అనుకున్న సమయానికి రావడం సాధ్యమే అనిపిస్తుంది. మరి దీనిపై జక్కన్న అండ్ కో మరోసారి క్లారిటీ ఇస్తే బాగుండు!